గడప గడపకు చిరంజీవి వచ్చి చూస్తే తెలుస్తుంది

 చిరంజీవికి మంత్రి రోజా సవాల్..  

సినిమా వేదికలపై ప్రభుత్వాన్ని తిడితే సహించేది లేదు

కేంద్రంమంత్రిగా ఉండి చిరంజీవి ఒక్క ప్రాజెక్టు అయినా కట్టాడా? 

ప్రజల తిరస్కారానికి గురైన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసిన చిరంజీవి

విజ‌య‌వాడ‌:  గడప గడపకు సినీ న‌టుడు చిరంజీవి వచ్చి చూస్తే.. తాము ఏం అభివృద్ధి చేశామో, ఎన్ని రోడ్లు వేశామో తెలుస్తుందని మంత్రి ఆర్కే రోజా అన్నారు. సినిమా వేదికలపై ప్రభుత్వాన్ని తిడితే సహించేది లేదని మంత్రి రోజా హెచ్చ‌రించారు.  రాజకీయాలు చేయాలని అనుకుంటే, రాజకీయాల్లో ఉండి మాట్లాడాలని ఛాలెంజ్ చేశారు. అలా కాకుండా సినిమాలే చేయాలనుకుంటే, రాజకీయాల జోలికి రాకుండా సినిమాలే చేసుకోవాలని హితవు పలికారు. 

 ఏ అర్హత ఉందని సినిమా టికెట్ ధరలు పెంచమని ప్రభుత్వాన్ని అడుక్కున్నారని మంత్రి ప్రశ్నించారు. హీరోలు అందరూ కలిసి ఎందుకు వైయ‌స్ జగన్ దగ్గరికి వెళ్లారని నిలదీశారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ మినహాయిస్తే.. ఏ ఇతర హీరోలు ప్రభుత్వాన్ని విమర్శించడం లేదన్నారు.
 
ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఏపీ అభివృద్ధి చేసిన ఘనత వైయ‌స్‌ జగన్‌ది అని మంత్రి రోజా చెప్పారు.  చిరంజీవి చెబితే విని, పనిచేసే పరిస్థితిలో వైయ‌స్‌ జగన్ లేరన్నారు. కేంద్రమంత్రిగా చిరంజీవి ఉన్నప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టారని, రాష్ట్రం విడిపోతుంటే.. చిరంజీవి అప్పుడేం చేశారని నిల‌దీశారు. హోదా గురించి అప్పుడు ఎందుకు చిరంజీవి అడగలేదు? అని ప్రశ్నించారు. కేంద్రంమంత్రిగా ఉండి చిరంజీవి ఒక్క ప్రాజెక్టు అయినా కట్టాడా? అని చెప్పారు.

 
ప్రజల తిరస్కారానికి గురైన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసిన చిరంజీవి.. ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లోకి వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని రోజా పేర్కొన్నారు. తమ్ముడి మీద ప్రేమతో చిరంజీవి ఇలా మాట్లాడి, ఏదో బలాన్ని ఇవ్వాలని చూస్తున్నాడని అభిప్రాయపడ్డారు. తమని నమ్మకున్న వాళ్లను రోడ్డుమీదికి వదిలేసి.. వీళ్లు హ్యాపీగా సినిమాలు చేసుకుంటున్నారని కౌంటర్ వేశారు. సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిద రాలుతుంది అన్నట్టు.. మళ్లీ అన్నదమ్ములు కలిస్తే అలానే ఉంటుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Back to Top