ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీలో ధర్నా చేయాలి

మంత్రి పేర్ని నాని

ఇతర రాష్ట్రాలకు అదర్శంగా ఆంధ్రప్రదేశ్‌ నిలుస్తోంది

రాకెట్‌ కంటే వేగంగా పెట్రోల్, డీజిల్‌ ధరలను కేంద్రం పెంచుతోంది

రూ.70 పెట్రోల్‌ ధరను రూ.110కి తీసుకెళ్లారు

బీజేపీ నేతలు మాకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉంది

సెస్‌ రూపంలో కేంద్రం రూ.2.85 లక్షల కోట్లు వసూలు చేసింది

కేంద్రం వసూలు చేస్తున్న పన్నులు ఎలా ఖర్చు చేస్తున్నారు?

రూ.5 కాదు..రూ.25 తగ్గించాలని మోదీని డిమాండు చేయాలి

బీజేపీ, టీడీపీల తప్పుడు విమర్శలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు

సీఎం వైయస్‌ జగన్‌ పాలనను ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారు

వరుస ఎన్నికల్లో వస్తున్న ఫలితాలే ప్రజాదర ణకు నిదర్శనం

తాడేపల్లి:  పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ ధరల పెంపుపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేతలు ఢిల్లీలో ధర్నా చేయాలని మంత్రి పేర్ని నాని సవాలు విసిరారు. పార్లమెంట్‌ నార్త్‌ బ్లాక్‌లో ధర్నా చేస్తే తాను కూడా వస్తానని చెప్పారు.  ప్రభుత్వంపై బురద జల్లేందుకు టీడీపీ పరిమితమవుతోందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న కార్యక్రమాలు ఎక్కడైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలపై ఏపీ చేస్తున్న వ్యయం మీకు కనిపించడం లేదా అని బీజేపీ, టీడీపీ నేతలను మంత్రి నిలదీశారు. గతంలో గ్యాస్‌ ధర ఎంత ఉండేది? ఇప్పుడు ఎంత ఉందన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ పాలనను ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారని, ఇందుకు వరుస ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. బీజేపీ, టీడీపీల తప్పుడు విమర్శలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. సోమవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.

ఏ రాష్ట్రంలో లేనన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏపీలో అమలవుతున్నాయి. దేశంలో కేంద్ర ప్రభుత్వం, 28 రాష్ట్రాలను పరిశీలించినా కూడా ఏపీ ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం, ప్రభుత్వం ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేసే వ్యయం చూస్తే మిగతా రాష్ట్రాలన్ని కూడా ఏపీని చూసి వచ్చి గడిచిన రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న జరుగుతున్న కార్యక్రమాలను ఇతర రాష్ట్రాల ప్రతినిధులు వచ్చి అధ్యాయనం చేసి, వారి రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. ఈ రకమైన పోటీ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. మిగతా రాష్ట్రాలకు సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం ఆదర్శంగా ఉండటం రాష్ట్ర ప్రజలు గర్వ పడే విషయం.

