రైతుల నష్టపరిహారంపై ఎల్లో మీడియా అసత్య కథనాలు

మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

కనీస పరిజ్ఞానం లేకుండా పచ్చ మీడియాలో విషపు రాతలు

ఈ–క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులందరికీ నష్టపరిహారం  

నెల్లూరు: రైతుల నష్టపరిహారంపై ఎల్లో మీడియా అసత్య కథనాలు ప్రసారం చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. రైతుల పంటలకు నష్టం జరిగితే సత్వరమే సాయం అందిస్తున్న ఘనత సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిదని గుర్తు చేశారు.   కనీస విషయ పరిజ్ఞానం లేకుండా ప్రతిపక్షాలు, పచ్చ మీడియా అసత్య ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ–క్రాప్‌ నమోదు చేసుకుని నష్టపోయిన రైతులందరికీ పంట నష్టపరిహారం ఇచ్చామన్నారు. నెల్లూరులో గురువారం మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.  

మంత్రి కాకాణి గోవర్థన రెడ్డి మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే...

దేశంలో ఎక్కడాలేనివిధంగా ఏపీలోనే ఉచిత పంట బీమా
    ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు ఈ నెల 14వ తేదీన ఖరీఫ్‌ 2021 సంవత్సరానికి గానూ పంట నష్టానికి సంబంధించిన బీమా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. వైయస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి వైయస్సార్‌ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నాం. గతంలో ఎలాంటి పరిస్థితులు ఉండేవో, అందరికీ తెలిసిన విషయాలే అయినా ఇన్యూరెన్స్‌ కంపెనీల నిబంధనలు తెలియక ఏదో కారణంతో బీమా రాకపోవడం, ఆ తలనొప్పులన్నీ భరిస్తూ రైతులు ఆవేదన చెందేవారు. ఆ పరిస్థులను మార్చి,  రైతులు ఎవరూ రూపాయి కూడా క్లయిమ్‌ కట్టాల్సిన అవసరం లేకుండా వారి మొత్తం బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంది. రైతులు చేయాల్సిందల్లా తమ పంటను ఈ-క్రాప్ ద్వారా నమోదు చేసుకుంటే ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తూ రైతులకు పంట నష్టపరిహారం అందిస్తోంది. భారతదేశంలోనే ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఘనత మన రాష్ట్ర ప్రభుత్వానిది, ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిగారికే దక్కుతుంది.

కనీస అవగాహన లేకుండా ఎల్లో రాతలు
    పారదర్శకంగా ఉండాలనే లక్ష్యంతో పంటకు సంబంధించి రైతులు ఈ-క్రాప్ నమోదు చేసుకోవడంతో పాటు ఈ-కేవైసీ కూడా చేయించుకోవాలి. ఈ-క్రాప్ లో నమోదు చేసిన వివరాలు సరిపోయాయని రైతులు థంబ్‌ వేస్తేనే వాటిని ధ్రువీకరించినట్లు లెక్క. ఎన్నడూ లేనివిధంగా ఒకే విడతలో 2 వేల 97కోట్ల 87లక్షల రూపాయిలు అంటే దాదాపు రూ.3వేల కోట్లు రైతులకు పంట నష్ట పరిహారం అందిస్తున్నట్లు స్పష్టంగా చెప్పడం జరిగింది. చెప్పినవిధంగానే రైతుల ఖాతాల్లో జమ చేస్తే.. వాటిపై ఎల్లో మీడియాలో రాతలు, కొన్ని వ్యాఖ్యానాలు చూస్తుంటే బాధనిపిస్తోంది. రైతులకు సంబంధించి నష్ట పరిహారం పూర్తిగా ఇవ్వలేదంటూ ఒక పత్రికలో రాసిన రాతలు కానీ, వాటిని పట్టుకుని కనీస అవగాహన లేకుండా టీడీపీ నేతలు కొంతమంది చేస్తున్న విమర్శలు చూస్తే ... ఎంతసేపటికీ రైతులంతా నష్టపోవాలి, ఏ ఒక్కరూ బాగుండకూడదన్నదే వీరి విధానంగా కనిపిస్తుంది. నిజంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఏవిధంగా ఇస్తారనేదానిపై కనీస పరిజ్ఞానం లేకుండా ఆ రాతలు రాసినట్లు కనిపిస్తోంది. ఇదంతా చూస్తుంటే ఆ పత్రికల్లో పంటల బీమా వార్తలు రాసేవారికి కూడా శిక్షణ అవసరమేమో అనిపిస్తోంది.

