పెట్రో, గ్యాస్ ధరల పెంపునకు రాష్ట్రానికి సంబంధం ఏమిటి..?

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి  బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి  

తన మానసిక పరిస్థితిపై బాబు సమాధానం చెప్పాలి

 సమానత్వం, సామాజిక న్యాయం, సంక్షేమమే పునాదిగా జగన్ గారి పరిపాలన

 ఆర్థిక ఇబ్బందులున్నా డీబీటీ ద్వారా 1.6 లక్షల కోట్లు.. 7.22 కోట్ల ప్రయోజనాలు

  టీడీపీ హయాంలో 20 శాతం అప్పులు చేస్తే.. మా హయాంలో 15 శాతమే...

 గుంటూరు: పెట్రో, గ్యాస్ ధరల పెంపునకు రాష్ట్రానికి సంబంధం ఏమిట‌ని  రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి  బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి  ప్ర‌శ్నించారు.  వైయస్సార్‌ సీపీకి స్పూర్తి ప్రధాత, ప్రజా సంక్షేమ పథకాలకు ఆధ్యుడు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిగారికి వినమ్రతతో నివాళులు అర్పిస్తున్నాం.  నవరత్నాలు అమలు చేయడానికి ప్రభుత్వం, ముఖ్యమంత్రిగారు ఆర్థికంగా ఎన్నిరకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, ప్రతిపక్షాలు ఎన్నిరకాలుగా విమర్శలు, అనరాని మాటలు అంటున్నా, ప్రతిపక్షం నుంచి విపరీతమైన దాడికి గురైంది ఏదైనా ఉందంటే అది ఆర్థిక శాఖ. ఆర్థిక శాఖ విధివిధానాలు నిర్వహించేటప్పుడూ ఈ మూడేళ్లు ఏవిధంగా కొనసాగిందనేది తెలియచేయాల్సిన బాధ్యత ఉండటంతో ఆ విషయాలు 
మీముందు ఉంచుతున్నాం.  2019లో మా ప్రభుత్వం ఏర్పాటు అయినప్పుడు, చరిత్రలో ఎక్కడలేని విధంగా వేలాది కోట్ల అప్పులు, ఇంచుమించు 40వేల కోట్ల రూపాయిల కట్టవల్సిన 
బకాయిలు. 20 నుంచి 30వేల కోట్ల వరకూ ఇతర కార్పొరేషన్ల నుంచి తీసుకున్న అప్పులు ఉన్నాయి. వైయస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేతులు కట్టేసినట్లు పరిస్థితి ఉంది.

 ఏడాదిపాటు ముఖ్యమంత్రిగారు ఇచ్చిన వాగ్దానాలు, నవరత్నాల అమలు చేస్తుండగా, అంతలో కోవిడ్‌ రావడం... ఆ తర్వాత రెండేళ్లు ఎన్నిరకాలుగా ప్రభుత్వం 
ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చిందో చూశారు.  కరోనా వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగారు ప్రజలకు ధైర్యం ఇచ్చి,  పరిపాలనలో ఏ ఒక్క విషయంలోనూ వెనకడుగు వేయకూడదని, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, సామాన్య మానవుడిని కాపాడుకుంటూ అతడికి భరోసా ఇవ్వడమే ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగారు. రాబోయే రోజుల్లో కూడా 
కరోనాతో సహజీవనం చేయాల్సి వస్తుందంటే ప్రతిపక్ష నేత చంద్రబాబుతో పాటు టీడీపీ నాయకులు ఎన్నిరకాలుగా వ్యంగ్యంగా మాట్లాడారో తెలిసిందే.  ఈ మూడేళ్లలో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా నవరత్నాల అమల్లో భాగంగా లబ్దిదారులకు డీబీటీ ద్వారా ఒక లక్షా 60వేల కోట్లు... 7కోట్ల 22 లక్షల 50 వేల ప్రయోజనాలను ప్రజలకు ఇవ్వడం జరిగిందని గర్వంగా చెబుతున్నాం. అలాగే నాన్‌ డీబీటీ కింద దాదాపు 39 వేల కోట్లను... 2కోట్ల 51 లక్షల 24 వేల ప్రయోజనాలను ప్రజలకు ఇవ్వడం జరిగింది.

