తాడేపల్లి: మార్చిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తామని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. ప్రపంచంలో పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సరికొత్త పాలసీ సిద్ధం చేశామన్నారు. పారిశ్రామికవేత్తలు సులువుగా పెట్టుబడులు పెట్టేందుకు సవరణలు చేశామన్నారు. ప్రస్తుతం మిగతా రాష్ట్రాలకంటే మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారన్నారు. రాష్ట్రం పారిశ్రామిక రంగంలో మరింత అభివృద్ధి చెందాలని మూడు పోర్టుల నిర్మాణానికి సీఎం వైయస్ జగన్ అంగీకారం తెలిపారన్నారు. సచివాలయంలో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పరిశ్రమలను రాష్ట్రానికి తెచ్చేందుకు సీఎం వైయస్ జగన్ కృషి చేస్తున్నారన్నారు. పరిశ్రమలకు ఉన్న ప్రతి సమస్యను పరిష్కారిస్తామన్నారు.
చంద్రబాబు హయాంలో వదిలేసిన పరిశ్రమలను కూడా రాష్ట్రానికి వచ్చేలా కృషి చేస్తున్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పాసిటీవ్ ఆటిట్యూడ్‌తో ఉంది కాబట్టి పెట్టుబడులు పెట్టేందుకు ఇండస్ట్రీస్ ముందుకు వస్తున్నాయన్నారు. తొమ్మిది నెలల పాలనలోనే రాష్ట్రంలోకి అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయన్నారు. ఆరు నెలల్లోనే ఈవీ బస్సులకు అనుమతి ఇచ్చామన్నారు. శ్రీసిటీలో పర్యటన చేశామని, జపాన్‌కు చెందిన ఇన్వెస్టర్స్ 75 శాతం స్కిల్ మాన్‌పవర్‌ను పరిశ్రమలకు అందిస్తున్నందుకు సంతోషిస్తున్నారన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఐటీ విభాగానికి సంబంధించి విశాఖలో దాదాపు 50 వేల ఉద్యోగాలు, ఎలక్ట్రానిక్స్ విభాగానికి సంబంధించి తిరుపతిలో మరో 50 వేల ఉద్యోగాలు ఇవ్వనున్నామన్నారు. ఇండస్ట్రీయల్ సెక్టార్‌లో కూడా ఫుడ్‌ప్రాసెసింగ్, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లో యువతకు కూడా ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో కొత్త ఇండస్ట్రీయల్ పాలసీని రూపొందించబోతున్నామని, ప్రపంచస్థాయి సంస్థలు వచ్చి పెట్టుబడులు పెట్టే విధంగా.. ఏ రాష్ట్రంలో లేని విధంగా వర్క్‌ఫోర్స్‌ను కూడా కచ్చితంగా పరిశ్రమలకు అందించబోతున్నామన్నారు. పరిశ్రమలు తరలిపోతున్నాయంటూ ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. టీడీపీ చేసే విష ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దన్నారు.