అనంతపురం: ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టినట్లు అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో మహోన్నత ఆశయంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారని అన్నారు. శనివారం నగరంలోని డ్రైవర్స్ కాలనీలో ఉన్న బుడ్డప్ప నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ హెల్త్ క్యాంప్‌ను ఎంపీ రంగయ్య, మేయర్ వసీం, నగర పాలక సంస్థ కమిషనర్ భాగ్యలక్ష్మితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 62 లక్షల కుటుంబాలు ఆరోగ్యవంతంగా ఉండాలన్న ధ్యేయంతో 45 రోజుల పాటు ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ వైద్య శిబిరాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతపురం నియోజకవర్గంలో 21 క్యాంపులు చేపట్టనున్నామన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టలేదని, సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు.
గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకువచ్చి ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు. తండ్రికి తగ్గ తనయుడిగా రెండు అడుగులు ముందుకు వేసి ఆరోగ్యశ్రీని పటిష్టం చేశారని, 3256 వ్యాధులకు వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. తాజాగా ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టిపట్లు తెలిపారు. ఐదు దశల్లో స్క్రీనింగ్ చేస్తామని, మెరుగైన వైద్యం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ రెఫరల్ ఆస్పత్రుల్లో చేర్చి వైద్యం అందిస్తామన్నారు. ఇప్పటికే వాలంటీర్లు, ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు ఇంటింటి సర్వే చేశారని తెలిపారు.

అనంతపురం ఎంపీ రంగయ్య మాట్లాడుతూ.. కుటుంబ స్థాయిలో ఆరోగ్యం ఎలా ఉందో పరిశీలించనున్నట్లు తెలిపారు. ప్రజలు తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల ఆరోగ్య పరిస్థితి తెలుస్తుందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష సాహసోపేత నిర్ణయమని, ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. అనంతరం వైద్య శిబిరానికి వచ్చిన వారితో ఎమ్మెల్యే అనంత మాట్లాడారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా వైద్య సిబ్బంది సేవలు అందించాలని సూచించారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని తెలిపారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ రమణారెడ్డి, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, ఎంహెచ్‌ఓ గంగాధర్‌రెడ్డి, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ ఓబిరెడ్డి, వక్ఫ్‌బోర్డు జిల్లా చైర్మన్ కాగజ్‌ఘర్ రిజ్వాన్, కార్పొరేటర్లు మీనాక్షి, జయమ్మ, లీలావతి, సైఫుల్లాబేగ్, సంపంగి రామాంజినేయులు, బాబా ఫకృద్దీన్, శ్రీనివాసులు, వైద్య సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.