- అరాకొర బీమా అని, వేరుశెనగకు నామమాత్రం పరిహారం అని, జిల్లాల వారీగా పరిహారం వివరాలు గోప్యం అని, పంటల బీమా లబ్దిదారులు 30లక్షలు, పరిహారం 17లక్షలు అంటూ రకరకాలుగా ఎల్లో మీడియా పత్రికల్లో వార్తలు రాశారు. ఇదంతా చూస్తుంటే అసలు బీమా ఏవిధంగా ఇస్తారు అనేదానిపై వీరికి ఏమాత్రం పరిజ్ఞానం లేదని అర్థమవుతుంది. రాష్ట్రంలో దాదాపు 50 లక్షల మందికి పైగా రైతులు ఉంటారు.  రైతులు పండించే పంటల్లో.. 31 రకాల పంటలు ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ కిందకు వస్తాయి. మరో 22 పంటలు ఈల్డ్‌ బేస్డ్ వి, 9పంటలకు ప్రకృతి, వాతావరణ పరిస్థితులను బట్టి పరిహారం చెల్లించే వెదర్ బేస్డ్ వి. 31 పంటలకు సంబంధించి 31 లక్షలమంది రైతులు ఈ-క్రాప్ నమోదు చేస్తే...  వారందరికీ బీమా చెల్లించమని ఎల్లో మీడియాలో రాతలు రాస్తుంటే..  వారి తెలివితేటలకు నా జోహార్లు.

- జిల్లా, మండల, గ్రామస్థాయిల్లో ఆయా పంటలకు సంబంధించి యావరేజ్‌ తీసుకుని..  ఏఏ పంటలకు నష్టపరిహారం ఇవ్వాలనే దానిపై విధివిధానాలను అనుసరించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ధాన్యం పండించే రైతులు నష్టపోకూడదనే గ్రామ స్థాయి నుంచే యావరేజ్‌ తీసుకుని పంటల బీమా చెల్లించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. పంటలు ఏవిధంగా నష్టపోయారనేదానిపై ప్లానింగ్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఇచ్చిన ఆధారాల ప్రకారమే.. గణాంకాలు తయారు చేశాం. ఈ విధానం అత్యంత పారదర్శకంగా ఉంటుంది. 

- మూడేళ్ల యావరేజ్‌ తీసుకుని దాని ప్రకారం బీమా చెల్లించడం జరుగుతుంది. వీటన్నింటిని పక్కనపెట్టి... కనీస అవగాహన లేకుండా 30లక్షల మంది ఈ-క్రాప్ లో నమోదు చేసుకుంటే 15లక్షల మందికే ఇచ్చారని అడ్డగోలుగా రాతలు రాయడం దౌర్బాగ్యం. వ్యవసాయంపై కనీస పరిజ్ఞానం లేనివాళ్ళు ఆ మీడియాల్లో పనిచేస్తూ, వాస్తవాలను వక్రీకరిస్తూ పదే పదే అబద్ధాలు, అసత్యాలతో కూడిన వార్తలను వండివారుస్తున్నారు.  

- పదివేల గ్రామాల్లో ఎక్స్‌పరిమెంట్లు చేశాం. ఈ 31 రకాల పంటల్లో 5 పంటలకు ఎక్కడా నష్టం జరగలేదని ప్లానింగ్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు ఓ నివేదిక ఇచ్చారు. దాని ఆధారంగా ఏ పంటలకు అయితే నష్టం వాటిల్లిందో ఆ పంటలకు మాత్రమే నష్టపరిహారం చెల్లించాం. దీనిపై ఎల్లో మీడియాకు చెందిన ఒక మహా మేథావి ఇక్కడో రేటు, అక్కడో రేటు ఇచ్చారని పత్రికలో రాశాడు. ఈల్డ్‌ బేస్డ్, వెదర్‌ బేస్డ్... వర్షాభావ పరిస్థితులు, వాతావరణ పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకుని బీమా చెల్లించడం జరుగుతుంది. రాష్ట్రంలో దాదాపు 2వేల వాతావరణ కేంద్రాలు ఉన్నాయి. వారిచ్చే నివేదికల ఆధారంగా పారమీటర్లను పరిగణనలోకి తీసుకుని ఎంతమందికి ఇవ్వాలనేదానిపై లెక్కగట్టి... ఎంతమంది రైతులు పంట నష్టపోయారనేది నిర్థారించి, వారికి బీమా అందించడం జరుగుతుంది. 

