యూటర్న్‌ చంద్రబాబుకు సహజ గుణం

అసెంబ్లీలోనూ స్వార్థ రాజకీయాల కోసమే టీడీపీ ప్రయత్నం

ప్రభుత్వం చేసే మంచి ప్రజల్లోకి వెళ్లకుండా కుట్ర చేశారు

శాసనసభలో తండ్రి ఎస్‌ అంటే.. కౌన్సిల్‌లో కొడుకు నో..

వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ విభజన బిల్లు

స్కూళ్లు తెరిచేలోపు ఆంగ్ల మాధ్యమం చట్టాన్ని ఆమోదింపజేస్తాం

ఇప్పటికైనా చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి

దిశ చట్టంతో దేశ వ్యాప్తంగా సీఎం జగన్‌కు కృతజ్ఞతలు

రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని

 

సచివాలయం: ఆడవారి రక్షణ కోసం, ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చట్టసభలో అనేక బిల్లులు ప్రవేశపెట్టారు. మహిళలపై అత్యాచారం, వేధింపుల కేసుల్లో 21 రోజుల్లో నిందితులు శిక్షించబడేలా దిశ చట్టాన్ని తీసుకువచ్చిన ప్రభుత్వాన్ని, సీఎం వైయస్‌ జగన్‌కు దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. ప్రజల మంచి కోసం ప్రభుత్వం చట్టాలు చేస్తుంటే చంద్రబాబు మాత్రం అసెంబ్లీని స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. కర్ణుడికి కవచ కుండాలు ఎలా ఉంటాయో.. చంద్రబాబుకు యూటర్న్‌ అనేది సహజ గుణం అని, ఆంగ్ల మాధ్యమంపై కూడా యూటర్న్‌ తీసుకొని మాట్లాడారన్నారు. శాసనసభలో ఇంగ్లిష్, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ విభజన బిల్లులకు తండ్రి ఎస్‌ అంటే మండలిలో కొడుకు లోకేష్‌ నో అంటున్నాడని, తండ్రీకొడుకులకు సరిపోవడం లేదా..? లేక దొంగనాటకాలు ఆడుతున్నారా అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చట్టాన్ని, ఇంగ్లిష్‌ మాధ్యమం బోధన చట్టాన్ని బడ్జెట్‌ సమావేశాల్లో ప్రవేశపెడతామని, స్కూళ్లు తెరిచేలోపు చట్టాన్ని ఆమోదింపజేస్తామని వివరించారు.  

సచివాలయంలో మంత్రి పేర్ని నాని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మహిళా భద్రత కోసం దిశ చట్టం తీసుకురావడంతో పాటు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆర్టీసీ కార్మికులకు దశాబ్దాల కలను సీఎం నెరవేర్చారు. చంద్రబాబులా తాత్సారం చేసుకుంటూ ఐదేళ్లు కాలం గడుపుతారని చాలా మంది ఆశపడ్డారు. కానీ, ఆశలను వమ్ము చేస్తూ పరిపాలన దక్షులను కూడా విస్మయానికి గురిచేసేలా 200 రోజుల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి చట్టబద్ధత కల్పించారు.

మద్యపాన నిషేధానికి అడుగులు వేస్తూ.. మద్య నిషేధాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్న దుర్మార్గులకు భయం కలిగేలా శిక్షలు విధించేందుకు చట్టాన్ని మార్పు చేస్తూ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. నాటుసారా తయారీ, అక్రమంగా మద్యం సరఫరా, షాపుల్లో అక్రమ వ్యాపారాలు చేసే వారికి కూడా కఠిన తరమైన శిక్షలను అమలు చేసేందుకు చట్టాలు తీసుకువచ్చాం.

