తాడేపల్లి: సర్పంచ్ ఎన్నికల ఫలితాలను చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నాడని, అందుకే మతిభ్రమించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కుప్పం నియోజకవర్గంలోనూ టీడీపీ మద్దతుదారుల ఓటమిని చంద్రబాబు కళ్లకు కట్టినట్లుగా చూపించామన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభాలకు గురిచేయొద్దని అసెంబ్లీలో చంద్రబాబు సమక్షంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ చట్టం తీసుకువస్తే.. దాన్ని నల్ల చట్టం అని మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఏకగ్రీవాలకు పారితోషికం ప్రకటిస్తే బాబు ఓర్వలేకపోతున్నాడన్నారు. చంద్రబాబుకు వైయస్ జగన్ ఫోబియా పట్టుకుందన్నారు. తప్పులు చేసినవారు శిక్ష అనుభవించక తప్పదని చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందని, 2014–19 టీడీపీ పాలనలో చేసిన తప్పులకు చంద్రబాబును ప్రజలు 23 స్థానాలకు టీడీపీని పరిమితం చేశారు. చేసిన తప్పుకు చంద్రబాబు శిక్ష అనుభవిస్తున్నాడని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి సంక్షేమం, అభివృద్ధి పథకాలను ప్రతి ఇంటి గుమ్మం ముందుకు తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్‌దన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా కులం, మతం, ప్రాంతం, పార్టీ భేదం లేకుండా పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకొని సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వివరించారు. దేశంలో అత్యుత్తమ పాలన అందించే రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రుల్లో సీఎం వైయస్ జగన్ ప్రధమంగా ఉన్నారని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. వైయస్ జగన్ చరిష్మా ముందు చంద్రబాబు నిలబడలేకపోతున్నారన్నారు. పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది కాబట్టే ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. రౌడీలు, దుర్మార్గాలు, బలవంతలు ఏకగ్రీవాలు అని చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. టెక్కలిలో అచ్చెన్నాయుడు, మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర ఏం చేశారు..? ఇవన్నీ చంద్రబాబుకు కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు. సీఎం వైయస్ జగన్ పాలన బాగుందని తెలుగుదేశం పార్టీ నాయకులే కొనియాడుతున్నారని చెప్పారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పోటుగాడు అని చంద్రబాబు అంత పెద్ద బిరుదు ఇస్తుంటే తీసుకునేందుకు సిద్ధంగానే ఉన్నానని, కాకపోతే చంద్రబాబులా వెన్నుపోటుదారుడిని మాత్రం కాదన్నారు. చంద్రబాబు పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచాడని గుర్తుచేశారు. సీఎం వైయస్ జగన్ చరిష్మాతో తిరుగులేని ప్రజాబలం చిత్తూరులో తమకు ఉందని, జిల్లా ఇన్‌చార్జ్ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి చంద్రబాబుకు ఏ ఎన్నికలో కూడా మెజార్టీ రాలేదన్నారు. నాలుగు విడతల పంచాయతీ ఎన్నికల్లో వైయస్‌ఆర్ సీపీ బలపర్చిన 90 శాతం మంది అభ్యర్థులు సర్పంచ్‌లు విజయం సాధిస్తారని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌పై కొందరు టీడీపీ నేతలు, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నారని పెద్దిరెడ్డి మండిపడ్డారు. పోస్కో వాళ్లు ముఖ్యమంత్రిని గౌరవప్రదంగా కలిస్తే దాన్ని వక్రీకరిస్తూ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు అని ఉద్యమం నడిసే సమయంలో ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలకంగా వ్యవహరించారని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వారు స్పందిస్తే బాగుంటుందన్నారు. ఎంతో మంది త్యాగాల ఫలితంగా స్టీల్ ప్లాంట్ సాధించామని వెంకయ్య నాయుడు కేంద్రంతో చెప్పి.. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరింపజేయాలని కోరారు.