మూడు రోజుల్లోనే గ్యాస్‌ లీక్‌ బాధితులకు పరిహారం

8 కుటుంబాలకు కోటి రూపాయల చెక్కులు అందజేసిన మంత్రులు

బాధితులను తక్షణమే ఆదుకోవాలని, భరోసా ఇవ్వాలని సీఎం ఆదేశించారు

ఇవాళ సాయంత్రం గ్రామాల్లోకి ప్రజలను అనుమతిస్తాం

ఐదు గ్రామాల్లో ఐదుగురు మంత్రులు రాత్రి బస

మంత్రి కన్నబాబు

 విశాఖ: గ్యాస్‌ లీకేజీ ఘటనలో చనిపోయిన వారి ప్రాణాలు తీసుకురాలేమని, ఆ ఘటన దురదృష్టకరమని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు మనసున్న ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని, చనిపోయిన కుటుంబాలకు కోటి పరిహారం ప్రకటించారన్నారు. చెప్పిన మాట ప్రకారం మూడు రోజుల వ్యవధిలోనే మృతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.కోటి పరిహారం అందజేశామని కన్నబాబు పేర్కొన్నారు. సోమవారం కేజీహెచ్‌ ఆసుపత్రి వద్ద ఎనిమిది మంది మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున చెక్కులను మంత్రులు కన్నబాబు, బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్‌, ధర్మన కృష్ణదాస్‌ అందజేశారు. 

తక్షణమే ఆదుకోవాలని సీఎం ఆదేశించారు
గ్యాస్‌ లీకేజీ ఘటనలో బాధిత కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశించారని కన్నబాబు పేర్కొన్నారు. నిన్న సాయంత్రం అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం ఇవాళ చెక్కులు అందజేయాలని ఆదేశించారన్నారు. సీఎం ఆదేశాలతో చెక్కులు పంపిణీ చేశామన్నారు. విశాఖ గ్యాస్‌ లీకేజీ బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు.మూడు రో్జుల వ్యవధిలోనే కోటి రూపాయల పరిహారం పంపిణీ చేశామన్నారు.

ఐదు గ్రామాల్లో శానిటేషన్‌ పనులు
గ్యాస్‌ లీకేజీ ప్రభావం ఉన్న ఐదు గ్రామాల్లో వెయ్యి మందితో శానిటేషన్‌ పనులు చేపడుతున్నామని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. ఇప్పటికే ఆ గ్రామాల్లో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, నిపుణుల సూచనల మేరకు ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి ప్రజలను గ్రామాల్లోకి అనుమతిస్తామన్నారు. ఈ రాత్రికి ఒక్కో గ్రామంలో ఒక్కో మంత్రితో పాటు అధికారులు బస చేస్తారని, ప్రజలకు భరోసా కల్పిస్తామన్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని రేపు డిశ్చార్జ్‌ చేసి ప్రత్యేక వాహనాల్లో వారి గ్రామాలకు తరలిస్తామని చెప్పారు. గ్రామ  వాలంటీర్ల ద్వారా బాధిత కుటుంబాలకు పరిహారం చెక్కులు అందజేస్తామని కన్నబాబు పేర్కొన్నారు.
 

Back to Top