విజయవాడ: బాలికపై ఆత్మహత్యకు కారణమైన టీడీపీ నేత వినోద్ జైన్ లాంటి వ్యక్తులకు సంఘంలో చోటు ఉండకూడదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయవాడలో బాలిక ఆత్మహత్య ఘటన చాలా దురదృష్టకరమన్నారు. ఆ బాలిక ఎంతో మనో వేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పారు. టీడీపీ నేత వినోద్ జైన్ ఆ బాలికను లైంగికంగా ఇబ్బందులకు గురి చేసాడు. 50ఏళ్ల వయసున్న వినోద్ జైన్ దారుణంగా ప్రవర్తించాడన్నారు. ఎన్నో రకాలుగా అరాచకంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టినట్టు కుటుంబ సభ్యులు చెప్పారని తెలిపారు. బాలిక మూడు పేజీల లేఖ రాసి ఆత్మహత్య చేసుకుందంటే.. ఆమె ఎంత వేదనకు గురైందో అర్ధం చేసుకోవచ్చు అన్నారు. లిఫ్ట్ వద్ద, మెట్ల వద్ద అతను అసభ్యంగా ప్రవర్తించాడని, మానవత్వం లేని వ్యక్తికి సంఘంలో చోటు ఉండకూడదని హెచ్చరించారు. వినోద్ జైన్ కేశినేని నాని ముఖ్య అనుచరుడని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన వినోద్ తరపున చంద్రబాబు గతంలో ప్రచారం చేసాడని గుర్తు చేశారు. ఈ ఘటనపై చంద్రబాబు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. చంద్రబాబు ఇలాంటివారిని ప్రోత్సహిస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు పార్టీ వాళ్ళే ఇలాంటి ఘటనలకు పాల్పడుతుంటే ఆయన మహిళల గురించి మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాప కుటుంబానికి న్యాయం చేయాలని ఆదేశించారని పేర్కొన్నారు. ఈ ఘటన పై ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు తీవ్రంగా స్పందించి, నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారని తెలిపారు. పాప తల్లిదండ్రుల బాధను చూడలేకపోతున్నామని, నిందితుడిని కఠినంగా శిక్షిస్తామన్నారు. కనకదుర్గమ్మ తల్లి ఆ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నానని అన్నారు. దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని, బాలిక కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వినోద్ జైన్ ను టీడీపీ సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటే సరిపోదని, కచ్చితంగా ఈ ఘటనపై చంద్రబాబు సమాధానం చెప్పాలని మంత్రి డిమాండు చేశారు.