గడిచిన ఏడేళ్లుగా శ్రీహరి కోటలోని రాకెట్లు వెళ్లిన ఎత్తు కంటే, షార్, ఇస్త్రో సంస్థ వదిలిన రాకెట్‌ కంటే వేగంగా దేశంలో డీజిల్, పెట్రోల్‌ ధరలను తీసుకెళ్లారు. ఇలాంటి బీజేపీ నేతలు వైయస్‌ జగన్‌ ప్రభుత్వానికి శుద్ధులు చెప్పడం ఇంతకంటే విడ్డూరం మరొకటి ఉండదేమో?. రూ.70 ధర ఉన్న లీటర్‌ డీజిల్, పెట్రోల్‌ను ఏరకంగా వంద రూపాయలు దాటించినటువంటి, ఏమాత్రం జాలి, దయ లేనటువంటి బీజేపీ ప్రభుత్వం రేపు ప్రజలు ఏమైన చేస్తారేమోనన్న భయం లేకుండా డీజిల్‌ రూ.108, పెట్రోల్‌ రూ.116 దాకా పెంచిన ఘనులు ఇవాళ రోడ్లపైకి రావడం, ఏపీ ప్రభుత్వం ధరలు తగ్గించాలని ఉత్తర కుమార ప్రగల్భాలు పలకడం చూస్తుంటే అసలు రాజకీయ నాయకులకు సిగ్గు, ఎగ్గు ఉండదని ప్రజలు ఇందుకే అనుకుంటారేమో?. రూ.70 నుంచి ఇవాళ రూ.110 పై చిలుకు పెట్రో ధరలు చేరుకోవడం, దాంట్లో నుంచి రూ.5, రూ.10 తగ్గించారని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. అక్టోబర్‌ మాసంలో పెట్రోల్‌ ధర ఎంత, నవంబర్‌లో ఎంత?. దానికి ముందు అగస్టు, సెప్టెంబర్‌లో ఎంత ధర ఉందో ప్రజలకు గుర్తు ఉండదనుకుంటున్నారా?. రూ. 5 తగ్గించి గొప్పలు చెప్పుకుంటున్నారు. 2014 నుంచి ఏపీలో 31 శాతంగా కొనసాగుతున్న మాట వాస్తవం కాదా? రూ.4 అదనపు సెస్‌ ను విడిపోయిన రాష్ట్రంలో, ఆదాయ లోటు పూర్చేందుకు ఈ మధ్య కాలంలో ఉన్న రోడ్లను, దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేసేందుకు కేవలం ఒక్క రూపాయి పెంచింది. ఒక్కసారి రోడ్ల మీదికి వచ్చే బీజేపీ నేతల తీరును ప్రజలు గమనించాలి.

ఎక్సైజ్‌ డ్యూటీలోని శాతాన్ని మాత్రమే కేంద్రం తగ్గించింది. దేశంలో రూ.47 వేల కోట్ల సెస్‌ను కేంద్రం వసూలు చేస్తోంది. ఇది కాకుండా సుమారు రూ.2.87 లక్షల కోట్ల వివిధ సెస్‌ల పేరుతో కేంద్రం వసూలు చేస్తున్నది వాస్తవం కాదా? ఇందులో ఏమైనా తగ్గిస్తున్నారా? 28 రాష్ట్రాలకు రూ.19 వేల కోట్లు ఇస్తూ మిగతాది కేంద్రానికి వెళ్తుంది. మరి రూ.2.87 లక్షల కోట్ల సంగంతి ఏంటో చెప్పాలి. బీజేపీలో నిజాయితీ, రాజకీయ నిబద్ధత ఉంటే నార్త్‌ బ్లాక్‌ వద్దకు వెళ్లి, పార్లమెంట్‌ గేట్‌ వద్ద ధర్నా చేయాలి. నిన్న తగ్గించిన రూ.5 కాకుండా, మరో రూ.20 తగ్గించాలని మోదీని అడగండి. తగ్గించవద్దని ఎవరు వద్దన్నారు.

వీర బాదుడు బాది..ఇవాళ రేట్లు అమాంతంగా పెంచి, ఏదో దయార్ధహృదయుళ్లలాగా, జాలి గల మహాప్రభువుల్లా మాట్లాడుతున్నారు. ఇంత కన్నా నీచం ఏముంటుంది. సెస్‌లు తగ్గించమనండి..రాష్ట్రానికి రావాల్సిన వాటా తగ్గినా మేం సిద్ధమే?. అందరం కలిసి పార్లమెంట్‌ వద్ద ధర్నా చేద్దాం.  వ్యక్తిగతంగా పేర్ని నాని కూడా వస్తాడు. ఊకదంపుడు ఉపన్యాసాలు అక్కడ దంచండి. ఏది ధర్మం, ఏది అధర్మం. రోడ్ల నిర్మాణం పేరుతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై వసూలు చేస్తున్నది రూ లక్ష 98 వేల కోట్లు వసూలు చేస్తున్నది గుర్తు పెట్టుకోవాలి. ఇతర సెస్‌ల పేరుతో రూ.15150 కోట్లు వసూలు చేస్తున్నారు. 

