తాడేపల్లి: రాష్ట్రంలో పేకాట శిబిరాలను ఉపేక్షించేది లేదని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. తమది దమ్ము, ధైర్యం ఉన్న ప్రభుత్వమని, ఇలాంటి అసాంఘిక చర్యలను ఉపేక్షించమని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. గుడివాడ నియోజకవర్గంలో పేకాట శిబిరం నడుస్తోందనే ప్రచారాన్ని కొడాలి నాని ఖండించారు. గుడివాడ నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దులో ఉంటుందని తెలిపారు. పేకాట ఆడేందుకు వచ్చిన వారు తమ నియోజకవర్గంలో కార్లు, వాహనాలు పార్క్ చేసి వేరే ప్రాంతాల్లో పేకాట ఆడుతున్నట్లు పోలీసుల సోదాల్లో బయటపడిందన్నారు. కొందరు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారని, మరికొందరు తప్పించుకున్నారన్నారు. పేకాట ఆడేవారు ఎంత గొప్ప వారు ఉన్న వదిలే ప్రసక్తి లేదని మంత్రి హెచ్చరించారు. తమ ప్రభుత్వం దమ్ము, ధైర్యం ఉన్న ప్రభుత్వమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పేకాట క్లబ్‌లను మూయించారని, మద్యపాన నిషేదం దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పారు. ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలను సహించేది లేదని వెల్లడించారు. ఆడ మగ కాని మాజీ మంత్రి దేవినేని ఉమా, చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు.