దుష్టచతుష్టయమే దండుపాళ్యం ముఠా

నిస్వార్థ ప్ర‌జా సేవ‌కులు వ‌లంటీర్ల‌పై ప‌వ‌న్‌, చంద్ర‌బాబు అక్క‌సు

దత్త తండ్రి కోసమే పవన్‌కళ్యాణ్‌ రాజకీయం

టీడీపీ అక్రమాలపై ఎప్పుడూ నోరెత్తని పవన్‌

రుషికొండపై అన్ని అనుమతితోనే నిర్మాణాలు

రుషికొండ పక్కనే గీతం వర్సిటీ యథేచ్ఛ భూకబ్జా క‌నిపించ‌లేదా..?

జనసేన ఎజెండాను ప‌క్క‌న‌పెట్టి.. బాబు ఎజెండా కోసమే పనిచేస్తున్న దత్తపుత్రుడు

చంద్రబాబు కోసం ఎందుకంత బానిసత్వం?

ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్ 

విశాఖపట్నం: నిజానికి రాష్ట్రంలో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, రామోజీరావు, రాధాకృష్ణ.. వీళ్లను మించిన దండుపాళ్యం బ్యాచ్‌ మరేదైనా ఉందా? వీరిని మించిన స్టూవర్ట్‌పురం దొంగలు ఇంకెవరైనా ఉన్నారా? అని ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్ ప్ర‌శ్నించారు. సేవా భావంతో పని చేస్తున్న వలంటీర్లపై పవన్‌కళ్యాణ్‌ మరోసారి నోరు పారేసుకున్నాడ‌ని,  విధుల నుంచి తప్పించిన వలంటీర్, ఎక్కడో పని చేస్తూ.. ఏదో నేరం చేస్తే మొత్తం వలంటీర్లను దండుపాళ్యం బ్యాచ్‌ అన్న పవన్‌ మరోసారి వారిపై తన అక్కసు వెళ్లగక్కాడ‌ని మంత్రి అమ‌ర్‌నాథ్ మండిప‌డ్డారు. చంద్రబాబు కోసమే రాజకీయాలు చేస్తున్న పవన్‌కళ్యాణ్‌.. అచ్చం ఆయన మాదిరిగానే నిత్యం ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు. జ‌గదాంబ జంక్షన్‌లో వలంటీర్లను అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మ‌లు అని సంబోధించిన పవన్, ఆ వెంటనే శవ రాజకీయం చేస్తూ.. వారిని దండుపాళ్యం బ్యాచ్‌ అని విమర్శించాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. ప్యాకేజీలు తీసుకుంటున్న పవన్‌కళ్యాణ్, నిత్యం ప్రభుత్వంపై బురద చల్లుతూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. విశాఖపట్నం సర్క్యూట్‌ హౌస్‌లో మంత్రి గుడివాడ అమర్‌నాథ్ విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఏం మాట్లాడారంటే..

ప్రతి ప్రసంగం ముందు అనేక పుస్తకాలు చదువుతానన్న పవన్‌కళ్యాణ్, నిజంగా అలా చదివితే.. జ్ఞానానిచ్చే పుస్తకాలు చదివి ఉంటే బాగుండేది. ఎక్కడికక్కడ కథా రచయితలను పక్కన పెట్టుకుని, వారిచ్చినవి చదవడం, చంద్రబాబు పంపిన స్క్రిప్ట్‌ను వల్లె వేయడమే పవన్‌కళ్యాణ్‌ పని. అంతే తప్ప ఆయనకు ఏ విషయంపైనా అవగాహన లేదు. స్పష్టత లేదు. ప్రభుత్వాన్ని నిందించడం, ఎవరైనా, ఏదైనా అడిగితే మీ సంగతి తేలుస్తా, కేంద్రానికి ఫిర్యాదు చేస్తా అని బెదిరించడం పవన్‌కు అలవాటు. పవన్, ఎందుకా పనికి మాలిన కట్టుకథలు?. కేంద్రంతో కాకపోతే వెళ్లి మీ అత్తారిల్లు అయిన రష్యా అధ్యక్షుడికి చెప్పుకో.

