చంద్రబాబుది ఆర్భాటం, ఆతృతతో కూడిన అసమర్థత

వైయస్‌ జగన్‌ ప్రభుత్వానిది సహనంతో కూడిన సమర్థత

హోదాతో పాటు పోలవరం నిధులనూ చంద్రబాబు తాకట్టుపెట్టారు

ప్రచారం కోసమే పట్టిసీమను తెరపైకి తెచ్చిన బాబు

పట్టిసీమ పోలవరంలో భాగమైనా రూ.1600 కోట్ల అదనంగా ఖర్చు

పోలవరం వ్యయం పెరుగుతుందని 2014లోనే కేంద్రం చెప్పింది

2016 సెప్టెంబర్‌ వరకు పోలవరాన్ని చంద్రబాబు పట్టించుకోలేదు

ప్యాకేజీకి అంగీకరించి రాష్ట్రానికి చంద్రబాబు నష్టం మిగిల్చారు

అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

అసెంబ్లీ: స్పెషల్‌ ప్యాకేజీకి అంగీకరించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చంద్రబాబు నష్టం మిగిల్చారని, ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్టు నిధులను సైతం చంద్రబాబు తాకట్టుపెట్టారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. పట్టిసీమ పోలవరంలో భాగమైనా అదనంగా రూ.16 వందల కోట్లను చంద్రబాబు ఖర్చు చేశారని, ప్రచారం కోసమే పట్టిసీమను తెరపైకి తీసుకువచ్చారని మండిపడ్డారు. చంద్రబాబుది ఆర్భాటం, ఆవేశం, ఆతృతతో కూడిన అసమర్థత అని బుగ్గన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రభుత్వానిది సహనంతో కూడిన సమర్థత అని స్పష్టం చేశారు. 

అసెంబ్లీలో మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. 

‘పోలవరం ప్రాజెక్టు, ఇరిగేషన్‌ సెక్టార్‌కు సంబంధించిన నిజాలు సభకు, రాష్ట్రానికి తెలియజేశారు. 2014లో అన్యాయంగా, అనైతికంగా విభజన జరిగిన తరువాత కొన్ని హామీలు గమనిస్తే.. విభజన జరిగినప్పుడు రాష్ట్రంలో 58 శాతం జనాభా, అప్పు ఇక్కడ ఉంది. ఆదాయం చూస్తే తెలంగాణలో 15 శాతం ఎక్కువ. జనాభా, అప్పు మనకు, ఆదాయం మాత్రం పక్కరాష్ట్రానికి వెళ్లింది. పరిశ్రమలంతా పక్కరాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయంపై ఆధారపడే రాష్ట్రంగా మిగిలిపోయింది. భగవంతుడు ఎన్ని వైఫల్యాలు, వైకల్యాలు ఇచ్చినా.. కొన్ని నదుల ద్వారా మన వ్యవసాయాన్ని, రైతాంగాన్ని కాపాడుకునే అవకాశం భగవంతుడు ఇచ్చాడు. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులతో పాటు పోలవరం జీవనాడిగా ప్రజలు భావించారు.

పోలవరం ప్రాజెక్టు పట్ల వివిధ రకాల వ్యక్తులు, వివిధ రకాల మీడియా సంస్థలు పలు రకాలుగా ప్రచారం చేస్తున్నారు. ప్రాజెక్టుపై నిజాలు ప్రజలకు తెలియజేస్తున్నాం. 2014లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కాకముందే కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం మొదటి కేబినెట్‌ భేటీ 1–5–2014లో ఒక నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఏర్పాటు, గవర్నింగ్‌ బాడీ ఏర్పాటు. అథారిటీ విధి విధానాలతో పాటు పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి కేంద్రం నుంచి క్లెయిమ్‌ చేసుకునే వసతి కల్పించారు. 

2010–11 రేట్ల ప్రకారం రూ.16.10 వేల కోట్లుగా ఉంది. ఈ ఖర్చు రాబోయే రోజుల్లో పెరిగే అవకాశం ఉంది. కామాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ పెరిగే అవకాశం ఉంది. డ్యామ్, కెనాల్స్‌ వంటి నిర్మాణాలకు ఖర్చు పెరిగే అవకాశం ఉంది. అది మొత్తం కేంద్రమే భరిస్తుంది. ఆ బాధ్యత కూడా కేంద్ర బడ్జెట్‌ నుంచి ప్రతి సంవత్సరం పోలవరం ప్రాజెక్టుకు డబ్బులు రావాల్సి ఉంది. దీనికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఏర్పాటు చేశారు. 

