విశాఖపట్నం: రాష్ట్రంలోని మహిళలకు తెలుగుదేశం పార్టీ కాలకేయుల నుంచి రక్షణ కల్పించాలని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. టీడీపీ ఇప్పుడు ‘తెలుగు దండుపాళ్యం పార్టీ’గా తయారైందన్న ఆమె, రాష్ట్రంలో ఎక్కడా మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. గతంలో మాదిరిగా దిశ యాప్, దిశ పోలీస్‌స్టేషన్లు.. ఆ వ్యవస్థ లేకపోవడం వల్లనే ఆ పరిస్థితి వచ్చిందని వెల్లడించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో దుర్గాట జాన్ అనే టీడీపీ నాయకుడు 16 ఏళ్ల బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసే ఘోరమైన దుస్థితికి పాలన దిగజారిందని వరుదు కళ్యాణి ఆక్షేపించారు. ఇంత జరిగినా ఆయన కనీసం స్పందించలేదని గుర్తు చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం సొంత జిల్లాలు, హోం మంత్రి నియోజకవర్గంలో దారుణంగా అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా ఏ చర్యలు తీసుకోవడం లేదని దుయ్యబట్టారు. చివరకు పోలీస్ కుటుంబాలకే రక్షణ లేకుండా పోయిందన్న ఎమ్మెల్సీ, శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో సీఐ తల్లిని కిడ్నాప్ చేసి, దారుణంగా హత్య చేసిన ఘటనను ఉదహరించారు. ఇవన్నీ చూస్తుంటే అసలు మనం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నామా?. లేక ఆటవిక రాజ్యంలోనా? అన్న అనుమానం కలుగుతోందని అన్నారు. ఎన్ని కేసులుంటే అన్ని పదవులు ఇస్తామని లోకేశ్ గతంలో చేసిన ప్రకటనను గుర్తు చేసిన వరుదు కళ్యాణి, దాన్ని ఆదర్శంగా తీసుకుని టీడీపీ నేతలు ఆరాచకాలకు దిగుతున్నారా? అని నిలదీసారు. రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు దారుణంగా మండుతున్నా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న ఎమ్మెల్సీ, ప్రభుత్వ పెద్దలు రెడ్ బుక్ రాజ్యాంగం మీద పెట్టిన దృష్టి నిత్యావసరాల ధరల నియంత్రణ మీద పెట్టి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. ధరల నియంత్రణకు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో సరుకుల ధరలు పెరిగితే, ఎంఐఎస్ (మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీమ్) ద్వారా రూ.7758 కోట్లతో సరుకులు కొని ప్రజలకు తక్కువ ధరకు అందజేశారని గుర్తు చేశారు. కేవలం హెరిటేజ్ సూపర్ మార్కెట్‌లో ధరలు పెంచడానికి మార్కెట్‌లో వ్యాపారులతో కుమ్మక్కై, ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవడం లేదా? అని వరుదు కల్యాణి ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే, ప్రజల పక్షాన పోరాడతామని ఆమె హెచ్చరించారు.