మోదీపై ప్రేమ బాణాలు..వైయస్ జగన్‌పై విషం చిమ్మటం ఎందుకు బాబూ?

చంద్రబాబుకు ఓటుకు కోట్లు, ఈడీ కేసుల భయం

మోదీ ఎక్కడ జైల్లో పెట్టిస్తారన్న భయంతో బాబు వణికిపోతున్నారు

దేశం మొత్తం బ్రాందీ షాపులు తెరిచారు

అసూయతో చంద్రబాబు ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు

టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి మద్యం షాపుల వద్దకు పంపుతున్నారు

చంద్రబాబు వ్యవహార శైలిని లోకేష్‌ ఎందుకు ఖండించడం లేదు

కరోనా నియంత్రణలో దేశంలోనే ఏపీ నంబర్‌ వన్‌

మీడియా సమావేశంలో మంత్రి పేర్నినాని

తాడేపల్లి: ప్రధాని నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా బ్రాందీషాపులు తెరవమని ఆదేశాలు జారీ చేశారని, అలాంటప్పుడు మోదీని తిట్టకుండా సీఎం వైయస్‌ జగన్‌పై ఎందుకు విషం చిమ్ముతున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబును మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని, హైదరాబాద్‌లో కూర్చొని చంద్రబాబు అసూయతో ప్రభుత్వంపై, సీఎం వైయస్‌ జగన్‌పై బురద జల్లుతున్నారని, ఇలాంటి దిగజారుడు రాజకీయాలు సరికాదని హితవు పలికారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.

బాబు మానసిక రుగ్మతతో బాధపడుతున్నారు
ప్రతిపక్ష నేత చంద్రబాబు అధికారం కోల్పోవడంతో మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని మంత్రి పేర్ని నాని విమర్శించారు. ఆంధ్రరాష్ట్ర ప్రజలు రెండుసార్లు చంద్రబాబుకు అధికారం కట్టబెడితే..ప్రజలపై విశ్వాసం చూపకుండా వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ప్రజలను మానసికంగా కుంగదీస్తున్నారని మండిపడ్డారు. కరోనాను అరికట్టే విషయంలో ప్రతిపక్ష నేతగా బాధ్యతగా పని చేయాల్సిన పెద్ద మనిషి తన బాధ్యత మరిచి, హైదరాబాద్‌లో కూర్చొని నిత్యం రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయనకు రాజకీయాలే పరమావధిగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

టీడీపీ కార్యకర్తలను ఎగదోస్తున్నారు
రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు చంద్రబాబు తన పార్టీ కార్యకర్తలను, సానుభూతిపరులకు డబ్బులిచ్చి, రెచ్చగొట్టి మరి మద్యం షాపుల వద్దకు ఎగదోస్తున్నారని మంత్రి విమర్శించారు. తన కార్యకర్తలకు కరోనా విషయంలో అవగాహన కల్పించకుండా, భౌతిక దూరం పాటించాలని చెప్పకుండా మద్యం షాపుల వద్దకు పంపిస్తున్నారన్నారు. పార్టీ కార్యక్రమంలా బ్రాందీ షాపుల వద్దకు ఎగదోస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీలో యూత్‌ ఐకాన్‌గా ఉన్న నారా లోకేష్‌ తన తండ్రి వ్యవహార శైలీని ఖండించకపోవడం దురదృష్టకరమన్నారు. తన సొంత మీడియాను అడ్డుపెట్టుకొని చిలువలు, పలువలుగా చిత్రీకరిస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

జైల్లో పెడతారని బాబుకు భయం
ఎన్నికలకు ముందు ప్రజల సొమ్ముతో అర్భాటంగా ప్రచారం చేసిన చంద్రబాబు అప్పట్లో మోదీని నోటికి వచ్చినట్లు తిట్టారని, తన బావమరిది, కుమారుడు, తన అనుచరులతో ఇష్టం వచ్చినట్లు దూషించారని మంత్రి పేర్ని నాని గుర్తు చేశారు. ఇప్పుడు మోదీని పొగడ్తలతో ముంచుతున్నారని ఈ పది నెలల్లో ఏం మార్పు వచ్చిందని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసు, ముంబాయిలో పట్టుబడిన వేల కోట్ల బ్లాక్‌ మనీ కేసులో ఎక్కడ మోదీ జైల్లో పెడతారన్న భయంతో ప్రధానిని పొగుడుతున్నారన్నారు. ప్రధాన మంత్రే దేశవ్యాప్తంగా బ్రాందీ షాపులు తెరవాలని ఆదేశించారన్నారు. కేంద్ర మార్గదర్శకాలను పాటిస్తూ..కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకొని మద్యం షాపులు ఓపెన్‌ చేయించిందన్నారు. మోదీని ప్రసన్నం చేసుకునేందుకు ఆయనకు చంద్రబాబు ప్రేమ సందేశాలు పంపుతున్నారని, రాష్ట్రంలో మాత్రం సీఎం వైయస్‌ జగన్‌పై నిత్యం విషం చిమ్ముతున్నారన్నారు.

సీఎం వైయస్‌ జగన్‌ను అందరూ పొగుడుతుంటే..
కరోనా నియంత్రణలో దేశంలోనే ఏపీ ఆదర్శంగా ఉందని కేంద్ర మంత్రులు, జాతీయ మీడియా, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం వైయస్‌ జగన్‌ను పొగుడుతుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం బురదజల్లుతున్నారని మంత్రి పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా టెస్టులు ప్రతి పది లక్షల జనాభాకు 2,500 మందికి చేస్తు దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో ఏపీ ఉందన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. ఇవన్నీ చంద్రబాబుకు కనిపించడం లేదని, ఆయన కళ్లున్న కబోది అంటూ అభివర్ణించారు. 

ఆదాయం తగ్గిపోతుందని బాబు ఏం చేశారో తెలియదా?
చంద్రబాబు పాలనలో అయ్యప్పస్వాముల వల్ల మద్యం నుంచి ఆదాయం తగ్గిపోతుందని మిగతా వారికి అలవాటు చేయమని చెప్పిన సీఎం చంద్రబాబు కదా అని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ఇప్పుడు రాష్ట్రంలో రేట్లు పెంచారనో, ఆయనకు నచ్చిన బ్రాండ్లు దొరకడం లేదనో గగ్గోలు పెడుతున్నారన్నారు. చంద్రబాబుకు మద్యం ఫ్యాక్టరీ ఏమైనా ఉందా? ఉంటే తమకు చెబితే సీఎం వైయస్‌ జగన్‌కు చెప్పి ఆయన ఫ్యాక్టరీ మద్యాన్ని కూడా షాపుల్లో ఏర్పాటు చేస్తామన్నారు. పోటుగాడైన చంద్రబాబు రాష్ట్రానికి రాకుండా ఎవరూ అడ్డుకోలేదన్నారు. అసలు ఆయన హైదరాబాద్‌కు ఎందుకు వెళ్లారని, ఆయన ఉండాల్సింది రాష్ట్రంలోనే కదా అని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్‌ కంటెంట్‌ రెండు ఒకే రీతిగా ఉంటాయని, ఆయన ఏం చెబితే అదే పవన్‌ పాటిస్తారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు విమర్శలు మాని ప్రజల్లో ధైర్యాన్ని నింపాలని మంత్రి పేర్ని నాని సూచించారు. 

Back to Top