గత నెల రోజుల నుంచి చూస్తున్నాం. మీడియా సంస్థలు, ప్రతిపక్ష నేతల మాటలు చూస్తుంటే.. నిజంగా వారికి పోలవరం పూర్తికావాలని ఉందా.. లేదా..? అనేది అనుమానం వస్తుంది. ‘పోలవరం బలి. బహులార్దక సాధక ప్రాజెక్టుకు గ్రహణం’ ఇలా డజన్ల కొద్ది కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయి. ప్రభుత్వానికి చెడ్డపేరు, ప్రజల్లో అభద్రత భావం రావాలి. దీని ద్వారా ప్రతిపక్షానికి మేలు చేయాలనే తపన మీడియా సంస్థల్లో, కొందరిలో కనిపిస్తుంది. 

2014 నుంచి 2016 సెప్టెంబర్‌ వరకు పోలవరం ప్రాజెక్టును పట్టించుకోలేదు. పోలవరం వదిలి పట్టిసీమ కడతామని గత ప్రభుత్వం చెప్పింది. పట్టిసీమ ప్రాజెక్టు పోలవరం కుడి కాల్వ చేసే పనే కదా.. పోలవరం కుడి కాల్వ ద్వారా నీరు ఇస్తే గ్రావిటీ ద్వారా తక్కువ ఖర్చుతో అయిపోతుంది.. పోలవరం ప్రాజెక్టు కూడా తొందరగా పూర్తవుతుందని, పట్టిసీమకు రూ.1600 కోట్లు అధనంగా ఖర్చు చేస్తున్నారు.. ప్రతి సంవత్సరం కరెంట్‌ బిల్లులకు వందల కోట్లు కట్టే అవసరం వస్తుందని అని ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. 

2016 సెప్టెంబర్‌ వరకు బస్సుల్లో పోలవరానికి వెళ్లి పసుపు పచ్చ పూలు చల్లడం తప్ప చేసిందేమీ లేదు. 8–09–2016లో స్పెషల్‌ ప్యాకేజీ తెచ్చుకున్నారు. ఆ ప్యాకేజీలో ఏముందని చూస్తే.. పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నవాటితో పాటు రాష్ట్రానికి సంబంధించి గొప్ప హక్కు ప్రత్యేకహోదాను వదిలేసి వచ్చారు. 

పోలవరం ప్రాజెక్టును తామే కడతామని కేంద్రాన్ని ఒప్పించుకునేదానికి 2014 వరకు ప్రాజెక్టు వ్యయం ఎంత ఉందో.. దానికి పరిమితమై ఒప్పుకొని వచ్చారు. కేంద్రం భరించాల్సిన ప్రాజెక్టును 2014 వ్యయానికి ఒప్పుకొని తామే కడతామని స్పెషల్‌ ప్యాకేజీని తీసుకొచ్చుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో 2014 అంచనా వ్యయం కంటే మించితే ఆ అదనపు ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు. 

చంద్రబాబు చేసుకున్న ఒప్పందం వల్ల 15 మార్చి 2017లో కేంద్ర కేబినెట్‌ ఒక నిర్ణయం తీసుకుంది. 2014 వ్యయం కంటే మించి నిధులు ఇవ్వమని కేంద్రం తేల్చిచెప్పింది. దానికి కూడా చంద్రబాబు అంగీకరించి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇంత దారుణమైన పరిపాలన చేసిన ఈ రోజు పోలవరం ప్రాజెక్టు గురించి కామెంట్లు చేస్తున్నారంటే ప్రజలు గమనించాలి. 

2005–06లో ప్రాజెక్టు వ్యయం రూ.10,151 కోట్లు అయితే ఫస్ట్‌ రివిజన్‌లో 2010–11 సంవత్సరానికి వచ్చే సరికి రూ.16 వేల కోట్ల పైచిలుకు అయితే 2013–14లో రూ.29,027 కోట్లు. 2017–18కి సంబంధించి రూ.55,656 కోట్లకు పెరిగింది. అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు.. 2016లో కేంద్రంతో ఒప్పందం చేసుకునేటప్పుడు భూసేకరణ ఖర్చు, పునరావాసానికి గురయ్యే వారి సంఖ్య పెరుగబోతుంది. 2013–14కు సంబంధించిన కొత్త చట్టం అమల్లోకి వస్తుందని కాబట్టి ఖర్చు పెరుగుతుందని తెలియదా..? 

