పేదలు తెలుగు మీడియంలోనే మగ్గిపోవాలా? 

ఎమ్మెల్యే ఆర్కే రోజా
 

చిత్తూరు: ఇంగ్లీషు మీడియం చదువులను వ్యతిరేకిస్తున్న నేతలంతా తమ పిల్లలను మాత్రం ఇదే మాధ్యమంలో చదివిస్తున్నారని ఏపీఐఐసీ చైర్ పర్సన్, ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా చిత్తూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం, ఆమె మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ నాయకులు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే చాలా బాధాకరంగా వుందని మండిపడ్డారు. ఎందుకంటే, టీడీపీ నాయకుల పిల్లలు మాత్రం ఇంగ్లీషు మీడియంలో చదువుకోవచ్చు, విదేశాలకు వెళ్లి చదువుకోవచ్చు గానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ పేదలు మాత్రం తెలుగు మీడియంలోనే మగ్గిపోవాలన్న ఆలోచనలోవారు ఉన్నట్టు అర్థమవుతోందని దుయ్యబట్టారు. ఇంగ్లీషు మీడియంలో తమ పిల్లలను చదివించే పవన్ కల్యాణ్, చంద్రబాబునాయుడు లాంటి వాళ్లు ‘తెలుగు’ను ఉద్ధరిస్తారా? అంటూ సెటైర్ విసిరారు. పేదపిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదువుకుంటే ‘తెలుగు’ చచ్చిపోతుందనడం ఏంటో తనకు అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు. ఈరోజు ఉన్న పోటీ ప్రపంచంలో ‘ఇంగ్లీషు’ అనేది చాలా ముఖ్యం అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Read Also: సీఎంను కలిసిన నూతన సీఎస్‌ నీలమ్‌ సాహ్న

తాజా వీడియోలు

Back to Top