రేపటికి వరద పూర్తి స్థాయిలో తగ్గుముఖం

మంత్రి పిల్లి సుభాస్‌ చంద్రబోస్‌

19 గ్రామాలకు మూడు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువుల సరఫరా

 ఏలూరు: పోలవరం వరద ప్రవాహం క్రమేపి తగ్గుతోందని,రేపటికి వరద పూర్తి స్థాయిలో తగ్గుముఖం పడుతుందని పశ్చిమగోదావరి జిల్లా ఇంచార్జి మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వరద పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రి తానేటి వనిత, జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పోలవరం ఎగువ నున్న 19 గ్రామాలకు మూడు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువుల సరఫరా చేశామన్నారు. పోలవరంలో మూడు, వేలేరుపాడు లో రెండు గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందన్నారు. ఆయా గ్రామాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం ఎగువ కాపర్‌ డ్యామ్‌ వద్ద గోదావరి వరద 26 మీటర్లు ఉందని కాపర్‌ డ్యామ్‌కు ఎటువంటి భయం లేదన్నారు. వరద గ్రామాల్లో వైద్య శిబిరాలు, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. వైద్యులు, పోలీసులు, రెవెన్యూశాఖ అధికారులు అన్ని గ్రామాల్లో అందుబాటులో ఉంచామని తెలిపారు. సమీక్ష అనంతరం మంత్రులు ప్రత్యేక లాంచీలో కొండ్రుకోట వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లారు.  
 

తాజా వీడియోలు

Back to Top