రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టిన ఘనత చంద్రబాబుది

విత్తనాల పంపిణీపై టీడీపీ శవ రాజకీయాలు చేస్తోంది

ఐదేళ్ల పాలనలో రూ. 3.62 లక్షల కోట్ల అప్పు చేశారు

మేనిఫెస్టోలోని ఒక్క వాగ్దానాన్ని అమలు చేసిన పాపానపోలేదు

అసెంబ్లీలో తెలుగుదేశం సభ్యులపై మంత్రి బుగ్గన ఆగ్రహం

 

అమరావతి: ఐదేళ్ల పాలనలో ప్రజలకు మంచి చేయకపోగా.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టిన ఘనత చంద్రబాబుదని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీలో మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. రాష్ట్ర అప్పు 2.58 లక్షల కోట్లు ఉంది. దీంతో పాటు ఆఫ్‌ బడ్జెట్‌ బారోయింగ్స్‌ రూ. 58 కోట్లు, పవర్‌ సెక్టార్‌కు రూ. 18,375 కోట్ల బకాయి, సివిల్‌ సప్లయ్‌ డిపార్టుమెంట్‌కి రూ. 10 వేల కోట్ల బకాయి, టీడీపీ ప్రభుత్వం దిగిపోయేటప్పటికీ రూ. 18 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టిందన్నారు. చంద్రన్న కానుకల పేరు మీద రూ. వెయ్యి కోట్లు సివిల్‌ సప్లయ్‌కి బాకీ పడ్డారన్నారు. దాన్ని కూడా కట్టాల్సిన బాధ్యత వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వంపై పడిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో మొత్తం రూ. 3.62 లక్షల కోట్లు అప్పు ప్రజల నెత్తిపై రుద్ధిందన్నారు.  

కియా మోటర్స్‌ గురించి తెలుగుదేశం పార్టీ రాద్ధాంతం చేస్తున్నారని, దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి 2007లో ఏపీలో పరిశ్రమ పెట్టాలని కోరితే భారతదేశంలో మొట్టమొదటి సారిగా ఆంధ్రప్రదేశ్‌లో కియా మోటర్స్‌ పెట్టామని ఆ కంపెనీ సీఈఓ లేఖ కూడా రాశారన్నారు. విత్తన కంపెనీలకు గత ప్రభుత్వ బకాయిలు కూడా చెల్లించలేదని, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుమారు రూ. 400 కోట్ల పాత బకాయిలు కూడా కట్టి విత్తనాలు సప్లయ్‌ చేస్తే మూడు రోజులు ఆలస్యమైనందుకు టీడీపీ పెద్ద పెద్దగా మాట్లాడుతుందని, విత్తనాలు తీసుకొని ఇంటికి వెళ్లిన వ్యక్తి చనిపోతే దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తుందన్నారు. దివంగత మహానేత వైయస్‌ఆర్‌ పెట్టిన పథకాలకు చంద్రబాబు ఎన్టీఆర్‌ పేరు పెట్టుకున్నారన్నారు. 2014 ఎన్నికల్లో మేనిఫెస్టో బుక్కు తయారు చేసి 600ల వాగ్దానాలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాపానపోలేదన్నారు. కరకట్ట మీద రోడ్డు వేయడానికి కిలోమీటర్‌కు రూ. 32 కోట్లు కేటాయించి కాంట్రాక్టర్‌లకు దోచిపెట్టారన్నారు. నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేశారు. ఎన్నికల ముందు నిరుద్యోగ భృతికి రూ. వెయ్యి కోట్లు కేటాయించి అందులో రూ. 200 కోట్లు ఖర్చు చేశారన్నారు.

తాజా ఫోటోలు

Back to Top