అమరావతి: 2019 ఎన్నికలకు ముందు రాయలసీమ స్టీల్ ప్లాంట్‌కు చంద్రబాబు శంకుస్థాపన చేశారని, అది టీడీపీ చిత్తశుద్ధి అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. రెండో అసెంబ్లీ సమావేశాల్లో కడప స్టీల్ ప్లాంట్ పై టీడీపీ సభ్యులు బాలవీరాంజనేయులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. స్టీల్ ప్లాంట్‌కు 480 ఎకరాల భూమికి గాను ముఫై ఏడు కోట్ల పద్ధెనిమిది లక్షల అరవై ఏడు వేలు కాంపన్సేషన్ ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం కోట్ చేస్తూ కడప స్టీల్ ప్లాంట్ ఇంకా ఎందుకు పూర్తి కాలేదు అని అడుగుతున్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లు కోవిడ్ పరిస్థితులు ఉన్నాయి. కోవిడ్ పరిస్థితుల వల్ల ప్రపంచ వ్యాప్తంగా స్టీల్ పరిశ్రమ తగ్గుముఖంలో ఉంది. ఆ పరిస్థితుల్లో కూడా జాయింట్ వెంచర్ పార్టనర్ ను వెతకడం జరిగింది. దీంతో పాటు రూ.250 కోట్లు స్టీల్ ప్లాంట్ కోసం బడ్జెట్ లో కేటాయించింది వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. 2015-16లో రాయలసీమ స్టీల్ ప్లాంట్ అని చెప్పి టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం చంద్రబాబు స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసి వదిలేశారు.