మహారాష్ట్ర, ఢిల్లీలో ఎందుకు పెట్రో ధరలు తగ్గించలేదు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, తెలంగాణ , కేరళ, మేఘాలయ, అండమాన్‌ నికోబార్, త్రిపూర, ఛత్తీస్‌ఘాడ్, ఓడిసాలో ఎందుకు తగ్గించలేదో అడగండి. బీజేపీ మొన్న జరిగిన ఉప ఎన్నికలో ప్రజలు బాగా శృంగభంగం చేయడంతో వారికి ప్రజలు గుర్తుకు వచ్చారు. ఓటర్లు దూరమవుతున్నారు..ప్రజలు క్రర కాల్చి వాత పెడుతున్నారన్న సంగతి అర్థమై..ఏదో దయార్ధ హృదయుల్లాగా ప్రజలకు దోచి పెడుతున్నట్లుగా పెట్రోల్‌ ధరలు రూ.110 వరకు పెంచి, రూ.5 తగ్గిస్తే...ఈ జిమ్మిక్కులు ప్రజలకు తెలియదనుకుంటున్నారు. అన్ని రాష్ట్రాలు తగ్గిస్తే..వైయస్‌ జగన్‌ ప్రభుత్వం తగ్గించలేదన్నట్లుగా మాట్లాడుతున్నారు. 28 రాష్ట్రాల్లో 14 రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ దొంగచాటు చర్యలను భరిస్తూ..  నవ్వుకుంటున్నారు. ఇది అమాయక చర్యగానే చూస్తున్నారు.

ప్రజలు అమాయకులా? బీజేపీ నేతలు అనుకుంటున్నట్లుగా ప్రజలు అమాయకులు కాదు.సెస్‌లు వసూలు చేస్తే రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ట్యాక్స్‌గా కాకుండా సెస్‌గా రూ.2.85 లక్షల కోట్లను డీజిల్, పెట్రోల్‌పై విపరీతమైన భారాలను మోపుతూ..ఇవాళ నీతి వాఖ్యలు చెబుతున్నారు. వీరికి తోడు 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు తోడుగా నిలిచారు. గత ఐదేళ్లు విపరీతంగా ధరలు పెంచి, ఇవాళ సూక్తులు చెబుతున్నారు. ఇవాళ ప్రతిపక్షంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. విషయ జ్ఞానం, ఇంగితం లేకుండా నిర్లజ్జగా మాట్లాడుతున్నారు. 9వ తేదీన వీళ్లు ధర్నాలు పెడతారంటా? సిగ్గుండాలి కదా? ఇంత దుర్మార్గాలకు ఒడిగడుతున్నారు. బీజేపీ నేతలను ప్రశ్నిస్తున్నాను. కేంద్రం వసూలు చేస్తున్న డబ్బులు దేనికి ఖర్చు పెడుతున్నారు. లెక్కలు చెప్పండి. ఏపీలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీరు పాలిస్తున్న ఏ రాష్ట్రంలో ఉన్నాయో చెప్పండి. విద్యను అభివృద్ధి చేసేందుకు, అక్షరాస్యత శాతాన్ని గణనీయంగా పెంచడానికి ప్రజల్లో చదువు పట్ల మక్కువ పెంచడానికి వేల కోట్ల రూపాయలు వైయస్‌ జగన్‌ ప్రభుత్వం ఇవాళ ఖర్చు చేస్తున్నది మీకు కనిపించడం లేదా? ఆరోగ్యం కోసం కోట్లు ఖర్చు చేస్తున్నాం. వైయస్‌ జగన్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఇప్పటి వరకు వివిధ సంక్షేమ కార్యక్రమాలకు ఒక లక్ష 30 వేల కోట్ల రూపాయలను అందించింది మీకు అర్థం కావడం లేదా? ప్రభుత్వ బడులు, ఆసుపత్రుల్లో నాడు–నేడు ద్వారా అభివృద్ధి చేసింది మీకు కనిపించడం లేదా?. 