భూసేకరణ ఖర్చు, పునరావాసం, నిర్మాణం ఖర్చు పెరగబోతుందని 2014లో కేంద్రప్రభుత్వమే గుర్తిస్తే.. 2016 వరకు రెండేళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు  వారికి ఖర్చుల గురించి తెలియదా.. ? దీన్ని అసమర్థత అంటారా..? తెలియని తనమా..? 

2013–14లో తీసుకున్న క్వాంటిటీస్‌ 2010–11 క్వాంటిటీస్‌ లోనివే అని మా ప్రభుత్వం చేసిన పరిశీలనలో తేలింది. ఎన్ని ఎకరాల భూమి, ఎంత మంది పునరావాసం అనే అంశానికి 2005–06 అంకెలను తీసుకున్నారు. ఇలాంటి వారు పోలవరం గురించి మాట్లాడుతున్నారు. 

ప్రాజెక్టు భూసేకరణ 2005–06లో దాదాపు 95,700 ఎకరాలు, 2010–11లో 95,900 ఎకరాలు, 2013–14లో కాపీ, పేస్ట్‌ చేశారు. కానీ, 2017–18 సంవత్సరానికి 1,55,465 ఎకరాలు వచ్చింది. ఇంచుమించు 55,335 ఎకరాలు పెరిగింది. ఇది క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఏయే కాంటూరుకు భూమి మునుగుతుందని తేలడంతో పెరిగింది. 2014లో కేంద్రం గుర్తించినప్పుడు 2017 వరకు చంద్రబాబు ప్రభుత్వానికి ఎందుకు కనిపించలేదు. అమాయకత్వమా, అసమర్థతా..? 

పునరావాసానికి గురయ్యే వారి సంఖ్య.. 2005–06లో 44,500 మంది, 2010–11లో 44,500, 2013–14లో 44,500 ఉంటే.. 2017–18లో దాదాపు లక్ష జనాభా వచ్చారు. దీన్ని వల్ల 20 నుంచి 30 వేల కోట్ల వ్యయం పెరిగే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ గమనించుకోకుండా కేంద్రంతో ఒప్పందం చేసుకున్నారు. 

ప్రాజెక్టు నిర్మాణ వ్యయం, పునరావాస వ్యయం, భూసేకరణ వ్యయం పెరిగినా కేంద్రం భరించదని చెప్పినా చంద్రబాబు ప్రభుత్వం ఒక్క అంశంలో కూడా అభ్యంతరం తెలపలేదు. 2018లో చంద్రబాబు ప్రధానికి లేఖ రాశారు. 1–4–2014 ఏదైతే వ్యయం ఉందో.. దాన్ని సడ్మిట్‌ చేశాం.. 2014లోని వ్యయాన్ని త్వరగా అంగీకరించండి.. దానికి వేడుకుంటున్నా అని లేఖ రాశారు. 2014 వ్యయం కంటే పెరుగుతుందని కేంద్రం చెబితే.. ఏం పర్వాలేదు తగ్గించండి అన్నట్లుగా చంద్రబాబు అంగీకరించారు. చంద్రబాబుది ఆర్భాటం, ఆవేశం, ఆతృతతో కూడిన అసమర్థత. మన ప్రభుత్వానిది సహనంతో కూడిన సమర్థత. 

పోలవరం ప్రాజెక్టు పెండింగ్‌ పనుల అంచనాలను సవరించిన విషయం వాస్తవమేనా..? అయితే అందుకు గల కారణాలు ఏంటీ..? అని 13 మార్చి 2018లో వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలు చీర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, వై. విశ్వేశ్వర్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దానికి సమాధానం.. అవునండీ.. 2013–14 ధరల స్థాయిలో 1–4–2014 నాటికి మిగులు పనుల కోసం సవరించి అంచనాలను రూపొందించి ఆమోదం కోసం సీడబ్ల్యూసీకి సమర్పించాం అని సమాధానం ఇచ్చారు. 

ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తరువాత 2013–14 ధరల స్థాయిలో 1–4–2014 నాటికి సాగునీటి అంశంలోని మిగిలిన వ్యయంలో నూటికి నూరుశాతం సమకూర్చేలా కేంద్రాన్ని ప్రభుత్వం భావిస్తుంది. తగు అనుసారంగా సవరించిన అంచనాలను రూపొందిస్తాం అని సమాధానం ఇచ్చారు. ఇంత ఘోరం జరిగినా కూడా 2018 మార్చిలో కూడా 2014 అంచనాల గురించి ప్రస్తావించారంటే చంద్రబాబు చిత్తశుద్ధి అర్థం చేసుకోండి. 

