ప్రజలకు పారదర్శంగా ఇసుక సరఫరా

కేంద్ర ప్రభుత్వ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

ఈ ఒప్పందం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుంది

పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

తాడేపల్లి: ప్రజలకు పారదర్శకంగా ఇసుక అందించాలని వైయస్‌ జగన్‌ సర్కార్‌ నిర్ణయించిందని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఇసుక తవ్వకాలు జరపునున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా అమ్మకాలు చేపట్టేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఒప్పందం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని భావిస్తున్నామన్నారు. ఎడ్లబండ్ల ద్వారా రీచ్‌లకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో టోకెన్‌ విధానంతో ఇసుక అందించనున్నామన్నారు. ఆన్‌లైన్‌ లేకుండా ఆఫ్‌లైన్‌లోనూ ఇసుక ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గడిచిన ఐదేళ్లలో గత ప్రభుత్వం డబ్బే పరమావధిగా ఇసుక విధానం అమలు చేసిందని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వానికి ఎన్‌జీటీ రూ.100 కోట్ల జరిమానా కూడా విధించిందని గుర్తుచేశారు. 

అప్‌గ్రేడెడ్‌ శాండ్, మైనింగ్‌ పాలసీపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పెద్దిరెడ్డి, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టీసీ లిమిటెడ్‌ మధ్య ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఇసుక రీచ్‌లలో తవ్వకాలు, రవాణా కోసం టెండర్ల నిర్వహణ బాధ్యత కేంద్ర ప్రభుత్వ సంస్థ చేపట్టనుంది. ప్రజలకు పారదర్శకంగా ఇసుక అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 13 జిల్లాలు మూడు జోన్లుగా విభజించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తూర్పుగోదావరి జిల్లాలు ఒక జోన్‌. పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు మరో జోన్, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, వైయస్‌ఆర్‌ జిల్లాలు ఇంకో జోన్‌గా విభజించారు. 
 

Back to Top