టీడీపీ జన్మలో ఏడాదిలో ఇంత బీమా సొమ్ము ఇచ్చారా..?
    తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రైతులకు ఒక్క విడతలో రైతులకు ఇంత మొత్తంలో ఎప్పుడైనా బీమా చెల్లించారా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. రూ. 3,411 కోట్లు ఇచ్చామని మేము చెప్పాం. టీడీపీ హయాంలో 2018-19 సంబంధించి రూ . 596 కోట్లు బకాయిలు ఎగ్గొట్టి వెళ్లిపోతే మేం చెల్లించాం, అదికూడా కలిపితే రూ. 4,007 కోట్లు అవుతుంది. గత టీడీపీ సర్కార్‌ ఎగ్గొట్టిన బకాయిలను కూడా మేం చెల్లిస్తుంటే.. వాటికి వక్రభాష్యాలు చెబుతూ రైతులను గందరగోళపరిచేలా టీడీపీ నేతల మాటలు, ఎల్లో మీడియా రాతలు ఉన్నాయి. 

 - రాష్ట్రంలో రైతులు జోరుగా ఉంటే చంద్రబాబు నాయుడు బేజారు అయిపోతాడు. అందుకే ఇప్పుడు  రైతు పోరు అంటున్నాడు. చంద్రబాబుకు సిగ్గు ఉంటే మీ హయాంలో రైతుకు చేసిన మేలు  గురించి చెప్పగలరా?. మీరు దోచుకున్న కమీషన్ల మాట పక్కన పెట్టి  ఏం చేశామనేది చెప్పాలి. మీరు చెప్పుకునేందుకు ఏమీ లేకపోగా... మహానాడులు పెట్టి మమ్మల్ని అయ్యన్నపాత్రుడితో బూతులు తిట్టించడం కాదు.  టీడీపీ హయాంలో రైతు రథం, సంక్రాంతి కానుక, రంజాన్‌ తోఫా, క్రిస్మస్‌ కానుకల పేరుతో దోచుకున్నారు తప్పితే ప్రజలకు ఒరిగిందేమీ లేదు. మీరు ఎంతసేపటికీ దోపిడీ పథకాలు అన్వేషించారే తప్ప రైతులకు,  ప్రజలకు శాశ్వతంగా మేలు చేసేలా పలానా కార్యక్రమం అమలు చేశానని, పలానా పథకాలు అమలు చేశామని చెప్పగలరా? రైతులకు రూ. 87 వేల కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారా లేదా? మహిళలకు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారా, లేదా?

- మీ హయాంలో రైతులకు సంబంధించి కనీసం ఇన్సూరెన్స్‌ డబ్బులు అయినా చెల్లించారా? నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చారా? డ్రిప్‌ ఇరిగేషన్‌ సబ్సిడీలు అందించారా? అలాంటి మీరా రైతుల గురించి మాట్లాడేది? టీడీపీ సర్కార్‌ రైతులకు సంబంధించిన అన్ని బకాయిలను మేము అధికారంలోకి వచ్చాక చెల్లించాం.

బాబు పాపాలు రాష్ట్రానికి శాపాలయ్యాయి
    చంద్రబాబు చేసిన పాపాలు అన్నీ రాష్ట్రానికి  శాపాలుగా మారాయి. చంద్రబాబు తనకు తాను యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ అంటే మాకేమీ ఇబ్బంది లేదు. అయితే, ఆయన వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమిటో చెబితే బాగుంటుంది.  మేము ధైర్యంగా చెబుతాం.  రైతు భరోసా, వైయస్సార్‌ చేయూత, అమ్మ ఒడి, ఆసరా, ఈబీసీ నేస్తం.. ఇలా ఎన్నో పథకాలను మేము చెప్పాం చేశాం. అలాంటి పథకాలు ఏమైనా ఒక్కటి చేశామని చంద్రబాబు చెప్పగలడా? ఆయనలా దోపిడీ పథకాలు మేమెక్కడా చేయలేదు. రైతులను అడ్డుపెట్టుకుని మీమాదిరిలా మేమేమీ దోచుకోలేదు కదా.