 ప్రతిపక్షం మాత్రం అభివృద్ధి అంటే ఇదేనా అని విమర్శలు చేస్తోంది. సామాన్య మానవుడిని కాపాడుకోవడమే మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు బాధ్యతగా పనిచేశారు. ధన, మాన, ప్రాణ, రక్షణే ప్రభుత్వం ప్రధాన బాధ్యత అని మనం చెబుతుంటే ... వాళ్లు మాత్రం ఇదేనా అభివృద్ధి అంటూ విమర్శలు చేశారు. చాలాసార్లు మా మీద కూడా విమర్శలు చేశారు.  కరోనా వచ్చినప్పుడు ప్రభుత్వ పాలనకు సంబంధించి డబ్బులు కావల్సి వస్తే నేను ఢిల్లీకి పర్యటిస్తున్నప్పుడు ప్రతిపక్షం వ్యంగ్యంగా విమర్శలు చేయడం తెలిసిందే. కరోనా సమయంలో సుమారు ఏడాదిన్నరపాటు ఎయిర్‌పోర్టులు, విమానాలు ఖాళీ. కరోనాతో ఎవరూ కూడా విమాన ప్రయాణం చేయడానికి సాహసించని సమయంలో ముఖ్యమంత్రిగారి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ, సంబంధిత విభాగం అధికారులు ధైర్యంగా ఢిల్లీకి వెళ్లి నిధులు తేవడం జరిగింది.  జీఎస్టీ కౌన్సిల్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సరిగ్గా మాట్లాడలేదని మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల విమర్శలు చేస్తున్నారు. 35వ జీఎస్టీ కౌన్సిల్‌ మీటింగ్‌ గోవాలో జరిగితే చిత్తూరుకు సంబంధించి చింతపండుపై పన్ను ఉంటే దాన్ని ఎత్తివేయాలని కోరడం జరిగింది. 35 మీటింగ్‌లలో భారతదేశంలో 
మొట్టమొదటగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమే మాట్లాడిందని సగర్వంగా చెప్పగలం. అలాగే నాపరాళ్లు, మామిడిపళ్ల గుజ్జుపై పన్ను ఎత్తివేసే విషయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తీసుకున్న నిర్ణయాలపట్ల భారతదేశానికి అంతా మేలు జరిగింది.
-చంద్రబాబు అధికారంలో ఉండి ఉంటే అసలు కరోనా, హుద్‌హుద్‌ వచ్చేదా.. అని మాట్లాడటం హాస్యాస్పదం. ఆయన మినీ మహానాడులో చెప్పే మాటలు వింటే... తమ్ముళ్లు నేను మెంటల్‌గా బాగున్నానని అంటాడు. ఆయన నిజంగా మెంటల్‌గా బాగున్నాడా అని నేను సూటిగా అడుతున్నా. అలా అడుగుతుంటే దాన్ని ఏమనుకోవాలి?

