విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజల తరఫున లేవనెత్తుతున్న ప్రశ్నలకు టీడీపీ నేతల వద్ద సరైన సమాధానాలు లేవని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు జీవనాధారంగా ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిలిపివేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. జగన్ ప్రజల కోసం పనిచేస్తే, చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు. 40 శాతం ఓటింగ్‌తోనే వైయస్ఆర్‌సీపీ బలంగా ఉందని, కోటి సంతకాల సేకరణే పార్టీకి ఉన్న ప్రజా మద్దతుకు నిదర్శనమని అన్నారు. మెడికల్ కాలేజీలపై టెండర్లు పిలిచినా ఒక్కరూ ముందుకు రాకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని, అమరావతి రైతులకు జరుగుతున్న అన్యాయంపై మాత్రమే వైయస్ఆర్‌సీపీ పోరాడుతోందని తెలిపారు. గుండెపోటుతో రైతు మృతి చెందిన ఘటనలో ఇప్పటివరకు ఆ కుటుంబానికి ప్రభుత్వం భరోసా ఇవ్వలేకపోయిందని విమర్శించారు. వైయస్ఆర్‌సీపీ సంస్థాగత నిర్మాణానికి పటిష్ట చర్యలు – కాకాణి గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. వైయస్ఆర్‌సీపీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రాణాలకు తెగించి పార్టీ క్యాడర్ పోరాడుతుందని ధీమా వ్యక్తం చేశారు. వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా బలాన్ని చూసి టీడీపీ భయపడుతోందని, కూటమి ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ స్థానాల్లో వైయస్ఆర్‌సీపీ జెండా ఎగరడం ఖాయమని, 2027లో జమిలి ఎన్నికలు వస్తే వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి రావడం తథ్యమని పేర్కొన్నారు. అభివృద్ధి పనులు మా ప్రభుత్వ హయాంలోనే – మాజీ మంత్రి అనిల్ మాజీ మంత్రి అనిల్ మాట్లాడుతూ.. పెన్నా, సంఘం బ్యారేజీలను వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వమే పూర్తి చేసిందని గుర్తుచేశారు. అల్తూరుపాడు రిజర్వాయర్‌ను మంత్రి ఆనం ఆపేశారని ఆరోపించారు. జగన్‌పై గొంతు చించుకుని విమర్శలు చేసే మంత్రి ఆనం, సోమశిల ప్రాజెక్టుకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, రైతులు, పేదల హక్కుల కోసం వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని నేతలు స్పష్టం చేశారు.