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు వైయస్‌ జగన్‌ సర్కార్‌ ముందడుగులు వేస్తోంది. ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులను కలిసి 2017–18కి సంబంధించిన వ్యయాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరాం. భూసేకరణ, పునరావాసం చేసేది ఇబ్బంది అని విన్నవించాం. రూ.4 వేల కోట్ల పైచిలుకు రియింబర్స్‌మెంట్‌కు సంబంధించి రూ.2300 కోట్లు ఈ మధ్యనే కేంద్రం అర్థం చేసుకొని విడుదల చేసింది. 

వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏడాదిన్న‌ర పాల‌న‌లో..

గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను తీర్చుతూ.. సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, మేనిఫెస్టోలోని అంశాలను అమలు చేస్తూ, మరో పక్క కోవిడ్‌ను ఎదుర్కొంటూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ముందుకెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకటిన్నర సంవత్సరం పాలనలో ఏం సాధించిందంటే.. ఇండియా టుడే 27 నవంబర్‌ 2020లో ఇచ్చిన రిపోర్టు ప్రకారం.. పెద్ద రాష్ట్రాల్లో బెస్ట్‌ పర్ఫామింగ్‌ స్టేట్స్‌లో 2018లో ఏపీ 10వ స్థానం, 2019లో 8వ స్థానానికి వస్తే.. 2020 సంవత్సరానికి 7వ స్థానానికి వచ్చాం. ఇండియా టు డే ఎండీఆర్‌ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ మోస్ట్‌ ఇంప్రూవ్‌ స్టేట్‌. అన్ని రాష్ట్రాల కంటే ఎకానమీ, టూరిజంలో మనం ఓవరాల్‌గా 2వ స్థానంలో ఉన్నాం. పరిపాలనలో 3వ ర్యాంకులో ఉన్నాం. 

దేశంలో ఆరోగ్య బీమా పొందుతున్న వారి సంఖ్య ఏపీలోనే ఎక్కువ. దేశంలో ఆరోగ్య బీమా 12.9 శాతం గ్రామంలో ఆయుష్‌మాన్‌ భారత్‌ ఉంటే.. ఏపీలో ఆరోగ్యశ్రీ ద్వారా 76.1 శాతం ఉంది. మొత్తం దేశంలో 8.9 శాతం అయితే.. ఏపీలోని పట్టణ ప్రాంతంలో 55.9 శాతం. విద్యుత్‌ రంగ సేవల్లో సంతృప్తి వ్యక్తం చేసిన వినియోగదారుల శాతం చూస్తే.. ఏపీ మూడవ స్థానంలో ఉంది. కరోనా పరీక్షల్లో ఏపీ మొదటి స్థానంలో ఉంది. సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచింది. టీబీ నిర్మూలనలో ఏపీ రెండవ స్థానంలో ఉంది. స్వచ్ఛ భారత్‌లో రాష్ట్రానికి రెండు పురస్కారాలు వచ్చాయి. విద్యుత్‌ పథకంలో దేశానికి ఏపీ ఆదర్శం. గ్రామీణ ఉపాధిలో 10 లక్షల మంది ఉపాధి పొంది నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నాం. వైయస్‌ఆర్‌ జిల్లాకు నదుల పునర్జీవన, జల సంరక్షణ విషయంలో ఉత్తమ పురస్కారం వచ్చింది. 

- మోస్టు పాపులర్‌ సీఎంల జాబితాలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ 3వ స్థానంలో నిలిచారు. 
- పాపులర్‌ సీఎంల జాబితాలో సీఎం వైయస్‌ జగన్‌ 4వ స్థానంలో నిలిచారు. 
- సొంత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ప్రజాదరణలో సీఎం వైయస్‌ జగన్‌ దేశంలో మొదటి స్థానంలో 87 శాతంతో ఉన్నారు. 
- శాంతిభద్రతల్లో చూస్తే ఏపీ క్రైమ్‌ రేట్‌ అన్ని రాష్ట్రాల కంటే తక్కువ. పోలీసులకు 83 అవార్డుల్లో 48 పురస్కారాలు ఏపీ అందుకుంది. రాష్ట్ర ప్రభుత్వం కమిట్‌మెంట్, చిత్తశుద్ధి, పట్టుదలతో పనిచేస్తుంది అని ఇవన్నీ చూస్తే అర్థం అవుతుంది.  

తాజా వీడియోలు

Back to Top