బాబు కంపెనీలో ఈసీ రమేష్‌కుమార్‌ మెంబర్‌

ఎన్నికలు వాయిదా వేయించి టీడీపీ రాక్షసానందం పొందుతుంది

చంద్రబాబు కుల ఉన్మాదం ఖండాంతరాలు దాటింది

యనమల రామకృష్ణుడు బాబు వెనక ఉన్న కీలుబొమ్మ

అచ్చెన్నాయుడికి బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు

ప్రజాతీర్పు గౌరవించలేని పవన్‌ కూడా మాట్లాడడం సిగ్గుచేటు

నవరత్నాలతో సీఎం వైయస్‌ జగన్‌ ప్రతి గడపకు చేరారు

ముక్కుసూటిగా రాజకీయాలు చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా..?

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

కాకినాడ: బోడి గుండుకు.. మోకాలుకు ముడి వేయగల కెపాసిటీ చంద్రబాబు కంపెనీకి మాత్రమే ఉంటుందని, ఆ కంపెనీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కూడా మెంబర్‌గా చేరాడని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఎన్నికలు వాయిదా వేయించి చంద్రబాబు అండ్‌ కో రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పక్షపాతంగా.. పచ్చపాతంగా నిర్ణయాలు తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. కుల అభిమానం చాలా మందికి ఉంటుంది కానీ, కుల ఉన్మాదం మాత్రం చంద్రబాబు, వారి పార్టీలోని కొంత మందికి చాలా ఎక్కువగా ఉందన్నారు. చంద్రబాబు కుల ఉన్మాదం ఖండాంతరాలు దాటిందన్నారు. కాకినాడలో మంత్రి కన్నబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఇంకా ఆయన ఏం మాట్లాడారంటే..

