అమరావతి: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రానిది తప్పు లేదని, సీఎం వైయస్ జగన్ ఏం చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వెళ్లి కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేయాలని అజ్ఞాన వాసి పవన్ కల్యాణ్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మండిపడ్డారు. పవన్ మాట్లాడేది కనీసం ఆయనకు అయినా అర్థమవుతుందా అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ కేంద్రానిదని, రాష్ట్రానికి చెందినది కాదని పవన్ ఇప్పటికైనా తెలుసుకుంటే బాగుంటుందని హితవు పలికారు. తాడేపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దు అంటూ సీఎం వైయస్ జగన్ ఈ సంవత్సరం (2021) ఫిబ్రవరి 6 , మార్చి 10 న ప్రధాని మోదీకి రెండు లేఖలు రాశారన్నారు. మే 20న అసెంబ్లీలో తీర్మానం చేశారని తెలియజేశారు. సీఎం వైయస్ జగన్, కేంద్రంలో భాగస్వామి కాకపోయినా ఎక్కడా తగ్గకుండా ఉక్కు సంకల్పంతో పోరాటం చేస్తున్నారని తెలిపారు. ఈ విషయం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు కూడా తెలుసునన్నారు. ఢిల్లీలో రాజ్యసభ, పార్లమెంటుల్లో రోజూ హోదా, పోలవరం, స్టీల్ ప్లాంట్ కోసం సీఎం వైయస్ జగన్ ఆదేశాల మేరకు వైయస్సార్ పీపీ నేత వి.విజయ సాయిరెడ్డి నాయకత్వాన వైయస్సార్‌సీపీ ఎంపీలు పోరాడుతున్న విష యం అందరం చూస్తున్నామని చెప్పారు. ఈ విషయాన్ని ఏబీఎన్ సైతం ప్రసారం చేసిందని, వామపక్ష పత్రిక అయినా ప్రజాశక్తి సైతం వార్తను ప్రచురించిందని గుర్తు చేశారు. వాస్తవాలు ఇలా ఉంటే పవన్ కల్యాణ్ ఏమి ఎరుగనట్లు సినీ డ్రామాను ప్లే చేస్తూ ఆందోళన చేయటం సబబుగా లేదన్నారు. 14 సంవత్సరాలు సీఎంగా ఉండి, తొమ్మిది ఏళ్లు కేంద్రంలో భాగస్వామిగా ఉండి విశాఖ స్టీల్ ప్లాంటుకు ఒడిశా లో సొంత ఇనుప గనులు చంద్రబాబు కేటాయింపచేసి ఉంటే నష్టాలూ తగ్గి, లాభాల బాట పట్టేదన్నారు.ఇది అందరూ అంగీకరించే వాస్తవమని తెలిపారు. బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన సుజనా చౌదరిని పట్టుపట్టి కేంద్ర మంత్రిని చేయడంలో చూపిన శ్రద్ధ ఉక్కు గనుల కేటాయింపులో చంద్రబాబు చూపలేదన్నారు. అయినా తన పార్టనర్ బాబుని అనడానికి పవన్‌కు మనసొప్పదని తెలిపారు. బాబు కాలిలో ముళ్ళు గుచ్చుకొంటే పవన్ కంటిలో కన్నీరు వస్తుందన్నారు. బీజేపీ మీద ఉద్యమం చేయకుండా వైఎస్సార్ సీపీ మీద ఉద్యమం చేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటన చేస్తున్నారని, అధికారంలో ఉన్నప్పుడూ, లేనప్పుడూ ఎప్పుడూ వైఎస్ జగన్ మీద, వైఎస్సార్‌సీపీ మీద విమర్శలు చేయడం ఆయనకు అలవాటు అయిపోయిందని దుయ్యబట్టారు. సినిమాల్లో డైరెక్టర్ ఏం చెబితే అది చెప్పడం, కమర్షియల్‌గా హిట్ రావాలంటే ఏ డైలాగ్స్ చెబితే బాగుంటుందంటే వాటిని వాడటం, స్క్రిప్ట్ ఏది ఉంటే అది చెప్పడం పవన్‌కు బాగా అలవాటుగా మారిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యానికి పవన్ కల్యాణే హానికరం అని ప్రజలు అంటున్నారని దుయ్యబట్టారు.