 వైయస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచే టీడీపీ విమర్శల దాడికి దిగింది. ఖజానా ఖాళీ అయిపోయింది, ఖజానా మేము ఖాళీ చేసి, 100 కోట్లు మాత్రమే మిగిల్చాం.. సంక్షేమ 
పథకాలు అమలు విషయంలో ముందుంది మొసళ్ల పండుగ, ఎన్నిరోజులు ఈ పథకాలు అమలు చేయగలుగుతారంటూ దౌర్భాగ్యంగా టీడీపీ మాట్లాడిన మాటలు కూడా గుర్తు చేస్తున్నాం. ప్రతిపక్షం కానీ, చంద్రబాబుకు సూటిగా ప్రశ్నిస్తున్నా. మేము చేసే అభివృద్ధి, పరిపాలన సబబుగా లేదంటే మీరు ధైర్యంగా ముందుకు వచ్చి అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, నాడు-నేడు వద్దని చెప్పగలరా?. టీడీపీ హయాంలో చేయలేని పరిపాలన ఇప్పుడు జరుగుతోంటే కడుపు మంటతో ఓర్వలేక ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ శ్రీలంకతో పోలికా? ఏమైనా అర్థం ఉందా? రాష్ట్రానికి, దేశానికి తేడా తెలియకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని శ్రీలంకతో పోల్చడం దురదృష్టకరం.

  కులం, మతం, ప్రాంతం చూడం. చివరకు పార్టీ కూడా చూడకుండా అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం నుంచి అందవల్సినవి అమలు పరుస్తున్నాం. ఈ అమల్లో కూడా అభివృద్ధి లేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.  విద్య కోసం నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మొదటి ఫేజ్‌లో దాదాపు రూ.3007 కోట్లు, రెండో ఫేజ్‌లో 8000కోట్లు 
ఖర్చు పెట్టాం. ఆరోగ్యానికి సంబంధించి నాడు-నేడులో ఇప్పటివరకూ ఇంచుమించుగా 16,200 కోట్లు ఖర్చు చేశాం. 

  అప్పుల విషయానికి వస్తే... 2019లో గత టీడీపీ ప్రభుత్వం మనకు ఆనవాయితీగా ఇచ్చిన అప్పు 3లక్షల 25వేల కోట్లు అయితే ఇప్పుడు అది 4లక్షల 90వేల కోట్లుగా వచ్చింది. అదే 2014లో చంద్రబాబు హయాంలో ఒక లక్షా 35వేల కోట్లు అయితే దాన్ని 3లక్షల 25వేల కోట్లు అప్పు చేశారు. అది కలిపితే సగటుగా 19.5 అంటే దాదాపు 20శాతం వాళ్లు అప్పు చేస్తే... మా ప్రభుత్వం కేవలం 15శాతం మాత్రమే అప్పు చేయడం జరిగింది.  పెండింగ్‌ బిల్లులకు వస్తే... టీడీపీ సర్కార్‌ హయాంలో విద్యుత్‌ సంస్థలకు 69వేల కోట్లు అప్పు చేసింది. 2019లో 40వేల కోట్ల పెండింగ్‌ బకాయిలు, 20 నుంచి 30 వేల కోట్ల మేరకు కార్పొరేషన్‌ అప్పులు,  అలాగే ఒకే ఒకరోజు ఏప్రిల్ ‌9న 5వేల కోట్లు అప్పు చేసింది.

  పన్నులు విషయానికి వస్తే... పెట్రోల్‌, డిజీల్‌ ధరలు పెరిగాయి. ఆ ధరలు కూడా మనవల్లే పెరిగాయా... దేశంలో ఎక్కడా ఇంధన ధరలు పెరగలేదా?. గ్యాస్‌ ధరలు, నిత్యావసర వస్తువుల పెరుగుదలకు వస్తే కేంద్రం తీసుకున్న నిర్ణయాలే కానీ రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదు.  కరెంట్‌ మీటర్ల మీద కూడా టీడీపీ దుష్ప్రచారం చేసింది. విద్యుత్‌ సరఫరా చేసే సంస్థలకు మీటర్లు లేనప్పుడు ఎంత విద్యుత్‌ సరఫరా అవుతుందో తెలియక ఏడాదికి 10వేల కోట్లు కట్టడం కరెక్టా.. కాదా అని తెలుసుకునేందుకు మీటర్ల ఏర్పాటు జరుగుతుందే తప్ప ఏ ఒక్కరి మీద ఏ పన్ను మోపాలనే ఉద్దేశం మా ప్రభుత్వానికి లేదు. ఆ మీటర్ల ద్వారా వచ్చే సబ్సిడీ రైతులకు వస్తుందే తప్ప ఏ ఒక్కరిపైనా పన్ను మోపాలనే ఉద్దేశం లేదు. అది టీడీపీ అసత్య ప్రచారం మాత్రమే.