 • రాష్ట్రంలో పరిపాలన చేసే హక్కు తనకు ఒక్కడికే ఉన్నట్లుగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నాడు. అందుకే వ్యవస్థలను చిన్నాభిన్నం చేసి రాజకీయం చేస్తున్నాడు. బాబు జీవితం అంతా కుట్రలే. నిధులను రానివ్వకుండా చేయడం, ప్రజలను గందరగోళానికి గురిచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లుగా కనిపిస్తుంది.
 • చంద్రబాబు అండ్‌ కో.. యనమల, అచ్చెన్నాయుడు రాక్షసానందం పొందుతున్నారు. ఎన్నికలు వాయిదా వేయించి విజయం సాధించినట్లుగా ఎన్నికల కమిషనర్‌ రమేష్‌కుమార్‌ పట్ల వకల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నారు.
 • ఏం చేసినా చెల్లుతుందనే ధీమాతో ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. 2019 ఎన్నికల్లో వచ్చిన తీర్పుకు చంద్రబాబు, టీడీపీ నేతల మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. ఎన్నికల కమిషనర్‌కు ప్రజల ఆగ్రహం చూసైనా మార్పురాలేదా..?
 • ఈసీ చేసింది తప్పు. ఏ ఒక్క ముఖ్య అధికారిని, ప్రభుత్వాన్ని సంప్రదించకుండా తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని ఇప్పటికైనా అర్థం చేసుకోలేకపోయారా..?
 • సీఎస్‌కు రాసిన లేఖలో హైకోర్టు న్యాయమూర్తికి ఉండే హక్కులు ఉంటాయని ఎన్నికల కమిషనర్‌ రాశారు. ప్రభుత్వాన్ని సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని తెలియదా..? కరోనా వైరస్‌ను అడ్డుపెట్టుకొని ఎన్నికలు ఆపుతారా..?
 • వ్యవసాయ శాఖ అనేది చాలా కీలకం. విత్తనాలు సేకరించాలి. రైతు భరోసా కేంద్రాలు 20 నుంచి మొదలు పెట్టాలనుకుంటే ఈసీ పుణ్యమా అని ఆ కార్యక్రమం ఆలస్యమవుతుంది. తూర్పుగోదావరి జిల్లా శివారు భూములకు తాగునీరు అందడం లేదని రైతాంగం  ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. తగు ఆదేశాలు ఇవ్వాలో.. లేదో పరిస్థితి క్రియేట్‌ చేశారు.
 • ఈసీకి విచక్షణాధికారాలు ఎలా ఉంటాయో.. అట్లాగే మాకు విచక్షణాధికారులు ఉంటాయని భావించి ఇరిగేషన్‌ అధికారులను పిలిచి మాట్లాడడం జరిగింది. మా విచక్షణతో పనిచేసుకుంటూ వెళ్తాం.
 • కరోనా పేరు చెప్పి ఎన్నికలు వాయిదా వేసినప్పుడు వైరస్‌ వ్యాప్తి, నియంత్రణ గురించి ఎన్నికల కమిషనర్‌ ఏమైనా సమీక్ష చేస్తున్నారా..?
 • సీఎం వైయస్‌ జగన్‌ ‘స్పందన’ అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. కోడ్‌ వల్ల స్పందనను కూడా ఆపేయాలని ఆదేశాలిచ్చారంటే ఇంతకంటే సిగ్గుచేటు ఉంటుందా..? ప్రజల సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి. కోడ్‌ను బూచీగా చూపించి పరిపాలనను స్తంభింపజేస్తారా..?
 • చంద్రబాబు వెనుక ఉన్న కీలుబొమ్మ యనమల అని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఏ రాజ్యాంగ వ్యవస్థను సీఎం అవమానించారో యనమల చెప్పాలి. గ్యాలరీలో కూర్చొని మండలి చైర్మన్‌ను ప్రభావితం చేశారా..? లేక ఎన్నికల కమిషనర్‌ను ప్రభావితం చేశారా..? ఏ వ్యవస్థను అవమానించారో చెప్పాలి. పుట్టు మూగ, పుట్టు చెవుడు అంటాం.. అలా పుట్టుస్వార్థ పరుడు చంద్రబాబు.
 • వైయస్‌ జగన్‌కు ఎందుకు పాలించే హక్కు లేదో చెప్పాలి. యనమల ఏం మాట్లాడుతున్నాడో అతనికైనా అర్థం అవుతుందా..?
 • ముత్యాల ముగ్గు సినిమాలో అటొకరు.. ఇటొకరు ఉన్నట్లుగా రెండు పార్టీలు, కొంతమంది నాయకులు తయారయ్యారు. ఎన్నికలు రద్దు చేయాలని ఒకాయన అంటున్నాడు. ఇంకా వదిలేస్తే 2018 ఎన్నికలు కూడా రద్దు చేయమంటారేమో..? సినిమా షూటింగ్‌లు చేసుకుంటూ మధ్యలో వచ్చి చిన్న డైలాగ్‌లు వేస్తున్నాడు. ప్రజాతీర్పును గౌరవించాలనే కనీస జ్ఞానం లేనివాళ్లు కూడా మాట్లాడడం సిగ్గుచేటు.
 • ఆ మధ్యలో ఈవీఎంలు తేడా వచ్చాయని మాట్లాడిన చంద్రబాబు.. కుప్పంలో ఎలా గెలిచాడు. అది నోరా.. తాటిమట్టా.. అలాంటి వ్యక్తికి యనమల భజన చేస్తున్నాడు. మానసిక రుగ్మతతో బాధపడే వారు టీడీపీ నేతలే.
 • సీఎం వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడే స్థాయి ప్రజాక్షేత్రంలో గెలవలేని యనమలకు లేదు. అచ్చెన్నాయుడి నోటి దురద విపరీతమైపోయింది. బీసీలు అని చెప్పుకునే హక్కు యనమల, అచ్చెన్నాయుడికి ఉందా..? 59.85 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకుంటే టీడీపీ కార్యకర్త ప్రతాప్‌రెడ్డితో కోర్టులో వేయించి నిలుపుదల చేయించారు. బాబు కుట్రను అడ్డుకోలేని వారు బీసీల గురించి మాట్లాడే హక్కు ఉందా..?
 • కుల అభిమానం చాలా మందికి ఉంటుంది కానీ, కుల ఉన్మాదం మాత్రం చంద్రబాబు, వారి పార్టీలోని కొంత మందికి చాలా ఎక్కువగా ఉందని అందరికీ తెలుసు. రీసెర్చ్‌ స్కాలర్స్‌ టీడీపీ కుల ఉన్మాదం గురించి చెప్పారు. కులం గురించి మాట్లాడే హక్కు అచ్చెన్నాయుడికి ఉందా..? టీడీపీలో బానిసల్లా బతుకుతున్నారని అర్థం చేసుకోండి.
 • ఎంతకాలం తరువాత ఎన్నికలు వచ్చినా వైయస్‌ఆర్‌ సీపీ విజయం సాధిస్తుంది. సీఎం వైయస్‌ జగన్‌ నవరత్నాలతో ప్రతి ఇంటికి చేరుకున్నారు. అవినీతి రహిత పాలనతో లక్షలాది కుటుంబాలకు లబ్ధి జరిగింది. రైతు భరోసాతో 46 లక్షల కుటుంబాలకు మేలు, అమ్మ ఒడి పథకం ద్వారా 43 లక్షల పైచిలుకు తల్లులకు రూ.15 వేలు అందించాం. ఆటో, చేనేత సోదరులకు అవినీతి లేకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు వేయించారు.
 • భయంకరమైన ఫ్రస్టేషన్‌తో టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. కరోనా నివారణకు ఐసోలేషన్‌ సెంటర్లు, ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తే ప్రతిపక్షానికి కనిపించడం లేదా..? మీ పార్టీ పునాదులు ఎక్కడ ఉన్నాయో టీడీపీ నేతలు చెక్‌ చేసుకోండి. ఒక ఎస్టీకి మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. ఆ రోజు మీరంతా గడ్డి పీకారా.. లేక ఇంకేమైనా పీకారా..?
 • మా ముఖ్యమంత్రి ఐదు ఉప ముఖ్యమంత్రుల్లో నలుగురు బడుగు, బలహీనవర్గాలకు ఇచ్చారు. బీసీల హక్కుల గురించి, కులాల సమ ప్రాధాన్యత గురించి చంద్రబాబు, టీడీపీ నేతల నుంచి పాఠాలు నేర్చుకునే స్థితిలో ఎవరూ లేరు.
 • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్‌ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించే దమ్ము చంద్రబాబుకు ఉందా..? ఆఖరికి ఆలయ కమిటీల్లో కూడా 50 శాతం మహిళలకు అవకాశం కల్పించే సత్తా మీకుందా చంద్రబాబూ..?
 • టీడీపీకి కులం అంటే ఒక్కటే కనిపిస్తుంటుంది. కానీ సీఎం వైయస్‌ జగన్‌కు సకల కులాలు కనిపిస్తాయి. అచ్చెన్నాయుడు ఏ కులం గురించి మాట్లాడాలని చాలెంజ్‌ విసురుతున్నారో చెప్పాలి. సిగ్గు, శరం తెలుగుదేశం పార్టీకి లేదు.
 • చివరకు ఎన్నికల కమిషన్‌ను కూడా దిగజార్చే పరిస్థితికి తీసుకువచ్చారు. సీఎం వైయస్‌ జగన్‌లా ముక్కుసూటిగా రాజకీయం చేయగలిగే దమ్ము చంద్రబాబుకు ఉందా..?
Back to Top