తాడేపల్లి: కేపీఎల్ (కోడి పందేల లీగ్) పేరుతో సంక్రాంతి పండుగను జూదానికి వేదికగా మార్చి తెలుగు సంప్రదాయాలపై కూటమి ప్రభుత్వం దాడి చేస్తోందని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ తీవ్రంగా విమర్శించారు. కోడి పందేలు, క్యాసినోలు, పేకాటలను ప్రోత్సహిస్తూ కుటుంబాలను నాశనం చేసే విష సంస్కృతిని చంద్రబాబు ప్రభుత్వం పెంచిపోషిస్తోందని మండిపడ్డారు. సంపద సృష్టి పేరుతో జూదాన్ని ప్రోత్సహిస్తూ కూటమి నేతలు కోట్లు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. సంక్రాంతి పండుగ ముసుగులో కోడి పందేలు, క్యాసినోలు నిర్వహించి ప్రజల జేబులను ఖాళీ చేస్తున్నారని కైలే అనిల్‌కుమార్ ఆరోపించారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రెస్‌మీట్‌లో కైలే అనిల్‌కుమార్ ఏమన్నారంటే.. ● అరాచకత్వాన్ని ప్రోత్సహిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఐపీఎల్ తరహాలో ‘కేపీఎల్’ అనే కొత్త ఈవెంట్‌ను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్‌లో లాంచ్ చేసి అన్ని వ్యవస్థలపై దాడులు చేస్తున్నారు. సాంప్రదాయాలు, ప్రజల ఆచారాలపై కూటమి ప్రభుత్వం ప్రత్యక్షంగా దాడి చేస్తోంది. సంక్రాంతి పండుగ పేరున సంప్రదాయం ముసుగులో అరాచకత్వాన్ని ప్రేరేపిస్తున్నారు. సంక్రాంతి అంటే బంధువులు, స్నేహితులు, కొత్త దంపతులు ఇళ్లకు చేరి ఆనందంగా పండుగ జరుపుకునే సందర్భం. అలాంటి పండుగను ‘కేపీఎల్ పండుగ’గా మార్చి కోడి పందేలు, జూదానికి వేదికగా మలిచారు. కత్తులు కట్టిన కోళ్లు, పెద్ద బరులు, జూదం, గ్యాలరీలు, ఎల్‌ఈడీ స్క్రీన్లు, వేలాదిమంది ప్రేక్షకులు, కోట్ల రూపాయల నగదు లావాదేవీలు ఇవి ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో బహిరంగంగా కొనసాగుతున్నాయి. కొత్త పంటలు ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరే సంక్రాంతి పండుగ అర్థాన్నే మార్చేశారు. గొబ్బెమ్మలు, ముగ్గులు, గంగిరెద్దులు వంటి సంప్రదాయాలను మరిచిపోయేలా చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా అరాచకత్వాన్ని చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారు. ● కూటమి నేతలకు కోటి నుంచి రూ.3 కోట్ల మేర కమీషన్లు కోడి పందేల ముసుగులో గుండాట, పేకాట, మూడుముక్కల ఆటలను కూటమి నేతల సిఫార్సులతో నిర్వహిస్తున్నారు. ఒక్కో బరిలో స్థానిక ఎమ్మెల్యేలు కోటి నుంచి రూ.3 కోట్ల వరకు కమీషన్లు వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై న్యాయ వ్యవస్థ కూడా కలుగజేసుకోవాల్సిన అవసరం ఉంది. దాదాపు 20 రోజులుగా జూద శిబిరాల ఏర్పాట్లు జరుగుతున్నాయి, పోలీసులకు రూ.10 లక్షలు ఇచ్చామని, ఎక్సైజ్ అధికారులతో మాట్లాడతామని టీడీపీ నేతలు మాట్లాడిన వీడియోలు వైరల్ అయ్యాయి. బరుల సంఖ్య, జనసందడి ఆధారంగా రూ.25 లక్షల నుంచి కోటి రూపాయల వరకు కమీషన్లు చెల్లిస్తున్నారు, ప్రతి బరి నుంచి కూటమి నేతల జేబుల్లోకి డబ్బులు వెళ్తున్నాయి. కోడి పందేలు జూదం ఆదాయ వనరుగా మారాయి, గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అరాచకం మరో స్థాయికి చేరింది. ప్రభుత్వం ఇలాంటి అక్రమాలపై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ● కోడికి కత్తి కట్టి జూదం ఆడిస్తున్న వారిని ఎక్కడ నడిపించాలి వైయస్ఆర్‌సీపీ నేతలు