బ్ల‌డ్‌ శాంపిల్స్‌ ఇవ్వడానికి నేను సిద్ధం.. సోమిరెడ్డి రెడీనా..? 

టీడీపీ నేత సోమిరెడ్డికి మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి స‌వాల్‌

బెంగ‌ళూరు రేవ్ పార్టీపై సోమిరెడ్డి నాపై చేస్తుందంతా అస‌త్య ప్ర‌చారం

అక్క‌డున్న కారు నాదేన‌ని సోమిరెడ్డి నిరూపించ‌గ‌ల‌డా..? 

రాజకీయంగా న‌న్ను ఎదుర్కొలేకే చౌకబారు ఆరోపణలు 

నెల్లూరు: రేవ్‌ పార్టీ అంశంలో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నాడని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి మండిపడ్డారు. త‌న పాస్‌పోర్టు తన దగ్గరే ఉందని, తన పాస్‌పోర్టు బెంగ‌ళూరులో దొరికిన‌ట్లు రుజువు చూపించాలని డిమాండ్ చేశారు. అక్కడ ఉన్న కారు త‌న‌దేన‌ని సోమిరెడ్డి నిరూపించ‌గ‌ల‌డా..? అని ప్ర‌శ్నించారు. నెల్లూరులో మీడియా స‌మ‌క్షంలో ర‌క్త‌ప‌రీక్ష‌కు తాను సిద్ధ‌మ‌ని, సోమిరెడ్డి సిద్ధ‌మేనా అని స‌వాల్ విసిరారు. ఎవరు తాగుతారో, డ్రగ్స్‌ తీసుకుంటారో బ్ల‌డ్ శాంపిల్‌లో తేలిపోతుందన్నారు. నెల్లూరులో మంత్రి కాకాణి విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. 

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. బెంగళూరు రేవ్‌ పార్టీకి, ఆ కేసు నిందితులకు.. తనకు ఎలాంటి సంబంధాలు లేవని మ‌రోమారు స్పష్టం చేశారు. సోమిరెడ్డిది నీచమైన చరిత్ర అని, అలాంటి చరిత్ర త‌న‌కు  లేదన్నారు. రిసార్ట్‌ ఓనర్‌ గోపాల్‌రెడ్డితో త‌న‌కు సంబంధాలు ఉన్నాయని సోమిరెడ్డి ఆరోప‌ణ‌లు చేస్తున్నాడ‌ని, దానికి ఒక్క ఆధారమైనా చూపించగలరా?. అని ప్ర‌శ్నించారు. రాజకీయంగా ఎదుర్కొలేకే ఈ చౌకబారు ఆరోపణలు చేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు. సోమిరెడ్డి చీకటి కోణాలు చాలానే ఉన్నాయ‌ని, పురాతన పంచలోహ విగ్రహాలను అమ్మేందుకు సోమిరెడ్డి విదేశాలకు వెళ్లాడ‌న్నారు. తాను చేస్తున్నవి ఆరోపణలు కావు.. పచ్చి నిజాలు అని కాకాణి స్ప‌ష్టం చేశారు.    

టీడీపీ నేత సోమిరెడ్డి వ్యక్తిగతంగా త‌న‌ను టార్గెట్‌ చేశాడ‌ని, బెంగళూరు రేవ్‌ పార్టీతో త‌న‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. డ్రగ్స్‌ ఆరోపణల నేపథ్యంలో.. బ్ల‌డ్‌ శాంపిల్స్‌ ఇవ్వడానికి తాను రెడీగా ఉన్నాన‌ని,  సోమిరెడ్డికి దమ్ముంటే త‌న ఛాలెంజ్‌ను స్వీకరిస్తారా?. అని ప్ర‌శ్నించారు. త‌న‌ పాస్ పోర్ట్ త‌న వ‌ద్దే ఉందన్నారు కాకాణి. ఇదివరకే మీడియా సమావేశం పెట్టి ఈ విషయాన్ని చెప్పాన‌ని, అయినా సోమిరెడ్డి పదే పదే అదే ఆరోపణ చేస్తున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. రేవ్ పార్టీతోగానీ, ఆ కేసు నిందితులకి త‌న‌కు ఎలాంటి సంబంధాలు లేవని పున‌రుద్ఘాటించారు. త‌న‌ కారు స్టిక్కర్ వాడకంపై ఇదివరకే పోలీసులకు ఫిర్యాదు చేశాన‌ని మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి మరోసారి స్పష్టత ఇచ్చారు.

Back to Top