తెలుగు సినీ పరిశ్రమకు సీఎం వైయస్‌ జగన్‌ చేయూత‌

థియేటర్ల ఫిక్స్‌డ్‌ ప‌వ‌ర్‌ చార్జీలు రద్దు చేస్తూ నిర్ణయం

2019–20 నంది అవార్డుల విధివిధానాలు రూపొందించాలని ఆదేశం 

సినిమా టికెట్లను ఆన్‌లైన్‌ చేసే ఆలోచన చేస్తున్నాం

కేంద్రం అనుమతి ఇచ్చాకే థియేటర్లు తెరుస్తాం

సీఎంతో సినీ పెద్దల భేటీ అనంతరం మీడియాతో పేర్ని నాని

తాడేపల్లి: తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి తోడుగా ఉంటానని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సినీ పెద్దలకు మాటిచ్చారని రాష్ట్ర సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ అనంతరం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయ ఆవరణలో మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. సినీ పరిశ్రమ పట్ల దేశంలోనే ముందస్తుగా స్పందించిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు సినీ ప్రముఖులు ధన్యవాదాలు తెలిపారన్నారు. జూలై 15 తరువాత ఏపీలో కూడా షూటింగ్‌లు జరుపుకోవడానికి అనువైన విధానాన్ని రూపొందించి ఆర్డర్స్‌ పాస్‌ చేయాలని సినీ ప్రముఖులు విజ్ఞప్తి చేశారని, ఈ అంశంపై ఆలోచించి తప్పకుండా మంచి నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారన్నారు. 

కోవిడ్‌ టైమ్‌లో సినిమా థియేటర్లు తెరుచుకోలేదని, థియేటర్ల ఫిక్స్‌డ్‌ పవర్‌ చార్జీలు ఎత్తేయాలని సినీ ప్రముఖులు సీఎంను కోరారని, సినీ పెద్దలు విజ్ఞప్తి మేరకు స్పందించిన సీఎం వైయస్‌ జగన్‌ ఫిక్స్‌డ్‌ చార్జీలను మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారన్నారు. సినిమా టికెట్లు ఆన్‌లైన్‌ చేసే అంశాన్ని సినిమాటోగ్రఫీ డిపార్టుమెంట్, కొంతమంది అధికారులకు సీఎం అప్పగించారని, సినీ పెద్దలతో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కేంద్రం ఆదేశాల మేరకే సినిమా థియేటర్లు తెరుచుకుంటాయన్నారు.  

అదే విధంగా 2012 నుంచి నంది అవార్డులు ప్రకటించడం, ఉత్సవం చేయడం జరగడం లేదు. ఆ సంప్రదాయాన్ని మరోసారి పునరుద్ధరించాలని సినీ పెద్దలు కోరారన్నారు. 2019–20 సంవత్సరం నంది అవార్డులు ప్రకటించి అవార్డు ప్రధానోత్సవాలు చేసుకుందామని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారన్నారు. దానికి సంబంధించిన విధివిధానాలను తయారు చేయాలని సీఎం ఆదేశించారన్నారు.  

చిన్న సినిమాలకు ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నుంచి రావాల్సిన సబ్సిడీ 2000 సంవత్సరం నుంచి రిలీజ్‌ కాలేదని సినీ పెద్దలు సీఎంతో చర్చించారని, పాత విషయాలను కూడా పరిశీలించి నోట్‌ తయారు చేయాలని సీఎం ఆదేశించారన్నారు. షూటింగ్‌కు సంబంధించి విశాఖలో స్టూడియోలు నిర్మాణాలు చేసుకోవచ్చని, సినిమా పరిశ్రమల పెద్దలు ఇక్కడే ఉండాలనుకుంటే ఇళ్ల స్థలాలు కూడా కేటాయిస్తామని సీఎం చెప్పారన్నారు. 
 

Back to Top