నాయకుడి రూపంలో ఉన్న రాక్షసుడు చంద్ర‌బాబు

కుప్పంలో బాబు రౌడీయిజం ప్ర‌ద‌ర్శించాడు

పోలీస్‌ యాక్ట్‌–30 అమలులో ఉన్న చోట అనుమతి లేకుండా సభ ఎలా పెడతారు?

పోలీసులపై తన కార్యకర్తలను ఉసిగొల్పి దౌర్జ‌న్యం చేయించాడు

పోలీసులు నోటీసులు ఇచ్చినా చంద్రబాబు తిరస్కరించారు

ఇరుకు రోడ్లపై సభలతో 11 మంది ప్రాణాలు బలిగొన్నాడు

మళ్లీ అలాంటి ఘటనలు జరగకూడదనే జీఓ నెం:1 జారీ

కుప్పంలోనూ చంద్రబాబు ప్రతిష్ట దిగజారిపోయింది

విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 

సోమల: ఒక పార్టీ అధినేతగా, ప్రతిపక్ష నేతగా దిగజారి రాజకీయాలు చేస్తున్నాడ‌ని, చంద్రబాబు వల్ల రాజకీయ నేతల విలువ పోతోందని, బాబులాగే ఆయ‌న కార్య‌క‌ర్త‌లూ ఉన్నార‌ని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. అనుమ‌తి లేని రోడ్డు షోలు, స‌భ పేరుతో కుప్పంలో రౌడీయిజం చేశాడ‌ని, ప్ర‌శ్నించిన పోలీసుల‌పైకి కార్య‌క‌ర్త‌ల‌ను ఉసిగొల్పి పంపి దౌర్జ‌న్యం చేయించ‌డం మంచిది కాదన్నారు. చంద్రబాబు కనీసం జాగ్రత్తలు తీసుకోకుండా రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరులో నిర్వహించిన సభల వల్ల మొత్తం 11 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, పలువురు గాయాలపాలయ్యారన్నారు. ఆ రెండు ఘటనలకు చంద్రబాబే కారకుడని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. సోమల మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి మాట్లాడారు.

అందుకే జీఓ జారీ..
అలాంటి దురదృష్టకర ఘటనలు పునరావృతం కాకూడదనే రహదారులపైనా, రోడ్డు పక్కన, మార్జిన్లలో బహిరంగ సభలు, సమావేశాలు నిషేధిస్తూ ప్రభుత్వం జీఓ నెం:1 జారీ చేసింది. ఇది ఏ ఒక్క పార్టీకి వ్యతిరేకంగా చేసింది కాదు. ప్రజాస్వామ్యంలో అన్ని పక్షాలు ప్రజలకు తమ అభిప్రాయాలను తెలియచేసుకునే హక్కు ఉంది. ఇందుకోసం ప్రజలకు ఇబ్బంది లేని చోట, ప్రమాదాలకు ఆస్కారం లేని ప్రాంతాల్లో, పోలీసుల ముందస్తు అనుమతులతో సభలు, సమావేశాలను స్వేచ్ఛగా నిర్వహించుకోవచ్చు. అలాంటి వాటిపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. కానీ చంద్రబాబు దాన్ని కూడా వక్రీకరించడం దురదృష్టకరం. 

కుప్పంలో చంద్రబాబు రౌడీయిజం..
కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు ఈ రోజు రౌడీయిజం చేశాడు. మరోసారి ఇరుకు రోడ్లలో, తొక్కిసలాటకు ఆస్కారం ఉండే ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహణకు తెగబడ్డాడు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన పోలీసులపై దురుసుగా వ్యవహరించాడు. కనీసం పోలీస్‌ నోటీసులను కూడా తీసుకోకుండా చట్టాలను అవమానపరిచాడు. పోలీసులను అవమానపరిచేలా దుర్భాషలాడటంతో పాటు తన కార్యకర్తలను పోలీసులపై ఉసిగొల్పేలా వ్యవహరించాడు. 

దిగజారిన చంద్రబాబు..
పలమనేరు డివిజన్‌లో పోలీస్‌ యాక్ట్‌–30 అమలులో ఉంది. ఇక్కడ ఏదైనా కార్యక్రమం చేపట్టాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరి. మరి ఈ విషయం విపక్షనేతగా ఉన్న చంద్రబాబుకు తెలియదా? ఎమ్మెల్యేగా, మంత్రిగా, సీఎంగా, ప్రతిపక్ష నేతగా పని చేసిన చంద్రబాబుకు చట్టాల గురించి కనీస అవగాహన కూడా లేదా? పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉన్న ప్రాంతంలో అనుమతులు లేకుండా ఎలా కార్యక్రమం చేపట్టారు?. పోలీసులపై తన కార్యకర్తలను ఎలా ఉసిగొల్పారు?. ఆ స్థాయికి చంద్రబాబు దిగజారాడు.

అందుకే ఈ ప్రయత్నం..
కుప్పంలోనూ చంద్రబాబు ప్రతిష్ట క్రమంగా కనుమరుగవుతోంది. దాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నాడు. పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికలు అన్నింటిలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఆయన తట్టుకోలేకపోతున్నాడు. అందుకే అక్కడ రౌడీయిజమ్‌తో.. లేని తన బలాన్ని, బలగాన్ని చూపే ప్రయత్నం చేశాడు. కనుమరుగు అవుతున్న ప్రతిష్టను ఎలాగైనా తిరిగి పొందాలనే చంద్రబాబు ఆ ప్రయత్నం చేశాడు.

జుగప్సాకరంగా బాబు తీరు..
పోలీసుల అనుమతితో నిర్వహించుకునే సభకు ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ రౌడీలా వ్యవహరిస్తే కుప్పంలో తిరిగి ప్రాచుర్యం పొందవచ్చన్న చంద్రబాబు దిగజారుడు తీరు చూస్తుంటే జుగుప్స కలుగుతోంది. రాజకీయ విలువను దిగజార్చేలా చంద్రబాబు వ్యవహరించారు. గతంలో కూడా ఇదే కుప్పంలో ఆయన తన అనుయాయులను రెచ్చగొట్టి కర్రలు, హాకీస్టిక్స్, రాళ్ళతో వైయస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి చేసి భయోత్పాతం సృష్టించారు. అవి ఆయనకు అలవాటుగా మారాయి. అందుకే ఇవాళ కూడా అదే విధంగా పోలీసులపైనే దాడికి ఉసిగొల్పాడు. 

నాయకుడి రూపంలో రాక్షసుడు..
ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయకుడి రూపంలో ఉన్న రాక్షసుడిగా మారాడు. దురదృష్టకర ఘటనలు జరిగినప్పుడు సంయమనంతో వ్యవహరించే నైజం చంద్రబాబుకు లేదు. రాష్ట్రంలో అరాచకం సృష్టించేందుకు కార్యకర్తలను రెచ్చగొట్టి పోలీసులపైనే దాడి చేయించడమే కాకుండా, ప్రతిపక్షంపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందనే తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాడని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

తాజా వీడియోలు

Back to Top