రేపు చిత్తూరుకు సీఎం వైయస్‌ జగన్‌

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి

చిత్తూరు: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటన ఏర్పాట్లను విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ తలశిల రఘురాం పరిశీలించారు. సభా వేదిక, డెయిరీ ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాలోని పాడి రైతులకు మేలు చేసేందుకు మూతపడిన విజయా (చిత్తూరు) డెయిరీని అమూల్‌ ఆధ్వర్యంలో పునఃప్రారంభించనున్నట్లు తెలిపారు. చిత్తూరు డెయిరీ ప్రారంభించిన అనంతరం చీలాపల్లి సీఎంసీలో 300 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులకు సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపన చేయనున్నారని వివరించారు. 

వచ్చే సీజన్‌కు గవర్నమెంట్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను అందుబాటులోకి తెస్తామని మంత్రి పెద్దిరెడ్డి వివరించారు. గత ప్రభుత్వంలో రూ.32 కోట్ల డెయిరీ బకాయిలను వైయస్‌ జగన్‌ ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఆ నిధులను జిల్లా కలెక్టర్‌కు జమ చేసిందన్నారు. త్వరలో ఉద్యోగులకు కూడా రూ.11 కోట్ల బకాయిలు చెల్లిస్తామన్నారు. సీఎంసీలో ఆరోగ్యశ్రీ అమలుపై సీఎం వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. హెరిటేజ్‌ కోసం చిత్తూరు డెయిరీని మూసేసిన వారే డెయిరీలో స్క్రాప్‌లో గోల్‌మాల్‌ జరిగిందని ఆరోపించడం హాస్యాస్పదమన్నారు. 
 

Back to Top