దత్త తండ్రి మాదిరిగా రోజూ ప్రభుత్వంపై బురద చల్లుతూ, విషం చిమ్ముతూ, పిచ్చి మాటలు మాట్లాడుతున్న పవన్‌కళ్యాణ్‌.. అసలు తాను రాజకీయం చేస్తోందే సీఎంని పదవి నుంచి తప్పించడానికి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది అన్నది చెప్పరు. కనీసం తమ పార్టీ సిద్ధాంతం ఏదో కూడా ఆయన అస్సలు ప్రస్తావించరు. ఇక వారాహి యాత్ర ఎందుకన్నది కూడా అర్ధం కాదు. రేపు పవన్‌ మంగళగిరి వెళ్లిపోతారు. చంద్రబాబు విశాఖకు వస్తారు. ఎందుకు విడివిడిగా తిరగటం?. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు ఇద్దరూ కలిసే రావొచ్చు కదా? బీచ్‌ ర్యాలీ, విసన్నపేటలో పర్యటన చేయొచ్చు కదా? వేర్వేరుగా ఎందుకు తిరగడం?.

రుషికొండపై ప్రభుత్వ స్థలంలో అన్ని అనుమతులతోనే భవనాల నిర్మాణం జరుగుతోంది. ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వమే స్వయంగా కడుతున్న భవనాలు అవి. అయినా పవన్‌కళ్యాణ్, అక్కడికి వెళ్లి, ఏదో ఘోరం జరిగిపోతుందన్నట్లు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. రుషికొండపై పర్యాటక శాఖ నిర్మాణాలను తప్పు పడుతున్న పవన్‌కళ్యాణ్‌.. గీతం వర్సిటీ అక్రమాలను ఎందుకు ప్రస్తావించడం లేదు?. గీతం వర్సిటీ నీ దత్తతండ్రి బావమరిది బంధువులది. బాలకృష్ణ చిన్నల్లుడు, లోకేశ్‌ తోడల్లుడిది. మీ అన్న చిరంజీవి ఏదో సినిమాలో అన్నట్లు.. రుషికొండ వద్ద ఒక్కసారి నీ ఫేస్‌ లెఫ్ట్‌కు టర్నింగ్‌ ఇచ్చి ఉంటే.. యథేచ్ఛగా గీతం వర్సిటీ ఆక్రమించిన భూమి కనిపించేది. కానీ, నీవు ఆ పని చేయలేదు. ఎందుకంటే అది నీ దత్తతండ్రి దగ్గరి బంధువుది కాబట్టి. నీ దత్తతండ్రి హయాంలో గీతం వర్సిటీ ఏకంగా 43 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసింది.

రుషికొండ పక్కనే రామానాయుడు స్టూడియో, శ్రీ వెంకటేశ్వరస్వామి వారి అలయం, మరో పక్క ఐటీ హిల్స్, వెల్‌నెస్‌ సెంటర్లు.. అన్నీ కొండలపైనే ఉన్నాయి. అక్కడ కొండలు ఎక్కువ. భూమి తక్కువ. అందుకే కొండలపై నిర్మాణాలతో అభివృద్ధి పనులు చేశారు. చివరకు విజయవాడలో కూడా ఒక కొండను తొలచి, రోడ్డు వేశారు. ఇక చంద్రబాబు రాజగురువు రామోజీరావు హైదరాబాద్‌లో కొండలు తొలచి స్టుడియోలు కట్టలేదా?. మీ అన్న చిరంజీవి జూబ్లీ హిల్స్‌లో ఇల్లు ఎక్కడ కట్టారు? కొండ మీద కాదా?. అదే రుషికొండలో అన్ని అనుమతులతో ప్రభుత్వం తమ భూమిలో నిర్మాణాలు చేపడితే, అక్కసు వెళ్లగక్కుతున్న పవన్‌కళ్యాణ్‌ విపరీతంగా దుష్ప్రచారం చేస్తున్నారు. 