 సామాన్య మానవుడిని, మహిళల జీవితాలను కాపాడుకునేందుకే మద్యం రేట్లు పెంచాల్సి వచ్చింది. తెలంగాణ, కర్ణాటకతో పోల్చుకుంటే మత్తు పానీయల రేటు మనది తక్కువా? ఎక్కువా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మద్యంపై టీడీపీకి మాట్లాడే అర్హత లేదు. అమరావతి రాజధాని అంటూ మాట్లాడే తెలుగుదేశం పార్టీ హయాంలో అయిదేళ్ల కాలంలో చేసిన ఖర్చు ఎంత అంటే 17 వేల కోట్లు.  అందులో 15వేల కోట్లు కేంద్ర నిధులు. కేవలం 2వేలకోట్లు మాత్రమే టీడీపీ సర్కార్‌ ఖర్చు పెట్టి ఇవాళ రాజధాని గురించి మాట్లాడటం సిగ్గుచేటు.
- టీడీపీ హయాంలో ఆరోగ్యశ్రీ, మధ్నాహ్న భోజన పథకం ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆశా వర్కర్స్‌, చివరకు  కోడిగుడ్లకు కూడా బిల్లుల పెండింగ్‌ పెట్టి వెళ్లారు. కోవిడ్‌ కారణంగా కొన్ని బిల్లుల చెల్లింపులు పెండింగ్‌ పడ్డాయి.
- ముఖ్యమంత్రిగారి ఆదేశాల మేరకు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ బిల్లులు దాదాపు అన్ని చెల్లించాం. త్వరలో మిగతా బకాయిలు కూడా చెల్లిస్తామని ప్రభుత్వం తరపున చెబుతున్నాం. 2014-19 కాలంలో 27వేల 3వందల 40 కోట్ల మేరకు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పనులు చేస్తే.. అదే మన ప్రభుత్వం మూడేళ్లలోనే 27వేల 500 కోట్లు మేరకు, మూడేళ్ళలోనే వాళ్లకన్నా ఎక్కువ పనులు చేశాం.
- గ్రామ సడక్‌ యోజన పథకం కింద టీడీపీ సర్కార్‌ అయిదేళ్లలో 13వందల 63 కోట్లు ఖర్చు పెడితే మన ప్రభుత్వం మూడేళ్లలోనే 13వందల 21కోట్లు ఖర్చు పెట్టాం. గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధుల్లో కొంతమేరకు కరెంట్‌ బిల్లులు కట్టిన మాట వాస్తవమే. గ్రామ పంచాయతీ నిధులు కూడా పంచాయతీలకే వచ్చేస్తున్నాయి.

 టీడీపీకి మన ప్రభుత్వానికి పోలికా...  మన ప్రభుత్వానికి సమానత్వం, సమాన అవకాశాలు, సామాజిక న్యాయం, సంక్షేమం పునాది అయితే... అదే టీడీపీకి అసత్యం, అబద్ధాలు, వెన్నుపోటు, ఫిల్మ్‌ ఫీల్డ్‌ పునాది.  బీసీలు అంటే బ్యాక్‌ వర్డ్‌ క్లాస్‌ కాదు బ్యాక్‌ బోన్‌ క్లాస్‌ అంటూ పథకాలు అమలు చేసి చూపిస్తున్న ఘనత ముఖ్యమంత్రిగారిది. టీడీపీ వర్గాలు, కులాలను వేరు చేసి అన్యాయమైన రాజకీయం చేయడానికి పూనుకుంటోంది.