రాష్ట్రంలోని బీజేపీ నేతలకు గ్యాస్‌ బండ ధర ఎంతో మీకు తెలుసా? ప్రతి ఇంట్లో ఏది ఉన్నా లేకపోయినా అత్యవసరమైన, నిత్యవసర సరుకుగా మారిన గ్యాస్‌బండ ధర ఎంతకు తీసుకెళ్లారో మీకు తెలియదా? పదండి..పార్లమెంట్‌ వద్ద ధర్నా చేద్దాం. అన్ని అయిల్‌ కంపెనీల దగ్గర ధర్నా పెట్టండి. గ్యాస్‌ పోయ్యి లేని ఇల్లు దేశంలో ఉందా? అలాంటి గ్యాస్‌ బండపై ఎంత సబ్సిడీ ఇస్తున్నారు. ఇంట్లో ఆడవాళ్లు వద్ద గ్యాస్‌ బండ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు. గ్యాస్‌ బండ, డీజిల్, పెట్రోల్‌ ధరలు తగ్గించండి..మాకు నష్టమైనా కూడా మేం డిమాండు చేస్తున్నాం..పదండి ఢిల్లీకి వెళ్లి ధరలు తగ్గించాలని ధర్నా చేద్దామని మంత్రి పేర్ని నాని సవాలు విసిరారు.

చంద్రబాబు ఐదేళ్లు ఎంత ట్యాక్స్‌లు వసూలు చేశారు. డీజిల్‌ ధరపై ఎంత సెస్‌ వసూలు చేశామని సృహ లేకుండా మాట్లాడుతున్నారు. రేపు ధర్నాకు ప్రజలు ఎలా వస్తారని చంద్రబాబు అనుకుంటున్నారు. ఈ స్థాయిలో దిగజారి మాట్లాడటం సిగ్గుచేటు.
గత ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రానికి వచ్చిన ఆదాయాన్ని, చేసిన అప్పులతో వచ్చిన డబ్బులు ఎక్కడికి వెళ్లాయో లెక్క చెప్పడం లేదు. ఇవాళ వైయస్‌ జగన్‌ ప్రభుత్వం వచ్చిన ఆదాయాన్ని, అప్పులను సరాసరి ప్రజలకు నేరుగా అందజేస్తున్నారు. ఎన్టీఆర్‌ చనిపోయే ముందు ఆత్మక్షోభతో మాట్లాడారు. చంద్రబాబు ఎన్టీఆర్‌ కన్న గొప్ప నటుడు అన్నారు.

ఇవాళ చంద్రబాబులో మహా నటుడు కనిపిస్తున్నారు. ఇష్టారాజ్యంగా ప్రెస్‌మీట్లు పెడతారు.. ఆయన మాటల్లో నిబద్ధత ఉండదు. తాను సీఎంగా ఉండి ఐదేళ్లు ఏం చేశానన్న ఆలోచన, జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నాడు. గొప్ప నటుడిగా రోజు హావాభావాలు ప్రదర్శిస్తున్నారు. ఇవాళ ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. 2019 నుంచి ఇవాళ్టీ వరకు ఏ ఎన్నిక జరిగినా కూడా ప్రజలు వైయస్‌ జగన్‌కు, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వారి గుండెల్లో స్థానం ఇచ్చి పదిలంగా చూసుకుంటున్నారు. ఇవేవి చంద్రబాబుకు కనిపించడం లేదు. ధ్రుతరాష్టు్రడిలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఆయన్ను ఆకాశానికి ఎత్తాలి..వైయస్‌ జగన్‌ను ఏదోరకంగా కూలదోయాలని తాపత్రయపడే ఓ వర్గం మీడియా ఎంత అన్యాయంగా, దుర్మార్గంగా చిత్రీకరిస్తోంది. ఆ రోజు కూడా 4 రూపాయల సెస్‌ ఉంది. ఇవాళ మా ప్రభుత్వమే సెస్‌ వసూలు చేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వారి పాపాలకు భగవంతుడు తగిన శిక్ష విధిస్తాడని భావిస్తూ..మరొక్కసారి ఏపీ బీజేపీ నేతలకు గట్టిగా చెబుతున్నాం. ప్రజలు మీ గురించి మరింత చులకనగా మాట్లాడకుండా, మీరు చేసే ధర్నాలు, పొలికేకలు, రంకెలు ఢిల్లీ వెళ్లి మరింతగా ధరలు తగ్గించాలని ధర్నాలు చేయాలని, వారికి మద్దతుగా పేర్నినాని కూడా ఉంటారని మంత్రి స్పష్టం చేశారు. 

 

Back to Top