ప‌వ‌న్ బీజేపీతో గొడ‌వ ప‌డి..టీడీపీలోకి వెళ్తున్నట్లుగా ఉంది

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ, ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు

కౌలు రైతుల మీద మా ప్ర‌భుత్వానికి ప్రేమ‌, అభిమానం ఉన్నాయి

ఎవరి పల్లకీ మోయను అంటూనే బాబు పల్లకీ తప్ప అన్న కండిషన్‌ పెట్టుకున్నట్టుగా ఉంది

తాడేప‌ల్లి:  జ‌న‌సేన అధినేత‌ పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు చూస్తే బీజేపీతో ఏదో గొడవపడి... టీడీపీకి వచ్చేస్తున్నా అని స్పష్టమైన సంకేతాలు ఇవ్వటానికి ఒక మీటింగ్‌ అనే డ్రామా ఆడినట్టుంది ఉంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు వ్యాఖ్యానించారు. ఇది ‘‘బాబూ వచ్చేస్తున్నా’’ మీటింగ్‌! అని అభివ‌ర్ణించారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌ను అంబ‌టి రాంబాబు తిప్పికొట్టారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

– కౌలు రైతులమీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రేమ, అభిమానం ఉన్నాయి కాబట్టే, చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా... రైతులకే కాకుండా, కౌలు రైతులకు, ఆర్‌వోఎఫ్‌ఆర్‌ రైతులకు కూడా జగన్‌గారి ప్రభుత్వం వైయస్సార్‌ రైతు భరోసాగా ఏటా రూ.13,500 చొప్పున అయిదేళ్లలో రూ.67,500 అందిస్తోంది.
– భీమవరం, గాజువాక... రెండు చోట్ల పోటీచేసి రెండు చోట్లా ఓడిపోయిన పవన్‌ కల్యాణ్‌... తెలుగుదేశం ఈ రెండు చోట్లా పోటీలో లేకపోయినా ఓడిన పవన్‌ కల్యాణ్‌... 2024లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలవదని శాపనార్థాలు పెట్టాడు. ఒక్క విషయం గుర్తు చేస్తున్నాం... ఇలాగే, 2019కి ముందు, జగన్‌గారు ముఖ్యమంత్రి అయితే తాను రాజకీయ సన్యాసం చేస్తానని కూడా ఇతనే అన్నాడు.  
– రాజకీయ సన్యాసం చేస్తే ప్యాకేజీలు రావని... నిస్సిగ్గుగా ఆయన వైయస్సార్‌ కాంగ్రెస్‌ మీద విమర్శలు చేయటం కనిపిస్తూనే ఉంది. ఇలాంటి పల్టీ నాయకుడిని చూసి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ భయపడిపోతోందట! 
– ఎవరి పల్లకీ మోయను అంటూనే చంద్రబాబు పల్లకీ తప్ప అన్న కండిషన్‌ పెట్టుకున్నట్టుగా... అదే తన పరమార్థం అన్నట్టుగా కనిపిస్తోంది. టీడీపీ అధికారంలో ఉంటే టీడీపీ వ్యతిరేక ఓటును చీల్చాలి... అదే వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంటే, వైయస్సార్‌ కాంగ్రెస్‌ వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకోవాలి. ఇదే పవన్‌ కల్యాణ్‌కు తెలిసిన రాజకీయం. ఇదే చంద్రబాబు ఆయనకు ఇచ్చిన ఎసైన్‌మెంట్‌.  దీనికోసం ఆయన కాపుల్ని వాడుకుంటాడు, రైతుల పేరు చెపుతాడు... ఏదైనా మాట్లాడతాడు. 
– జగన్‌గారు ఢిల్లీలో ప్రధానిని, కేంద్ర మంత్రుల్ని కలిస్తున్న సమయంలో... మరోవంక పవన్‌ ఇప్పటికిప్పుడు విజయవాడలో దిగి, నడిపించిన ఈ డ్రామా చూస్తే ఇదో పిట్టల దొర వ్యవహారంగా కనిపిస్తోంది. 
– ఈ అంశంమీద మరింత వివరంగా రేపు 11 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌ మీట్‌లో మాట్లాడతాను.
 

తాజా వీడియోలు

Back to Top