కేక్ కట్ చేశారని, కోడి కోశారని రోడ్డుపై నడిపించారు. కత్తి పట్టుకున్న వారిపై కఠినంగా వ్యవహరించిన పోలీసులు, కోడికి కత్తి కట్టి జూదం ఆడిస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. అలాంటి వారిని ఎక్కడ నడిపించాలి. కోడి పందేలను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ లలో ఏ1, ఏ2, ఏ3లు ఎవరూ? . కేసరపల్లి వద్ద భారీ బరి ఏర్పాటు చేసి ముడుపులు తీసుకొని జూదం నిర్వహిస్తున్నారు, అక్కడ టీడీపీ నేతల జేబుల్లోకి రూ.2 కోట్ల వరకు వెళ్లినట్లు కూటమి నేతలే చెబుతున్నారు. పేకాట శిబిరాల వద్ద మద్యం విచ్చలవిడిగా అమ్ముతూ, అధిక ధరలకు సరఫరా చేస్తున్నారు. ఈ ఏడాది గోవా, నేపాల్ నుంచి క్యాసినో డీలర్లను తీసుకువచ్చి ప్రజల డబ్బును దోచుకుంటున్నారు. జూద శిబిరాల వద్ద మద్యం సరఫరా, డ్యాన్స్‌లు, పేకాట క్లబ్‌లు ఏర్పాటు చేసి ప్రజలను దోచుకుంటున్నారు. ఈ మూడు రోజుల్లో ఎన్నో కుటుంబాలు అప్పుల పాలై చివరకు పుస్తెలు కూడా తాకట్టు పెట్టే పరిస్థితి వస్తుంది. ఈ సంపదంతా కూటమి నేతలు, ఎమ్మెల్యేలకే చేరుతోంది. ● ఈ విష సంస్కృతి చూసి సినీ, రాజకీయ ప్రముఖులు ఏమనుకోవాలి? ఉమ్మడి కృష్ణా జిల్లాలో దాదాపు 10 కోడి పందేల బరులు ఏర్పాటు చేసి, స్థాయిని బట్టి టీడీపీ నాయకులు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ప్రజలను ఉద్ధరిస్తామని ఓట్లు వేయించుకున్న కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు, ఇవాళ పేకాటలు, క్యాసినోలను ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసం. పంటలకు మద్దతు ధర, తాగునీరు వంటి హామీలపై ప్రజలు ఆశ పెట్టుకున్నారని, కానీ నేతలే కోట్ల సంపాదనకు పాల్పడతారని ఎవరూ ఊహించలేదు. పెనుమలూరులోని ఉప్పలూరులో క్యాసినో నిర్వహణకు రూ.70 లక్షల ఒప్పందం జరిగింది, గంజాయి కేసు నిందితుడికి డబ్బులు వసూలు చేసే బాధ్యత అప్పగించారన్న సమాచారమూ ఉంది. నున్న ప్రాంతంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ నేత ఆధ్వర్యంలో భారీ క్యాసినో ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంప్రదాయ కోడి పందేలు చూసేందుకు భీమవరం పరిసర ప్రాంతాలకు వచ్చే రాజకీయ, సినీ ప్రముఖులు కూడా ప్రస్తుతం జరుగుతున్న జూదం, విష సంస్కృతిని చూసి అసహ్యించుకునే పరిస్థితి ఉంది. ● సుప్రీం కోర్టు ఆదేశాలు బేఖాతరు గత 30 ఏళ్లలో ఇంత దారుణమైన పరిపాలన చూడలేదు. చంద్రబాబు ప్రభుత్వం తెలుగు సంస్కృతిని విష సంస్కృతిగా మారుస్తోంది. సంక్రాంతి పండుగలో కబడ్డీ, ఖోకో టోర్నమెంట్ల స్థానంలో క్యాసినోలు ఏర్పాటు చేయడం బాధాకరం. కోడి పందేలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదేనని సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పింది. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు జూదాన్ని ఎప్పుడూ ప్రోత్సహించలేదు. గతంలో క్యాసినో అంటూ తప్పుడు ప్రచారాలు చేసిన చంద్రబాబు ఇప్పుడు జరుగుతున్న అరాచకత్వంపై సమాధానం చెప్పాలి. వైయస్ఆర్‌సీపీ పండుగలకు, సంస్కృతి, సాంప్రదాయాలకు వ్యతిరేకం కాదు. సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై ఏ1, ఏ2, ఏ3లుగా కేసులు నమోదు చేస్తారో చేయరో పోలీసులే సమాధానం చెప్పాలంటూ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ చురకలంటించారు.