అంగబలం ఉందని బిల్లులు అడ్డుకోవడం సిగ్గుచేటు

ప్రజా కోర్టులో చంద్రబాబు ఎప్పటికీ దోషే

లోకేష్‌ చౌద‌రి ప్రోత్సాహంతోనే మంత్రులపై దాడులు

ప్రజలకు మంచి జరగకూడదనే దురుద్దేశంతోనే బిల్లులు అడ్డుకున్నారు

చైర్మన్‌ సీట్‌ విలువలను దిగజార్చే విధంగా ప్రవర్తించారు

బిల్లులను అడ్డుకొని టీడీపీ శునకానందం పొందుతోంది

మండలిలో టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఆగ్రహం

తాడేపల్లి: ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం శాసనసభలో ఆమోదించిన కీలక బిల్లులు మండలిలో అడ్డుకొని తెలుగుదేశం పార్టీ శునకానందం పొందుతుందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మండిపడ్డారు. మండలిలో అంగబలం ఉందని టీడీపీ ఇష్టారీతిగా ప్రవర్తించిందన్నారు. నారా లోకేష్‌ చౌదరి ప్రోత్సాహంతోనే టీడీపీ సభ్యులు దీపక్‌రెడ్డి, బీద రవిచంద్ర తనపై, మంత్రులు కన్నబాబు, అనిల్‌ కుమార్‌ యాదవ్‌పై దాడి చేశారని మండిపడ్డారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ సభలో ఫొటోలు తీయొద్దని చెప్పినందుకు లోకేష్‌ దాడికి తెగబడ్డాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్ర వ్యూహం ప్రకారమే సభలో టీడీపీ సభ్యులు గుండాలుగా, రౌడీలుగా ప్రవర్తించారని మండిపడ్డారు. ప్రజా కోర్టులో చంద్రబాబు ఎప్పటికీ దోషిగా మిగిలిపోతారని, రానున్న స్థానిక ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవన్నారు. తనపై, మంత్రులు కన్నబాబు, అనిల్‌పై టీడీపీ సభ్యులు చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే..
దేశ వ్యాప్తంగా వీర సైనికుల త్యాగాలను గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున, వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం తరుఫున నివాళులర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. 

స్వయం ప్రకటిత మేధావి, అసెంబ్లీ రూల్స్‌ బుక్‌ తానే తయారు చేశానని ఫీలయ్యే యనమల రామకృష్ణుడు.. అసెంబ్లీలో పాస్‌ చేసిన బిల్లులను మండలిలో అడ్డుకొని తీరుతామని చెప్పాడు. కుట్రపూరితంగా ద్రవ్య వినిమయ బిల్లును కూడా మండలిలో అడ్డుకున్నారు. చంద్రబాబు తీరు అసెంబ్లీలో ఒక రకంగా, మండలిలో ఒక రకంగా ఉంది. చంద్రబాబుకు దమ్మూ, ధైర్యం ఉంటే అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు ఎందుకు చర్చకు రాలేదు. గవర్నర్‌ ప్రసంగాన్ని కూడా టీడీపీ బహిష్కరించింది. 

మండలిలో అంగబలం ఉందని ఇష్టారీతిగా ప్రవర్తించారు. చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న వ్యక్తులు ఆ సీట్లో కూర్చున్నప్పుడు ప్రభుత్వ బిల్లులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. గతంలో చైర్మన్‌ నా విచక్షణాధికారం అని చెప్పి రూల్స్‌కు విరుద్ధంగా ప్రవర్తించారు. డిప్యూటీ చైర్మన్‌ కూడా నిన్న అదే రీతిలో ప్రవర్తించారు. 

చైర్మన్‌ సీట్‌లో కూర్చొని నాకు ఎస్‌కార్ట్‌ తీసేశారు.. గన్‌మెన్‌లను, ప్రోటోకాల్‌ తీసేశారని డిప్యూటీ చైర్మన్‌ మాట్లాడడం అతని నీచ వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. చైర్మన్‌ సీట్లో కూర్చొన్న వ్యక్తి మా వాళ్లకు కూడా చెప్పడం జరిగిందని టీడీపీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడడం ఎంత వరకు సమంజసం.  

మనీ బిల్లు ఆమోదించిన తరువాతే సభను వాయిదా వేయాలని గతంలో స్పీకర్‌గా పనిచేసిన సురేష్‌ కూడా చెప్పడం చూశాం. కానీ, దానికి విరుద్ధంగా మిగతా బిల్లులను పెండింగ్‌ పెట్టి సెక్షన్‌ 90 అని చెప్పి సభలో గందరగోళం సృష్టించారు. 

రూల్‌ 90 ప్రకారం చర్చ జరగాలంటే 24 గంటల ముందు లీడర్‌ ఆఫ్‌ ది హౌస్, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రికి తెలియజేయాలని 94 రూల్‌ క్లియర్‌గా చెబుతుంది. ప్రజల ద్వారా తిరస్కరించబడిన యనమల రామకృష్ణుడు.. తనను ఓడించిన ప్రజల మీద పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే నిన్న సభలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడు.  

తెలంగాణలో అరెస్టు అయ్యి టీడీపీ నుంచి సస్పెండ్‌ అయిన దీపక్‌రెడ్డి మండలిలోకి మంత్రులు ఎలా వస్తారని మాట్లాడుతున్నాడు. రాజ్యాంగ విలువలు తెలియని వ్యక్తులకు కూడా పెద్దల సభకు పంపించిన చంద్రబాబుకు బుద్ధిలేదు. డిమాండ్లు ప్రవేశపెట్టినప్పుడు సమాధానం చెప్పాల్సింది మంత్రులు కాదా..? 

శాసనమండలిలో లోకేష్‌ ప్రవర్తన చూసి సిగ్గేస్తోంది. మండలిలో కూర్చొని సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీసి బయటకు పంపిస్తున్నాడు. ఏంటని ప్రశ్నిస్తే నాపై, ఇతర మంత్రులపై దాడి చేశాడు. 

తమ పార్టీని ఓడించిన ప్రజలకు ప్రభుత్వం ద్వారా మంచి జరగకూడదని, సంక్షేమ పథకాలు అమలు చేయకూడదని, ఉద్యోగుల జీతాలు రాకుండా ఉండేందుకు బిల్లులను టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు. 

అమరావతిలో కృత్రిమంగా సృష్టించిన ఉద్యమాన్ని కాపాడుకుంటున్నానని షో చేయడానికి తప్ప అమరావతి రైతుల మీద, రాష్ట్ర ప్రజల మీద చంద్రబాబుకు ప్రేమ లేదు. మండలి లాంజ్‌లో కూర్చొని రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నాడు. 

ప్రజలకు మంచి చేయాలనే తపనతో టీడీపీ దాడులను, తిట్లను బరిస్తున్నాం. అదే మేము తిరగబడితే మీరు ఉండగలుగుతారా..? ఈ దాడులకు ప్రధాన కారణం నారా లోకేష్‌ చౌదరి, ఆయన ప్రోత్సహాంతోనే కౌన్సిల్‌లో దీపక్‌రెడ్డి, బీద రవిచంద్ర గుండాలులా ప్రవర్తించారు. 
 

Back to Top