నీకు ఏ అర్హత ఉందని ప్రాజెక్టులను సందర్శిస్తావు బాబూ..?

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పం రైతాంగానికి నువ్వు చేసిన మేలేంటీ..?

పలమనేరు వరకు వచ్చిన నీటిని కుప్పంకు చేర్చలేని దుర్మార్గుడు చంద్రబాబు

ఇన్ని రోజులూ లేనిది కొత్తగా రాయలసీమ ప్రాజెక్టులపై నీ శ్రద్ధ దేనికి..?

చంద్రబాబుకు సొంత ప్రాంతంపైనే మమకారం లేదు

సీఎం వైయస్‌ జగన్‌ చొరవతో కుప్పానికి త్వరలో హంద్రీనీవా నీరు

కోర్టులకెళ్లి ప్రాజెక్టులను అడ్డుకునే చంద్రబాబుకు వాటిని సందర్శించే అర్హత లేదు

విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజం

తిరుపతి: 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి తన కుప్పం నియోజకవర్గానికి సాగు, తాగునీరు అందించలేని చంద్రబాబు.. ఏ అర్హత ఉందని రాయలసీమ ప్రాజెక్టుల సందర్శన పర్యటన పెట్టుకున్నారని విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబుకు రాయలసీమ ప్రాంతంపై మమకారం లేదన్నారు. అందుకే రాయలసీమ ప్రజలు 52 స్థానాల్లో కేవలం మూడు స్థానాలకు టీడీపీని పరిమితం చేశారన్నారు. వైయస్‌ జగన్‌ పాలన రాయలసీమ అన్యాయం అయిపోయిందని మాట్లాడుతున్న చంద్రబాబు, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. సీమ అభివృద్ధికి దివంగత మహానేత వైయస్‌ఆర్‌ ఏం చేశారు.. చంద్రబాబు ఏం చేశారనేది చర్చిస్తే.. రాయలసీమ మీద ఎవరికి ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందన్నారు. తిరుపతిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి ఏం మాట్లాడారంటే.. 
చంద్రబాబు హయాంలో కరువు కటకాలతో రైతులు తల్లడిల్లిపోయారు. వ్యవసాయం చేయలేక బెంగళూరు వంటి ప్రాంతాలకు వలసలు వెళ్లి కూలిపనులు చేసుకున్నారు.  వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత చిత్తూరు జిల్లాకు మూడు రిజర్వాయర్లు మంజూరు చేశారు. అవులపల్లి, నేతిగుట్లపల్లి, ముదివేడు రిజర్వాయర్లను హంద్రీనీవా ద్వారా నింపి.. అన్ని నియోజకవర్గాలకు కాల్వల ద్వారా నీరు ఇచ్చి చెరువులు నింపుకునే పరిస్థితి తీసుకువస్తున్నారు. 

అనంతపురం వాసులంతా చిత్తూరుకు హంద్రీనీవా నీరు రాకుండా చేసిన దుస్థితిని సీఎం వైయస్‌ జగన్‌కు వివరించాం. సీఎం ఆలోచన చేసి గండికోట రిజర్వాయర్‌ నుంచి నికరజలాలు ఇచ్చే పరిస్థితి కల్పించారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఎన్జీటీని ఆశ్రయించి సుప్రీం కోర్టు వరకు వెళ్లి స్టే తెచ్చాడు. రాయలసీమ గురించి దేవుడెరుగు.. సొంత జిల్లా రైతాంగానికి కూడా ఇలాంటి అడ్డంకులు సృష్టిస్తున్న చంద్రబాబుకు ఏ నైతిక విలువ ఉందని ప్రాజెక్టుల గురించి యాత్ర చేస్తున్నారు.?

కుప్పం నియోజకవర్గానికి హంద్రీనీవా నీరు ఇస్తానని చంద్రబాబు చెప్పాడు. పలమనేరు వరకు వచ్చిన నీటిని కనీసం కుప్పానికి తీసుకెళ్లలేకపోయాడు. చంద్రబాబుకు కుప్పం నియోజకవర్గంపై ఏపాటి శ్రద్ధ ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలి. మళ్లీ అధికారం ఇస్తే నీరు తెస్తానని మోసపు మాటలు మాట్లాడుతున్నాడు. సొంత జిల్లాను, సొంత నియోజకవర్గాన్ని అన్యాయం చేసిన వ్యక్తి రాత్రికి రాత్రి రాయలసీమ గుర్తొచ్చి మాట్లాడుతున్నాడు.

హంద్రీనీవా పూర్తిచేసి కుప్పం వాసులకు సాగు, తాగునీరు ఇస్తానని సీఎం వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. పనులు వేగంగా జరుగుతున్నాయి. మరో 2 నెలల్లో సీఎం స్వయంగా వచ్చి ప్రారంభిస్తారు. మహానేత వైయస్‌ఆర్‌ 95 శాతం హంద్రీనీవా పూర్తిచేశారు. మిగిలిన 5 శాతం చంద్రబాబు పూర్తి చేయలేకపోయాడు. కుప్పానికి సీఎం వైయస్‌ జగన్‌ చొరవతో హంద్రీనీవా నీరు వస్తాయి’ అని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు.
 

Back to Top