భవానీ దీక్షల ఇరుముళ్లు చైర్మన్‌, ఈవో ఎలా విప్పుతారు?

కనకదుర్గ పాలక మండలి దేవాలయ సంప్రదాయాలను కాలరాస్తోంది

మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం

విజయవాడ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని దేవాలయాలు వరుస అపచారాలకు వేదికలుగా మారాయని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు తీవ్రంగా మండిపడ్డారు.  అమ్మవారి ఆల‌యంలో వ‌రుస అప‌చారాలు, వివాదాలే తప్ప భక్తులకు భద్రత, గౌరవం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ, విద్యుత్ శాఖ రెండింటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అధిపతి అయినప్పటికీ ఆలయాల్లో జరుగుతున్న ఘటనలపై ప్రభుత్వం మౌనం వహించడం బాధాకరమని విమర్శించారు. సోమ‌వారం వారు మీడియాతో మాట్లాడారు. 

వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, “భవానీ దీక్షల ఇరుముళ్లు గురువులు విప్పాల్సిన పవిత్ర ఆచారం. అలాంటిది చైర్మన్‌, ఈవో ఎలా విప్పుతారు? ఇది స్పష్టమైన అపచారం. కనకదుర్గ ఆలయ పాలక మండలి సంప్రదాయాలను పూర్తిగా కాలరాస్తోంది” అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు గంటల పాటు అమ్మవారి దేవాలయాన్ని చీకట్లో ఉంచడం, భక్తులకు ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం దారుణమని అన్నారు.ఆలయంలో పాలల్లో పురుగులు రావడం, అమ్మవారి గుడి ప్రాంగణంలో కేక్‌ కట్‌ చేయడం, అన్నప్రసాదం వద్ద భక్తుడికి కరెంట్‌ షాక్‌ తగలడం వంటి ఘటనలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనాలని పేర్కొన్నారు. “దేవాదాయ శాఖ ఉన్నా, విద్యుత్ శాఖ ఉన్నా ఇవన్నీ ముఖ్యమంత్రి పరిధిలోకే వస్తాయి. అయినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?” అని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, “ఇన్ని ఘటనలు జరిగినా ఇప్పటివరకు మౌనం వహించాం. కానీ భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడితే చూస్తూ ఊరుకోం. అమ్మవారి గుడిలో మూడు గంటలు విద్యుత్ నిలిచిపోయిన ఘటనపై వెంటనే చర్యలు ఎందుకు తీసుకోలేదు?” అని నిలదీశారు. గోశాలలను ఆలయ పరిసరాల నుంచి తొలగించడం, ప్యాకెట్ పాలతో అభిషేకాలు చేయడం సంప్రదాయ విరుద్ధమని అన్నారు. అన్నదానం సక్రమంగా జరగడం లేదని, దేవాలయాల్లో అర్చకులు, పురోహితులకు రక్షణ లేకుండా పోయిందని మల్లాది విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు. “అయినవిల్లిలో పూజారిపై కొడవలితో దాడి జరిగి ఆయన కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అర్చకులు, పురోహితుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలి. ప్రభుత్వం తీసుకురాకపోతే వైయస్‌ఆర్‌సీపీ తీసుకువస్తుంది” అని హెచ్చరించారు. దేవస్థాన భూములపై కన్నేసి జీవో నెంబర్‌ 15 పేరుతో విలువైన ఆస్తులను దోచుకునే ప్రయత్నం జరుగుతోందని, ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని ఇద్దరు నేతలు డిమాండ్ చేశారు. దేవుడి భూములకు, దేవుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తూ, కనకదుర్గ ఆలయాన్ని అపచారాల నుంచి కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.

Back to Top