తాడేపల్లి: మెఘా సంస్థకు ప్రభుత్వ గ్యారంటీ ఆరోపణ ముమ్మాటికీ అబద్ధమని, రుణానికి సంబంధించిన పూర్తి బాధ్యత మెఘా సంస్థదేనని, ప్రభుత్వానికి సంబంధం లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి స్పష్టంచేశారు. టీడీపీ దోపిడీ గురించి మాట్లాడటం గజదొంగే.. దొంగ, దొంగ అని అరిచినట్లుందని ఎద్దేవా చేశారు. టీడీపీ ఆరోపణలను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తిప్పికొట్టారు. ఈ మేరకు ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.. మంత్రి బుగ్గన ఏమన్నారంటే.. ఒక ఫ్రెషర్ చంద్రబాబు నాయుడు కళ్లల్లో పడడం కోసం ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటారు. అర్థంలేని ఆరోపణలతో విమర్శిస్తుంటారు. ఇటీవల కూడా ఆయన అదే చేశారు. మెఘా కంపెనీ ప్రభుత్వ గ్యారంటీతో రూ. 2000 కోట్లు అప్పు తెచ్చుకుందని అర్థం లేకుండా ఆరోపించారు. దోచుకోవడానికే ఇలా చేశారని వితండవాదం చేశారు. గ్యారంటీ లెటర్ అంటే ఏంటో మీకు కనీస అవగాహన లేదు. ఈ విషయం తప్పు కాదనే ఆర్థిక అంశాలలో అవగాహన ఉన్న మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల ఏం మాట్లాడడం లేదు. ఏ పనీ చేయకుండా ఏదో చేస్తున్నామనేలా హైప్ చేసి స్కిల్ డెవలప్ మెంట్ లో రూ.241 కోట్లు దోచుకుందెవరు? రాజధాని అమరావతి పేరుతో వేల కోట్లు సంపాదించిందెవరు? ఇన్నర్ రింగ్ రోడ్డుని మెలికలు తిప్పి అక్రమాలకు పాల్పడిందెవరు? సామాన్య ప్రజలలో వైయస్ఆర్ సీపీ ప్రభుత్వ సంక్షేమ విధానాలు, పరిపాలన మీద ఉన్న అభిమానాన్ని, నమ్మకాన్ని దెబ్బతీయాలనే కుట్రతో ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వ గ్యారంటీ అని మా మీద బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారని ప్రజలకు స్పష్టమవుతుంది. • ప్రైవేటు సంస్థకు ప్రభుత్వ గ్యారంటీ అనేది ముమ్మాటికీ అబద్ధం. • ఇది గవర్నమెంట్ ఇచ్చిన గ్యారంటీ కాదు. మొత్తం బాధ్యత మెఘా సంస్థదే. • ఈ ప్రభుత్వం కేవలం ప్రైవేట్ సంస్థకు బకాయిలు ఎన్ని ఉన్నాయి అని వివరాలు ఇవ్వడం జరిగింది. కుదిరితే వాటిని ఏ సమయంలో చెల్లించడం జరుగుతుందో సూచించడం జరిగింది. • బ్యాంకుకు కట్టవలసిన వడ్డీ ఆ ప్రైవేట్ సంస్థకు సంబంధించిన వ్యక్తిగత వ్యవహారం మాత్రమే. • వడ్డీ, అసలు కట్టే విషయంలో ఎలాంటి ఆలస్యమైనా ప్రభుత్వానికి సంబంధం లేదు. • లోన్ చెల్లింపులకి సంబందించి రీ-కోర్స్ (Re-course) అనేది ముమ్మాటికి ఆ ప్రైవేట్ సంస్థదే. ‘టీడీపీ ఫ్రెషర్’ మరికొన్ని సందేహాలను లేవనెత్తారు. 2024-25 సంవత్సరంలో మేం అధికారంలో ఉండమని ఊహల్లో తేలుతూ ..ఆ వచ్చే ఏడాది బడ్జెట్ లో మెగా కంపెనీ చెల్లింపుల సమయాన్ని ఏ విధంగా వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం అంగీకరిస్తుందని అడిగారు. అందుకే ఫ్రెషర్స్ ని ఆర్థిక పరమైన ప్రాథమిక సిద్ధాంతాల గురించి ముందు తెలుసుకోవాలని మరోమారు మనవి చేస్తున్నా. ఈ సందేహాలకు సమాధానం ఏంటంటే, ప్రభుత్వాలు ప్రస్తుత కాలంలో అప్పు తీసుకుని ఏ విధంగా అయితే భవిష్యత్ లో వడ్డీ కట్టవలసి వస్తుంది. ఈ విషయంలో వడ్డీ కూడా మెగా సంస్థే చెల్లిస్తుంది. ‘మెఘా’తో పాటు చాలా సంస్థలకు ఇలాగే ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిందని మరో ఆరోపణ కూడా లేవనెత్తారు. అదంతా ఆయన అభూత కల్పన మాత్రమే. ఈ విధంగా మా ప్రభుత్వం మెగా సంస్థకు ఇచ్చిన పర్మిషన్ గవర్నమెంట్ గ్యారంటీ కాదు. బ్యాంక్ లు ఆ ప్రైవేట్ సంస్థ యొక్క విశ్వసనీయత ఆధారంగానే లోన్ లు ఇస్తున్నారు. ఈ ప్రభుత్వం కేవలం ప్రైవేట్ సంస్థకు బకాయిలు ఎన్ని ఉన్నాయి అని వివరాలు ఇవ్వడం