 అభివృద్ధి గురించి టీడీపీ వాళ్లు మాట్లాడటమా? ముఖ్యమంత్రిగారు ఢిల్లీకి వెళ్లినప్పుడు ఏం మాట్లాడరంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియా టీవీలు కథనాలు వేస్తున్నాయి. ఆయన ఏంమాట్లాడారో నేను చెబుతాను. పోలవరం ప్రాజెక్ట్‌ను టీడీపీ ప్రభుత్వం చెడగొడితే.. దాన్ని మళ్లీ కట్టడానికి ప్రధానమంత్రితో మాట్లాడారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాల కోసం ఒకసారి కాదు, పదిసార్లు ప్రధానితో మాట్లాడతారు. పోలవరం ప్రాజెక్ట్‌ను కేవలం చంద్రబాబు ఏటీఎంగా చూడటంతో పనులు ఆగిపోతే మన ప్రభుత్వం వచ్చాక పనులు వేగవంతం అయ్యాయి.
- నాడు-నేడు కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల మౌలిక సదుపాయాల కల్పనను మెరుగు పరచడం అభివృద్ధి కాదా? పరిశ్రమల గురించి మాట్లాడితే ... టీడీపీ అయిదేళ్ల పాలన కంటే, మన పాలనలో పెద్ద పరిశ్రమల్లో సంవత్సరానికి సగటున రెండువేల కోట్లు ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి. 
- ఎగుమతుల్లో ఏడో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మన ముఖ్యమంత్రిగారి పాలనలో అది మూడో స్థానంలోకి రావడం గర్వకారణంగా ఉంది.
- ఎన్నికల ముందు యువనేస్తం పేరుతో టీడీపీ సర్కార్‌ వెయ్యికోట్లు కేటాయిస్తే కేవలం రెండువందల కోట్లు ఖర్చు పెట్టి యువకులందరికీ చెవిలో పువ్వు పెట్టింది.
- టీడీపీ హయాంలో కాపుల సంక్షేమానికి అయిదేళ్లకు 3,100వేల కోట్లు చూపించి, ఖర్చు పెట్టింది కేవలం 2వేల కోట్లు మాత్రమే. అలాంటిది వాళ్లు ఇవాళ కాపుల సంక్షేమం గురించి మాట్లాడటమా?

 జన్మభూమి కమిటీలకు, వాలంటీర్లకు ఉన్న ప్రధానమైన తేడా ఏంటంటే... అక్కడ జన్మభూమి కమిటీలో తమవారిని మాత్రమే లబ్ధిదారులుగా వాడుకుంటే... ఇక్కడ 
అర్హత ఉన్నప్రతి లబ్ధిదారుడి కోసం వాలంటీర్లు పనిచేస్తున్నారు.
-  చంద్రబాబు ఆదేశాలు ఇస్తే అమరావతిలో భూగర్భ జలాలు పెరుగుతాయా? రెయిన్‌ గన్‌లు పట్టుకుని వర్షం కురిపిస్తారట, ఆయన అధికారంలో ఉంటే కరోనా, హుద్‌హుద్‌ తుఫాన్‌ రాదట. చంద్రబాబు, దుష్టచతుష్టయం తోడుండి ప్రజలకు మాయమాటలు చెబుతున్నారు.
- టీడీపీ హయాంలో వనం-మనం, నీరు-చెట్టు దోపిడీ కాదా?. మా ప్రభుత్వంలో అర్హత ఉన్న ప్రతి లబ్దిదారుడికి సాయం అందిస్తుంటే అది అభివృద్ధి కాదంటారు. టీడీపీ వాళ్లు చెప్పే 
మాయమాటలు, అసత్యాలను సామాన్య ప్రజలు నమ్మకుండా ఉండేలా, చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వం గురించి, కష్టకాలంలో కూడా వెనకడుగు వేయకుండా ధైర్యాన్ని ఇస్తున్న ముఖ్యమంత్రిగారు తన పరిపాలనతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. 

తాజా వీడియోలు

Back to Top