సభ్యులు అడిగిన ప్రశ్నకి మంత్రులు సమాధానం చెప్పాలి

శాస‌న మండ‌లి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ 

 అమరావతి:  సభ్యులు అడిగిన ప్రశ్నకి మంత్రులు సమాధానం చెప్పాల‌ని  శాస‌న మండ‌లి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీ అసెంబ్లీలో వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు వర్సెస్‌ మంత్రులు అన్నట్టుగా చర్చ నడుస్తోంది. వైయ‌స్ఆర్‌సీపీ నేతలు అడుగుతున్న ప్రశ్నలకు కూటమి నేతల వద్ద సమాధానం లేకపోవడంతో సభను తప్పుదోవ పట్టించే విధంగా మంత్రులు ఆవేశంతో ఊగిపోతున్నారు. తాజాగా మంత్రి సత్య కుమార్‌ సమాధానం చెప్పకుండా డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేశారు.

అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలపై జవాబు ఇవ్వాల్సిన బాధ్యత మంత్రులపై ఉంటుంది. కానీ, ఏపీ శాసన మండలిలో​ మాత్రం మంత్రులు దీనికి విరుద్దంగా ప్రవరిస్తున్నారు. సమావేశాల సందర్బంగా నేడు మండలిలో మెడికల్‌ కాలేజీల నిర్మాణాలపై చర్చ జరిగింది. ఈ క్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రభుత్వమే పూర్తి చేస్తారా? లేదా?. సీట్ల భర్తీ కోసం ఏ ఫార్ములాని  అనుసరిస్తున్నారు. గుజరాత్ ఫార్ములాని అమలు చేస్తున్నారా?. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉన్న సీట్లను నీట్‌ కౌన్సెలింగ్ ద్వారా చేయాలన్నారు.

ఎమ్మెల్సీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన మంత్రి సత్య కుమార్‌ ఆవేశంతో ఊగిపోయారు. సమాధానం చెప్పకుండా.. డైవర్ట్‌ చేసే విధంగా కామెంట్స్‌ చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..‘సభ్యులు అడిగిన ప్రశ్నకి మంత్రి సమాధానం చెప్పాలి. మెడికల్ కాలేజీలకు నాబార్డు నుండి లోన్ తెచ్చాం. 50శాతం కేంద్రం గ్రాంట్ ఇచ్చిందని చెప్పడం సమంజసం కాదు. పులివెందుల మెడికల్ కాలేజీ నిర్మాణం జరిగితే విమర్శించడం ఏంటి?. అందరిని రెచ్చగొట్టేలా మంత్రి మాట్లాడటం కరెక్ట్‌ కాదు. మంత్రి సత్య కుమార్ సభని తప్పుదోవ పట్టించారు. మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసినందుకు నిరసన తెలుపుతున్నాం. మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు నిరసనగా వాకౌట్ చేస్తున్నాం’ అని తెలిపారు.

ఫ్రీ సిలిండర్లు అంటే ఇదేనా చంద్రబాబు: ఎమ్మెల్సీ వరుదు 

తన మేనిఫెస్టోతో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని పదే పదే మోసం చేస్తుందని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. మెడికల్ కాలేజి నిర్మాణాలపై గురువారం మండలిలో చర్చ జరిగింది. చర్చలో ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌  ఊగిపోతూ మాట్లాడారు. మంత్రి సత్యకుమార్‌ వ్యాఖ్యలకు నిరసనగా వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు మండలి నుంచి వాకౌట్‌ చేశారు.  

అనంతరం, ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతుంది. ఈ పదినెలల కాలంలో కుటుంబానికి ఇచ్చింది ఒక్క సిలిండరే. మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పిన మీరు ఒక్క సిలిండరే ఎందుకు ఇచ్చామన్నా ప్రశ్నిస్తున్నా మంత్రి సత్యకుమార్‌ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు.

సిలిండర్‌ ఉచితం అన్నప్పుడు డబ్బుల్ని లబ్ధి దారుడికి ఇవ్వాలి. లేదంటే వారి అకౌంట్‌లో డిపాజిట్‌ చేయాలి. అలా కాకుండా గ్యాస్‌ ఏజెన్సీలకు డబ్బులు ఎందుకు చెల్లిస్తున్నారు. ఇందులో ఏదో మతలబు దాగుందని లబ్ధి దారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి  కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి.

ఈ విధానంపై టీడీపీ నేత జ్యోతుల నెహ్రు సైతం వ్యతిరేకించారు. సొంత పార్టీ నేతలే అనుమానం వ్యక్తం చేశారంటే ఈ పథకం లోపభూయిష్టంగా ఉన్నాయన్నది అర్ధమవుతుంద‌ని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు.
 

Back to Top