పరిపాలన సౌలభ్యం కొరకు ఇంకా ప్రజలకు మేలు చేసేందుకు మొత్తం 22 బిల్లులు ప్రవేశపెడితే.. ప్రతిపక్షం ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ విభజన బిల్లును, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన బిల్లుకు శాసనమండలిలో మోకాలొడ్డింది. ఈ రెండు అంశాల్లో తెలుగుదేశం పార్టీ అసలు స్వరూపాన్ని ప్రజలు గ్రహించారు. ముందు ప్రభుత్వ పాఠశాలలో తెలుగు తప్పితే ఆంగ్ల మాధ్యమం బోధించేందుకు వీలు లేదని మొదలుపెట్టి.. తెలుగు భాషను సీఎం వైయస్‌ జగన్‌ చంపేస్తున్నట్లు.. చంద్రబాబు కాపాడుతున్నట్లుగా రకరకాలుగా మీటింగులు పెట్టారు. రోజులు గడిచే కొద్ది ప్రజలు తిడుతున్నారని తెలుసుకొని తెలుగు, ఇంగ్లిష్‌ రెండూ ఉండాలని సన్నాయి నొక్కులు నొక్కారు. కర్ణుడికి కవచ కుండాలు ఎలా ఉంటాయో.. చంద్రబాబుకు యూటర్న్‌ అనేది సహజ గుణం. ఇంగ్లిష్‌ బోధన విషయంలో కూడా యూటర్న్‌ తీసుకొని మాట్లాడారు. తీరా కౌన్సిల్‌లో లోకేష్‌ నాయకత్వంలో అడ్డుకోవడం వారి సహజ గుణాన్ని చూపించుకోవడం కాదా..? అని ప్రశ్నిస్తున్నాను. తండ్రి శాసనసభలో ఎస్‌ అనడం.. కొడుకు కౌన్సిల్‌లో నో చెప్పడం.. ఇంతకంటే దిగజారి రాజకీయాలు చేయడం ఈ ప్రపంచంలో ఎవరి వల్ల అవుతుంది. పేదవారు ఎప్పటికీ వారి కుటుంబాలు బాగా చదువుకొని పైకి రాకూడదనే చంద్రబాబు, లోకేష్‌ ఆలోచన తప్పితే ఇందులో మరో అర్థం ఏమీ లేదు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ విభజన బిల్లుకు కూడా సభలో ఆమోదించడం.. మండలిలో అభ్యంతరం చెప్పడం. తండ్రీ కొడుకులకు పడడం లేదా..? తండ్రి అంటే మర్యాద లేదా.. ఇద్దరూ కలిసి దొంగనాటకాలు ఆడుతున్నారా..?

2014 ఎన్నికల్లో నేను పెద్ద మాదిగను అవుతానని చంద్రబాబు చెప్పాడు. బీజేపీ, టీడీపీ కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకొని ఏం చేశారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత ఎందుకు కల్పించలేదు. 31 సార్లు ఢిల్లీ వెళ్లానని చెప్పుకున్నారే.. ఒక్క రోజు అయినా ప్రధాని దగ్గర ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడారా..? ఎంతసేపు పోలవరం విడగొట్టండి.. కాంట్రాక్టుల గోల తప్పితే చంద్రబాబు చేసిందేమీ లేదు. లోకేష్‌ను ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ విభజనకు అడ్డంపెట్టించారో.. చిత్తశుద్ధితో టీడీపీ పాలనలో ఏం పనిచేశారు. వారి హక్కులను ఎక్కడైనా కాపాడారా..? అధికారంలో ఉన్నప్పుడు మాత్రం వారిని వెంటాడి వేధిస్తారు.. ఎస్సీల్లో ఎవరు పుట్టాలనుకుంటారని కించపరుస్తారు.. ఇవాళ సీఎం వైయస్‌ జగన్‌ మంచి చట్టం చేస్తుంటే దాన్ని అడ్డుకోవడానికి ఇలాంటి దుర్మార్గమైన ప్రయత్నం చేయడం హేయం కాదా..? వయస్సు, అనుభవంతో సంబంధం లేకుండా లోకేష్‌ను టీడీపీ జనరల్‌ సెక్రటరీగా నియమించారు.. లోకేష్‌ కూడా ఎల్‌ బోర్డు కట్టుకొని మా నాన్న తరువాత నేనే అని చెప్పుకున్నాడు. మీ తండ్రి అసెంబ్లీలో ఎస్‌ అని చెప్పిన లోకేష్‌ నో ఎందుకు అన్నారు..?

ఆడపిల్లలకు భద్రత లేదు.. మగ రాక్షసులు ఆడపిల్లలను బతకనిచ్చే పరిస్థితుల్లో లేరని దేశం అంతా అట్టుడికిపోతున్న తరుణంలో ఆడవారి రక్షణ కోసం దేశంలో మొదటివాడిగా సీఎం వైయస్‌ జగన్‌ ఒక చట్టాన్ని తీసుకువస్తుంటే ఆ రోజు ఉల్లిపాయల రేటు గురించి సభ నడవనివ్వకుండా చేశారు. దిశ చట్టం కంటే ఉల్లిపాయల ధరలు తెలుగుదేశానికి ముఖ్యం. బాధ్యతారహితంగా 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి ప్రవర్తించడం ఇంతవరకు ప్రపంచంలో చూసి ఉండం. ఉల్లి మీద, రైతు భరోసా మీద చర్చ మొదలుపెడితే.. వాటి గురించి మాట్లాడకుండా రాజకీయం స్వార్థం కోసం సభలో గగ్గోలు పెట్టారు.

