ఐదేళ్లలో రైతుల రుణాలు ఎందుకు మాఫీ చేయలేదు

ఎన్నికల ముందు పసుపు–కుంకుమ, అన్నదాత సుఖీభవ పథకాలు

వ్యవసాయ మంత్రి కన్నబాబు 

 అమరావతి: చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానం రైతు రుణమాఫీ విస్మరించి మోసం చేశారని వ్యవసాయ మంత్రి కన్నబాబు మండిపడ్డారు. ఐదేళ్లలో రుణాలు ఎందుకు మాఫీ చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఆ పథకాన్ని మధ్యలో వదిలి పసుపు– కుంకుమ, అన్నదాత సుఖీభవ అంటూ ఓట్ల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. శుక్రవారం రైతు రుణమాఫీ బకాయిలు, చెల్లింపులపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ..ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం రుణమాఫీ చేయలేదన్నారు. పైగా నెరవేరుస్తారా లేదా అని  మమ్మల్ని అడుగుతున్నారని తప్పుపట్టారు. రుణ అర్హత పత్రాలు ఇచ్చి..నాలుగు, ఐదు విడతల్లో డబ్బులు ఇస్తామన్నారని తెలిపారు. బాబు హమీ మేరకు రూ.87 వేల కోట్లు రుణాలు మాఫీ చేయాల్సి ఉంది. రకరకాల సాకులతో దాన్ని రూ.24 వేల కోట్లకు కుదించారన్నారు.  రైతులకు పసుపు పత్రాలు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.  ఏవిధంగా ప్రజలను మోసం చేయవచ్చు అన్నది ఈ జీవో చూస్తే అర్థం అవుతుందన్నారు. మార్చి 10వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఇచ్చారని, ఈ జీవో ఇచ్చిన మరునాడు ఎన్నికల నోటిఫికేషన్‌  ఇచ్చారన్నారు. రైతులను ఆదుకోవాలనే ఆలోచన టీడీపీ ప్రభుత్వానికి లేదన్నారు. చేసిందంతా చేసి ఎదుటివారిపై తప్పులు మోపడం విడ్డూరంగా ఉందన్నారు. అన్నదాత సుఖీభవ అంటూ ఎన్నికలకు రెండు నెలల ముందుకు ఎందుకు కొత్త కార్యక్రమాన్ని తీసుకున్నారని ప్రశ్నించారు. రుణమాఫీకే డబ్బులు లేవని, కొత్త దానికి ఎలా తెస్తారన్నారు, పసుపు–కుంకుమ, ఉప్పు కారం అంటూ ఎన్నికల ముందు పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను మోసం చేయాలని చూశారన్నారు. మీరిచ్చిన హామీలన్నీ వైయస్‌ జగన్‌ నెరవేర్చుతారా అని ఎలా అడుగుతారని, మీకు మనసు ఎలా వస్తుందని నిలదీశారు. వచ్చే ప్రభుత్వంపై మీ హామీలు నెరవేర్చమంటే ఎలా సాధ్యమవుతుందన్నారు. ఎన్నికల కమిషన్‌ అన్నదాత సుఖీభవ, పసుపు–కుంకుమ పథకాలను వద్దనలేదా అన్నారు. వ్యవసాయ శాఖ డబ్బులు దారి మళ్లించారంటే వ్యవసాయంపై మీకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందన్నారు. 

 

తాజా ఫోటోలు

Back to Top