ఏపీలో సహజ వాయువు నిక్షేపాలు అపారం

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో సహజవాయువు నిక్షేపాలు అపారంగా ఉన్నాయని పెట్రోలియం శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్‌ తేలి తెలిపారు. రాజ్యసభలో సోమవారం వైయ‌స్ఆర్‌సీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో వెలికితీయ వలసిన సహజ వాయువు నిక్షేపాలు 27 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల వరకు ఉండవచ్చునని అంచనా వేసినట్లు చెప్పారు. దేశీయంగా సహజ వాయువు వెలికితీతను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
దేశంలో సహజ వాయువు ఉత్పత్తిని గణనీయమైన రీతిలో పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన అనేక సంస్కరణల గురించి మంత్రి వివరించారు. దేశీయంగా ఉత్పత్తి అయ్యే సహజ వాయువు ధరలను నిర్ధారించేందుకు 2014లో ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను ప్రకటించింది. హై ప్రెజర్‌-హై టెంపరేచర్‌ కలిగిన ప్రాంతాలు, అత్యంత లోతైన జలాల నుంచి వెలికి తీసే గ్యాస్‌ ధరలను ఒక పరిమితి దాటకుండా ఆపరేటర్లే నిర్ధారించుకునే స్వేచ్ఛను ప్రభుత్వం కల్పించినట్లు ఆయన చెప్పారు. అలాగే ఉత్పత్తి చేసిన సహజ వాయువును మార్కెట్‌ చేసుకునే స్వేచ్ఛ కూడా కల్పించినట్లు తెలిపారు. కోల్‌ బెడ్‌ నుంచి ఉత్పత్తి చేసే మీథేన్ వాయువు ధరల నిర్ణయం, మార్కెటింగ్‌కు ప్రభుతవం ఇదే విధమైన స్వేచ్ఛ కల్పించింది. అలాగే నిర్దేశిత లక్ష్యం కంటే అధికంగా గ్యాస్‌ను వెలికి తీసే ఆపరేటర్లకు ప్రోత్సాహకం కింద 10 శాతం వరకు రాయల్టీ మినహాయింపు కల్పించింది. పెట్రోలియం, గ్యాస్‌ వెలికితీసే రాష్ట్రాలకు చెల్లించే రాయల్టీని కేంద్ర ప్రభుత్వం సవరించే ప్రతిపాదన ఏదైనా ఉందా అన్న ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ప్రస్తుతానికి రాయల్టీని సవరించే ప్రతిపాదన ఏదీ లేదని తెలిపారు. 2003లో ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని అనుసరించి విలువను బట్టే రాయల్టీని నిర్ధారిస్తున్నట్లు మంత్రి తెలిపారు. క్రూడాయిల్‌, గ్యాస్‌పై రాష్ట్రాలకు చెల్లించే రాయల్టీని 2004లో సవరించినట్లు చెప్పారు. 

గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో బయోమెట్రిక్‌ బోర్డింగ్‌
డిజి యాత్ర ప్రాజెక్ట్‌లో భాగంగా విజయవాడ (గన్నవరం) ఎయిర్‌పోర్ట్‌లో త్వరలోనే బయోమెట్రిక్‌ బోర్డింగ్‌ విధానాన్ని ప్రారంభిస్తునట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ తెలిపారు. రాజ్యసభలో సోమవారం వైయ‌స్ఆర్‌సీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో బయోమెట్రిక్‌ బోర్డింగ్‌ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించిన అన్ని పనులు పూర్తయినట్లు చెప్పారు. డిజి యాత్ర తొలి దశ కింద గన్నవరంతోపాటు కోలకతా, వారణాసి, పూనే, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లలో వచ్చే ఏడాది మార్చి నాటికి బయోమెట్రిక్‌ బోర్డింగ్‌ విధానం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top