ఆర్టీసీ చార్జీలు గురించి సభలో ప్రతిపక్షం మాట్లాడింది. 40 ఏళ్ల అనుభవం ఉన్న వాహిణి వారి పెద్ద మనిషి ఐదేళ్ల పాలనలో ఐదు సార్లు ఆర్టీసీ చార్జీలు పెంచాడు. 22–10–2015లో, 15–12–2015లో, 01–06–2016లో, 01–07–2017లో, 01–07–2018లో ఆర్టీసీ చార్జీలు పెంచాడు. ధైర్యం ఉన్నవారు ప్రజలకు చెప్పి పెంచుతారు.. చంద్రబాబు లాంటి వెన్నుపోటు రాజకీయాలకు అలవాటు పడినవాడు దొడ్డిదారిన పెంచుతాడు. 2015లో ఫెయిర్‌ రివిజన్‌ ఒకసారే పెంచాడు. రెండోసారి 15–12–2015లో రూపాయి సెస్, 2016లో ఇంద్రా బస్సు మీద కిలోమీటర్‌కు 7 పైసలు, గరుడకు 8 పైసలు, అమరావతికి 10 పైసలు, మళ్లీ 2016లో సేఫ్టీ సెస్‌ అని రూ.1, తరువాత దేశంలో చిల్లర దొరకడం లేదని రూ.5 రౌండింగ్‌ అని చెప్పి 2017లో పెంచారు. 2018లో దగ్గరలో ఉన్న రూ.5 రౌండింగ్‌ అని మళ్లీ పెంచారు. ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలు పెంచిందని అసెంబ్లీలో ప్రతిపక్షం నడక చేపట్టింది.. నడిచిన వారిలో ఏ ఒక్కరైనా ఆర్టీసీ బస్సు ఎక్కారా..? ఇంటి దగ్గర నుంచి కారు వేసుకొని వచ్చి అసెంబ్లీకి పది గజాల దూరంలో దిగి పబ్లిసిటీ కోసం నడిచి వచ్చారు.

పుట్టాక మొదటిసారి లోకేష్‌ ఆర్టీసీ బస్సు ఎక్కినట్లు ఉన్నాడు. సిటీ బస్సుకు పైసా పెరగలేదు. పల్లె వెలుగు బస్సుకు మొదటి పది కిలోమీటర్ల వరకు పైసా పెరగలేదు. లోకేష్‌ ఇవన్నీ లెక్కలు వేసుకొని మంగళగిరి నుంచి అసెంబ్లీకి పది కిలోమీటర్లు దాటి ఉందని పల్లెవెలుగు ఎక్కాడు.. ఈరకంగా అయినా జీవితంలో తొలిసారి లోకేష్‌ ఆర్టీసీ బస్సు ఎక్కడు. ఈ రోజుల్లో ఆటో ఎక్కి దిగితే రూ. 10 కంపల్సరీ. బస్సు ఎక్కి దిగితే రూ.5 మించి తీసుకోరు.

నాడు – నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేసి పాఠశాలలు నాడు ఎలా ఉన్నాయి.. నేడు ఎలా మార్చబోతున్నామని చూపిస్తాం. అలాగే పేద పిల్లలు,   డబ్బున్న వారి పిల్లలతో పోటీ పడేందుకు, వారిలో కూడా ఆంగ్ల నైపుణ్యం పెరగాలనే ఉద్దేశంతో ఇంగ్లిష్‌ మీడియం తీసుకొస్తే 2430 జీఓ గురించి చర్చ తీసుకొచ్చి సభ ఆపేందుకు ప్రతిపక్షం ప్రయత్నం చేసింది. ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ.. ప్రజల పక్షాన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఏమీ దొరక్క స్వార్థ రాజకీయాల కోసం సభను ఆపాలని చూశారు. దిశ చట్టం చర్చించి ఆమోదిద్దాం.. సలహాలు ఇవ్వండి అని అడిగితే మా కార్యకర్తలు వర్కులు చేసుకున్నారు డబ్బులు ఇవ్వమని సభ ఆపుతారు ఒక రోజు. ఆర్టీసీ విలీనం, మద్యపాన నిషేధాన్ని మూడు దశల్లో నియంత్రిద్దామని ఇలా 16 బిల్లులు ప్రవేశపెడితే ఆ బిల్లులను అడ్డుకుంటూ పోలవరం రివర్స్‌టెండరింగ్‌ గురించి మాట్లాడారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించకుండా.. కేవలం రాజకీయ, వ్యక్తిగత అవసరాలకు అసెంబ్లీని  చంద్రబాబు వాడుకున్నారు. ఇలాంటి పద్ధతి మంచిది కాదు. ఇక నుంచి అయినా మానుకొని ప్రజల కోసం పనిచేయాలని, ద్వంద నీతి, దిగజారుడు రాజకీయాలను కూడా కట్టిపెట్టాలని మంత్రి పేర్ని నాని సూచించారు.

Back to Top