విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర అని శాసనమండలి విపక్షనేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అందులో భాగంగనే స్టీల్ ప్లాంట్‌లో 3,725 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తూ, వారికిచ్చిన కార్డులను రద్దు చేస్తున్నారని ఆక్షేపించిన ఆయన, ఒక్క కార్మికుణ్ని తొలగించినా ఊర్కోబోమని హెచ్చరించారు. కార్మికుల ఉద్యోగాలు పరిరక్షించాలని కేంద్రాన్ని డిమాండ్ చేసిన ఆయన, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒత్తిడి చేయాలని కోరారు. స్టీల్ ప్లాంట్‌లో పరిణామాలు చూస్తుంటే.. ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతున్నట్లు కనిపిస్తోందని చెప్పారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సంబంధించి ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు సీఎం, డిప్యూటీ సీఎం కట్టుబడి ఉండాలని బొత్స అన్నారు. విశాఖపట్నం, క్యాంప్ ఆఫీస్‌లో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, గుడివాడ అమర్‌నాథ్‌తో కలసి శాసన మండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఉద్యోగాలు పీకేస్తున్నారు: అధికారంలోకి వస్తే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చిన టీడీపీ కూటమి, ఇప్పుడు ఉన్న ఉద్యోగులనే తొలగిస్తోందని మండలి విపక్షనేత ఆక్షేపించారు. 105 రోజుల్లోనే స్టీల్ ప్లాంట్ కార్మికులను, మద్యం దుకాణాల్లో పని చేస్తున్న 15 వేల మందిని తొలగిస్తున్నారని ప్రస్తావించారు. వాలంటీర్లను తొలగించబోమని వారికి రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామని చెప్పి, తీరా అధికారంలోకి వచ్చాక, దాదాపు 2.5 లక్షల మంది వాలంటీర్లను పక్కన పెట్టారని దుయ్యబట్టారు. నిత్యావసరాల ధరల మంట: రూ.99 కే క్వార్టర్ మద్యం ఇస్తున్నామని గొప్పగా చెబుతున్న ప్రభుత్వం, ఆకాశాన్నంటుతున్న నిత్యావసర సరుకుల ధరలు ఎందుకు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి ప్రశ్నించారు. అంటే, మద్యం ధరలు తగ్గించి నిత్యావసర సరుకుల ధరలు పెంచారా?. మద్యానికి ఇచ్చిన ప్రాధాన్యత సరుకులకు ఇవ్వడం లేదా? అని నిలదీశారు. ‘దాదాపు 15 వేల మంది ఉద్యోగులను రోడ్డున పడేసి, ప్రభుత్వ మద్యం షాపులన్నీ రద్దు చేసి, కొత్తగామద్యం పాలసీ ప్రకటించారు. షాప్‌లకు లైసెన్సులు ఇస్తున్నారు. దానిపై భవిష్యత్తులోప్రజలే స్పందిస్తారు. అది మీ ఇష్టం’ అన్న మాజీ మంత్రి, నిత్యావసర సరుకుల ధరలు దారుణంగా మండుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. బియ్యం, పప్పు దినుసులు, నూనె, కాయగూరలను «సామాన్యుడు కొనలేని పరిస్థితి నెలకొందని గుర్తు చేసిన ఆయన, తమ ప్రభుత్వ హయాంలో వాటి ధరలన్నీ నియంత్రించామని చెప్పారు. ఇప్పుడు మండుతున్న ధరలపై ప్రభుత్వం కనీసం సమీక్ష కూడా చేయడం లేదని దుయ్యబట్టారు. ‘లులూ’ను వద్దనుకున్నాం: విశాఖలో లులూ ప్రాజెక్టును తామే వద్దనుకున్నామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఎకరం వంద కోట్లు విలువ చేసే 13 ఎకరాల్లో లులూ సంస్థ కేవలం రూ.600 కోట్లతో మాల్ కడతామని ప్రకటించిందని ఆయన తెలిపారు. అది గిట్టుబాటుగా లేకపోవడంతో ఒప్పందం రద్దు చేసుకున్నామని చెప్పారు. అందుకు ప్రత్యామ్నాయంగా పోర్టు హాస్పిటల్ పక్కన ఇనార్బిట్ మాల్‌లో రూ.600 కోట్లతో 2 వేల మందికి ఉపాథి కల్పించేలా ఐటీ టవర్ కట్టిన విషయాన్ని గుర్తు చేసిన మాజీ మంత్రి, ఇప్పుడు విశాఖ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని కోరారు.