ఇంగ్లిష్ మీడియం విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై ప్రజల్లో వెల్లువెత్తిన వ్యతిరేకతకు భయపడి చంద్రబాబు ఎట్టకేలకు యూటర్న్ తీసుకున్నాడని మంత్రి పేర్ని నాని అన్నారు. చంద్రబాబుతోపాటు ఆయన సొంత పుత్రుడు లోకేష్ నాయుడు, దత్తపుత్రుడు పవన్నాయుడులకి ఇప్పటికైనా వాస్తవాలు తెలిసినందుకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు. శుక్రవారం వైఎస్సార్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు యూటర్న్ల బాగోతాన్ని వివరించారు. 16వ తేదీన ఇంగ్లిష్‌కు వ్యతిరేకంగా ధర్నా చేస్తామని హెచ్చరించిన బాబు.. 22వ తేదీ నాటికి మాటమార్చి యూటర్న్ తీసుకున్నాడని అన్నారు. బీజేపీతో పొత్తుల విషయంలో పలుమార్లు యూ టర్న్‌లు తీసుకున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. అంతేకాకుండా ప్రత్యేక హోదా, ప్యాకేజీ, మళ్లీ ప్రత్యేక హోదా.. రోజుకొక నిర్ణయం తీసుకున్న బాబుకి ఏ విషయంలోనూ స్పష్టత లేదన్నారు. ఎన్నికలప్పుడు నరేంద్రమోడీని ఇంటికి పంపేదాకా నిద్రపోయేది లేదని శపథాలు చేసిన చంద్రబాబు... ఎన్నికలయ్యాక కార్యకర్తల మీటింగ్‌లో మోడీతో విభేదించి తప్పు చేశామని యూటర్న్ తీసుకున్నాడని అన్నారు. మోడీ వ్యతిరేకంగా జట్టు కట్టడానికి దేశమంతా తిరిగి కాళ్లావేళ్లా పడిన బాబు.. ఎన్నికల ఫలితాలువచ్చిన నాటి నుంచి ఒక్కసారైనా సోనియాని గానీ, మమతాని గానీ పలకరించారా అని ప్రశ్నించారు. అమిత్‌షా పుట్టినరోజుకి తండ్రీ కొడుకులు పోటీలు పెట్టుకుని మరీ ట్విట్టర్లో శుభాకాంక్షలు చెప్పలేదా అన్నారు. బాబు సహవాస ఫలితం వారితో సహవాసం చేస్తే వాళ్లు వీళ్లవుతారని అన్నట్టు.. బాబుతో ప్రయాణంలో పవన్ నాయుడు కూడా యూటర్న్లు తీసుకుంటున్నాడని మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ఒకసారి చంద్రబాబును పొగడటం, ఇంకోసారి తిట్టడం, ఇప్పుడు ఆయనకే మద్దతు ఇస్తూ యూటర్న్లు తీసుకుంటున్నాడన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి కులం గురించి మాట్లాడే పవన్‌నాయుడు ఎన్నికలకు ముందు బాప్టిజం తీసుకున్నానని, తాను క్రిస్టియన్‌నని చెప్పలేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ వద్దంటున్న పవన్.. తాను నెల్లూరులో ఇంగ్లిష్ మీడియంలో చదవారో లేదా చెప్పాలన్నారు. క్రిస్టియన్ స్కూల్లో చేరిన తర్వాతనే తనకు దేశభక్తి అలవడిందని పవన్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అనుకూల మీడియా ఎన్ని జాకీలేసి లేపినా నారా లోకేష్‌నాయుడు ఎప్పటికీ నాయకుడు కాలేడన్నారు. గడిచిన ఐదేళ్లలో ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా జనం మంచీచెడుల తేడాను గుర్తించారని, వైఎస్ార్సీపీకి పట్టం కట్టారని తెలిపారు. ప్రజా తీర్పును మార్చలేకపోయారని ఆయన వివరించారు. సుజనా.. బాబు భజన పార్టీ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక మతపరంగా విభజించి పార్టీ, ప్రభుత్వం మీద బురదజల్లాలలని చూస్తున్నారని మంత్రి అన్నారు. ఇంగ్లిష్ మీడియంకు వ్యతిరేకంగా మాట్లాడే సుజనా చౌదరి పిల్లలు ఏ మీడియంలో చదివారని ప్రశ్నించారు. ఆయన కేంద్రమంత్రిగా ఉండగా కేంద్రీయ విద్యాలయలో ఇంగ్లిష్ మీడియం ఎందుకు తీసేయలేకపోయాడో చెప్పాలన్నారు. ఆయన చంద్రబాబు అజెండాతోనే బీజేపీలో కొనసాగుతున్నాడని ఆరోపించారు. పార్టీ మారిన నాటి నుంచి ఇప్పటి వరకు సుజనా కాల్‌డేటా బయటకు తీస్తే ఆయన చీకటి రాజకీయం వెలుగులోకి వస్తుందన్నారు. అసలు తాను ఎందుకు పార్టీ మారాల్సి వచ్చిందో కూడా ఎవరికీ చెప్పకపోవడం.., చంద్రబాబు కూడా ప్రశ్నించకపోవడం చూస్తే వారిద్దరి మధ్య లాలూచీ ఉన్నట్టు స్పష్టం అవుతుందన్నారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనంతా రాగద్వేషాలతో నడిచిందన్నారు. చంద్రబాబు పాలనకి జగన్ పాలనకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. దేవాదాయ, ధర్నాదాయ నిబంధనల ప్రకారమే నియామకాలు కులమతాలు, రాజకీయాలకు అతీతంగా పాలన అందిస్తున్న సీఎం జగన్ పై వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా మాట్లాడుతుంటే జనం హర్షించరన్నారు. గడిచిన ఐదేళ్లలో ఇలాంటివి ఎన్నిజరిగినా జనం జగన్నే గెలిపించారని తెలిపారు. ఆలయాల్లో 50 శాతం ఎస్సీ, బీసీలకు నియామకాలు చేస్తు ఇచ్చిన ఉత్తర్వులు దేవాదాయ, ధర్మాదాయ నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయన్నారు. టీటీడీలోనూ అన్యమతస్తులను నియమించలేదని, బీసీలకు మాత్రమే అదనంగా నియామకాలు చేపట్టినట్టు వివరించారు. పురోహితులకు జీతాలు పెంచిన విషయం పక్కనపెట్టి క్రిస్టియన్ల జెరూసలెం యాత్రకు సబ్సిడీ ఇచ్చిన విషయాన్ని మత్రమే హైలెట్ చేస్తున్నాడని సుజనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుజనా కేంద్రమంత్రిగా ఉండగా చంద్రబాబు హయాంలో ఆయన చేపట్టిన జెరూసలెం, హజ్ యాత్రల సంగతి గుర్తులేదా అని ప్రశ్నించారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. వెనుకబడిన కులాల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా సాధారణమే అన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీలు తనతో టచ్‌లో ఉన్నారని సుజనా ప్రచారం చేసుకుంటే.. సుజనా మాత్రం చద్రబాబుతో ఎందుకు టచ్‌లో ఉన్నాడన్నారు. టీడీపీ అధికారంలో ఉండగా పసుపు రంగులేసినప్పుడు పవన్ నాయుడి నేత్రాలు, మనసు, మెదడు ఎందుకు పనిచేయలేదని ప్రశ్నించారు. జ్యుడీషియల్ కమిటీకి వెళ్లడం వల్లనే బస్సుల ప్రక్రియ ఆలస్యమైంది తప్ప ఆగిపోలేదని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. Read Also: అవినీతి నిర్మూలనే అసలైన లక్ష్యం