జరిగింది. కుదిరితే వాటిని ఏ సమయంలో చెల్లించడం జరుగుతుందో సూచించడం జరిగింది. మెఘా సంస్థ కు ఇచ్చింది ప్రభుత్వ గ్యారంటీ కానే కాదు. ఈ ఒక్క అనుమతి కూడా రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న పెద్ద పెద్ద నీటి పారుదల ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఇచ్చినది. అందులోనూ పోలవరం నిర్మాణాన్ని అతి త్వరగా పూర్తి చేయడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. గత టిడిపి ప్రభుత్వంలో చంద్రబాబు పోలవరంపై చేసిన తప్పులే ప్రస్తుత పరిస్థితులకు కారణం. ఆ తప్పులను సరిదిద్దుకుంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడానికి ఇంకా సమయం పడుతుందనే నేపథ్యంలో మెఘా కంపెనీ వారి ప్రతిపాదనకు స్పందించాం. మా ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీ కాబట్టే మీరు అర్థం లేని ఆరోపణలు చేసినా వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు తెలియాలనే సవినయంగా వివరణ ఇస్తున్నాం. మీరు పెట్టిపోయిన బకాయిలను కట్టిన మాపై అర్థం లేని విమర్శలా? ఆరోగ్య శ్రీ బిల్లులకు గ్యారంటీ ఇవ్వరా అని అడుగుతున్నారు. టిడిపి పాలనలో ఆరోగ్య శ్రీ కింద 1,059 జబ్బులు ఉన్నప్పుడు రూ.800 కోట్లు పై చిలుకు చివరి 8 నెలల నుండి పెండింగ్ లో పెట్టినప్పుడు మీ చంద్రబాబు నాయుడు గ్యారంటీ ఇచ్చారా ? వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం వచ్చాక మీరు పెట్టిన బకాయిలను చెల్లించి డాక్టర్ వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ సామర్థ్యం పెంచి 3,257 (ఈ ప్రభుత్వంలో 2,198 అదనంగా చేర్చడం జరిగింది) జబ్బులకు విస్తరించి సరిహద్దు రాష్ట్రాలలోని 204 హాస్పిటళ్లలో కూడా ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగిస్తూ పేద ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తున్నాం. టీడీపీ హయాంలో ఉన్న 919 హాస్పిటల్ ల సంఖ్యను మా ప్రభుత్వం వచ్చాక 2,306 ఆస్పత్రులకు పెంచడం జరిగింది. ఇంకా మరో 40 కొత్త ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ జాబితాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయి. మీరన్నట్లు మా ప్రభుత్వం పెండింగ్ బకాయిలు చెల్లించని నేపథ్యంలో కొత్తగా ఇంత మంది ఎందుకు ముందుకు వస్తారు?. అంటే మీరు చెప్పేది అబద్ధం అని సామాన్యులకు సైతం ఇట్టే అర్థమవడం లేదా? టీడీపీ ఐదేళ్లకాలంలో రూ.5,177 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిన మీరా నాలుగున్నరేళ్లలోనే రూ.9,514.84 కోట్లు ఆరోగ్యశ్రీకి వెచ్చించిన మా ప్రభుత్వాన్ని ఆరోగ్యశ్రీపై ప్రశ్నించేది? మా హయాంలో కేవలం అక్టోబర్ నెల పెండింగ్ బిల్లులు మాత్రమే చెల్లించవలసి ఉంది. వాటిని కూడా ప్రయారిటీ పద్ధతిలో త్వరలోనే చెల్లిస్తాం. టిడిపి ప్రభుత్వం 2019లో దిగిపోయే నాటికి రూ.40000 కోట్లు పెండింగ్ పెడితే..ఆ తర్వాత వచ్చిన మా వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించింది నిజం కాదా? 2019లో టిడిపి ప్రభుత్వం ఆరోజు రూ.40000 కోట్లు పెండింగ్ బిల్లులకి కూడా గ్యారంటీ అడిగారా? ట్యాంకర్లతో అందించిన వాటర్ బిల్లులకు గ్యారంటీ ఏది అని ప్రశ్నించారు. గత టిడిపి ప్రభుత్వం 2019 లో దిగిపోతూ రూ.80 కోట్లు బకాయిలు పెడితే ప్రస్తుత వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం రాగానే చెల్లించింది. ఇప్పుడు మళ్ళీ పర్మిషన్ లేకుండా ట్యాంకర్ బిల్లులు అని వస్తే వాటిని ఎస్డీఆర్ఎఫ్ ద్వారా టై-అప్ చేసి పేమెంట్ చేసే పారదర్శక విధానం కోసం కసరత్తు చేస్తున్నాం.