విజయవాడ: ఆంధ్రజ్యోతి మీడియా హిందువుల మనోభావాలు దెబ్బతీస్తోందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఇలానే వ్యవహరిస్తే హిందువులు ఆంధ్రజ్యోతి ని బహిష్కరిస్తారని హెచ్చరించారు. శారదా పీఠంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ధర్మాన్ని కాపాడే పీఠం అడిగినప్పుడు స్థలం ఇవ్వడంలో తప్పేంటని టీడీపీ నేతలను ప్రశ్నించారు. గతంలో వైయస్సార్, చంద్రబాబు ప్రభుత్వాలలో కూడా భూములు ఇచ్చారని గుర్తు చేశారు. కొన్నెళ్ల క్రితం చిన్నజీయర్ సంస్థ కి భూములు కేటాయించాం.. ఇప్పుడు శారదా పీఠంతో పాటు గణపతి సచ్చిదానంద స్వామి ట్రస్ట్ కి కూడా ఇస్తున్నామని తెలిపారు. కాగా, చంద్రబాబు హయాంలో మాత్రం.. రాయపాటి, నారా లోకేష్ లకు అప్పనంగా భూములు ఇచ్చారని మంత్రి వెల్లంపల్లి విమర్శించారు. సీఎం వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ధర్మం కాపాడే పీఠానికి భూములు ఇస్తుంటే టీడీపీ నేతలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు.