అసెంబ్లీ: చంద్రబాబు హయాంలో విద్యుత్ రంగం నష్టాల్లోకి నెట్టబడిందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. యూనిట్ రూ.2 దొరికే చోట రూ.4.83 పైసలకు కొనుగోలు చేశారని, ప్రజల సొమ్ము 42 మందికి ధారాదత్తం చేసేందుకు 45 రోజుల్లో హుటాహుటిన 42 అగ్రిమెంట్లను కుదుర్చుకున్నారని మండిపడ్డారు. విద్యుత్ కొనుగోళ్లపై ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వం 45 రోజుల్లో దాదాపు 42 అగ్రిమెంట్లలో ఎంటర్ అయ్యారు. ఎందుకంటే మార్చి 31లోపు జనరల్ బేస్ ఇన్సెంటీవ్ అని 50 పైసలు ఒక్కో యూనిట్‌కు ప్రమోటర్‌లకు ఇచ్చేందుకు హడావుడిగా రూ.4.83 పైసలకు కొనుగోలు చేశారు. చంద్రబాబు చర్యతో రాష్ట్రంపై వేల కోట్ల రూపాయలు భారం పడింది. ఆ పరిస్థితుల్లో వాయు విద్యుత్ గురించి రివ్యూ చేశాం. 45 రోజుల్లో ఎంటరైన 42 అగ్రిమెంట్లపై సమీక్షించాం. మామూలుగా విండ్ మిల్లు పెట్టాలంటే సంవత్సరం నుంచి సంవత్సరన్నర పడుతుంది. అలాంటిది 45 రోజుల్లోపే అగ్రిమెంట్‌లోకి.. 45 రోజుల్లోపే విద్యుత్ ఉత్పత్తి కూడా చేసినట్లు, విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల వారికి 50 పైసలు యూనిట్‌కు ఇన్సెంటీవ్ ఇచ్చినట్లు చంద్రబాబు ప్రభుత్వం క్రియేట్ చేసింది. ఇవన్నీ లెక్క చేస్తే రూ.2 వేల కోట్లకు పైగా వ్యత్యాసం వచ్చింది. ప్రజలు కట్టే పన్ను ఆదాయం 42 మందికి ధారాదత్తం చేసేందుకు చంద్రబాబు యత్నించారు. ఇది తప్పు అని చెప్పేందుకే వాయు విద్యుత్‌పై రివ్యూ చేశాం. గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం తప్పు.. రూ.2 కే దొరికే యూనిట్ విద్యుత్‌ను రూ.4.83లకు కొనేందుకు సిద్ధంగాలేమని, రేట్ తగ్గించుకోవాలని విద్యుత్ ఉత్పత్తిదారులను కోరాం. కోర్టు ఆదేశాల మేరకు రూ.2 చిల్లర మాత్రమే ప్రభుత్వం చెల్లింపులు చేస్తోంది. గతంలో 4 వేల మెగావాట్లకు బాబు యూనిట్‌కు సుమారు రూ.7 వరకు అగ్రిమెంట్ చేసుకున్నారు. 4 వేల మెగావాట్లకు మా ప్రభుత్వం యూనిట్‌కు రూ.2 నుంచి రూ.3 వరకు అగ్రిమెంట్ చేసుకుంది. సౌర విద్యుత్‌ను తానే కనిపెట్టినట్టుగా చంద్రబాబు మాట్లాడటం సరికాదు’ అని మంత్రి బుగ్గన వివరించారు.