ఏపీలో మరో 11 పట్టణాల్లో క్లీన్‌ ఎయిర్‌

రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ : నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద గాలి నాణ్యతను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నంతోపాటు అదనంగా మరో 11 పట్టణాలను ఎంపిక చేసినట్లు పర్యవరణ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్వినీ కుమార్ చౌబే వెల్లడించారు. రాజ్యసభలో గురువారం వైయ‌స్ఆర్‌సీపీ  సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ 15వ ఆర్థిక సంఘం నివేదికి ప్రకారం నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నంకు అదనంగా మరో 11 పట్టణాలను  గుర్తించినట్లు తెలిపారు. ఎంపిక చేసిన పట్టణాల్లో శ్రీకాకుళం, చిత్తూరు, ఒంగోలు, విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, అనంతపురం, కడప, కర్నూలు, గుంటూరు, నెల్లూరు ఉన్నట్లు చెప్పారు. జాతీయ స్వచ్ఛ గాలి కార్యక్రమం కింద పైన పేర్కొన్న పట్టణాల్లో గాలి నాణ్యత పెంచేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.  
విశాఖపట్నం, విజయవాడ నగరాలలో గాలి నాణ్యతను మెరుగు పరిచేందుకు పనితీరు ఆధారిత గ్రాంట్‌ను ఇస్తూ 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది.  ఈ గ్రాంట్‌ కింద విజయవాడకు 2022-23లో 163 కోట్లు కేటాయించగా, 2021-22లో 100.35 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. అలాగే 2022-23 సంవత్సరం వరకు విశాఖ నగరానికి 148 కోట్లు కేటాయించగా, 2021-22 వరకు 100.75 కోట్లు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top