- మహా మేథావిలా, తానే వ్యవసాయ శాస్త్ర పితామహుడులా నారా లోకేష్‌ లేఖలు రాస్తున్నాడు. ఆయనకేమైనా వ్యవసాయంపై పరిజ్ఞానం ఉందా? ఏ వాతావరణంలో ఏ పంటలు వేస్తారు అనేది తెలుసా? వ్యవసాయ శాస్త్రవేత్తలా లోకేష్‌ ఎవరో రాసిన లేఖ మీద సంతకం పెడతాడు. ఇక మరో డబ్బింగ​ ఆర్టిస్ట్‌ టీడీపీ రాసిన లేఖలపై సంతకాలు పెట్టడం, వాళ్లు మాట్లాడమన్నట్లు మాట్లాడటం, ఆరిపోతున్న తెలుగుదేశం పార్టీకి పవన్‌ కల్యాణ్‌ చేతులు అడ్డుపెడుతున్నాడు. 

క్రాప్ హాలిడే పరిస్థితులే రాష్ట్రంలో లేవు.. అది ప్రతిపక్షాల కుట్ర
    రైతులు ఈ ప్రభుత్వానికి అండగా ఉంటున్నారని, ముఖ్యమంత్రి జగన్ గారికి రైతుల ఆశీస్సులు మెండుగా ఉన్నాయని చూసి ఓర్వలేకే..  విపక్షాలు క్రాప్ హాలిడేను తెరమీదకు తెచ్చాయి. ప్రభుత్వానికి రైతుల్లో వ్యతిరేకత ఉందన్న భావనను కలిగించేందుకు అటు మీడియా ద్వారా,  ఇటు కొంతమంది రైతులను రెచ్చగొట్టి వాళ్లను రోడ్ల మీదకు తీసుకువచ్చి రాజకీయంగా పబ్బం గడుపుకుంటున్నారు. 40ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఉండి, ముఖ్యమంత్రిగా పనిచేసిన బాబు కనీస పరిజ్ఞానం లేకుండా దివాళాకోరు మాటలు మాట్లాడుతున్నారు. నేల టిక్కెట్ వాళ్ల కన్నా దౌర్బాగ్యంగా బాబు మాట్లాడుతున్నాడు. ఆయన చేసిందల్లా సోమవారం పోలవరం అంటూ హెలికాప్టర్‌ పర్యటనలు చేశాడు. ఆ హెలికాప్టర్‌ ఖర్చులతో అయినా పోలవరం ప్రాజెక్ట్‌ పనులు కొంతమేరకు జరిగేవి.

మూడేళ్ళు కోమాలో ఉన్నబాబు
     చంద్రబాబు నాయుడు హయాంలో ఈ పథకం అమలు చేశామని ధైర్యంగా చెప్పగలవా? చంద్రబాబు విధానాలు కానీ, పద్ధతిగానీ బాగోలేదు. మూడేళ్లు కోమాలో ఉన్న చంద్రబాబు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాడు. ఎన్నికలు దగ్గరకు వచ్చేటప్పటికీ ఆయనకు ఎనర్జీ తన్నుకొస్తుందట. చంద్రబాబు నాయకత్వం పట్ల విశ్వాసం ఉందని టీడీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలే చెప్పరు.  

- పంటల బీమా పరిహారంలో ఎక్కడా గోప్యత లేదు. రైతు భరోసా కేంద్రాల్లో అన్ని వివరాలు డిస్‌ప్లే చేశాం. వెబ్ సైట్ లో బహిరంగపరిచాం. ఇప్పటికైనా ప్రభుత్వంపై బురదచల్లే కార్యక్రమాలకు స్వస్తి పలకండి. ఏమైనా అనుమానాలు ఉంటే మమ్మల్ని అడిగితే నివృత్తి చేస్తాం. అంతేకానీ వివరణ ఇచ్చే అధికారులపై కూడా విమర్శలు చేయడం తగదు. ఎవరు ఎన్నివిధాలుగా అడ్డుపడ్డా మా ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది. ముఖ్యమంత్రిగారు చెప్పినట్లు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఆవిధంగానే మేము ముందుకు వెళుతున్నాం. రైతు బాగుండాలనే ప్రభుత్వం కాబట్టే ముఖ్యమంత్రిగారికి రైతుల ఆశీస్సులు ఉన్నాయి. అందుకే రైతుల మనస్సుల్లో లేనిపోని అనుమానాలు పెట్టి వారిలో చిచ్చుపెట్టే ప్రయత్నాలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top