ఇప్పుడు ప్యాకేజీల తీసుకుని చంద్రబాబు కోసమే పని చేస్తున్న, ఆయన కోసమే రాజకీయం చేస్తున్న పవన్‌కళ్యాణ్‌.. ఆనాడు అదే చంద్రబాబు, రామోజీరావు చేసిన కుట్రలు మర్చిపోయారా? మీ అన్న చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు, అందులోకి తన కోవర్టులను పంపించి చంద్రబాబు చేసిన రాజకీయం నీకు గుర్తు లేదా? అప్పటి ఎన్నికల్లో మీ అన్న పార్టీ ప్రజారాజ్యం కేవలం 18 సీట్లు గెల్చుకుంటే.. చంద్రబాబు రాజగురువు అయన రామోజీరావు తన పత్రికలో ఏం రాశారు? ‘జెండా పీకేద్దాం’.. అన్న హెడ్డింగ్‌తో వార్తలు రాశాడు. అలాగే ఆనాడు ఇదే ఆంధ్రజ్యోతి మీ అన్నయ్య మీద చేసిన ఆరోపణలు నీకు గుర్తు లేవా? చివరకు  లేపాక్షి ఉత్సవాల్లో మీ అన్నయ్య చిరంజీవికి జరిగిన అవమానం మర్చిపోయావా? అన్నీ మర్చిపోయిన పవన్‌కళ్యాణ్, ఇప్పుడు వారితో ఏకమై, దుష్ట చతుష్టయంలో ఒకరిగా మారి, ప్రభుత్వాన్ని నిందించడమే పనిగా రాజకీయం చేస్తున్నారు. జనసేన జెండాను పక్కనపెట్టి, బాబు ఎజెండాతో పని చేస్తున్నారు. పవన్‌ నీకెందుకంత రాజకీయ బానిసత్వం?.

రుషికొండపై కడుతున్న భవనాలను దేని కోసం వాడాలన్నది ప్రభుత్వ నిర్ణయం. ఎందుకంటే అది ప్రభుత్వ స్థలం. అక్కడ ప్రభుత్వమే స్వయంగా నిర్మాణాలు చేస్తోంది. కావాలంటే నిర్మాణాలు పూర్తయ్యాక అక్కడికి వెళ్లి చూడొచ్చు. అంతేకానీ, ఎప్పుడు పడితే అప్పుడు పోయి, ప్రభుత్వాన్ని నిందించడం తప్పు. అనుమతి లేకున్నా రుషికొండ వెళ్లడం తప్పు. అలా వెళ్లడమే కాకుండా, తన రాజకీయ లబ్ధి కోసం పవన్‌ ఆ నిర్మాణాల వీడియోలు తీశారు. దానిపై కేసు నమోదు చేస్తాం. 

విసన్నపేటలో త‌న‌కు 600 ఎకరాల భూమి ఉందని పవన్‌కళ్యాణ్‌ ఆరోపించాడ‌ని, అది నిరూపిస్తే.. ప్రెస్‌మీట్‌కు వచ్చిన ఒక్కో విలేకరికి ఒక్కో ఎకరం.. ఇంకా మిగిలితే ఆ భూమి జనసేన పార్టీకి ఇచ్చేస్తాన‌ని ప‌వ‌న్‌కు మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్ సవాల్. సీఎం విశాఖకు రావడానికి ఏ బిల్లు, ఎవరి అనుమతి అవసరం లేదు. ఆయన ఎక్కడ నుంచి అయినా పాలన చేయవచ్చని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

తాజా వీడియోలు

Back to Top