3 ప్రాంతాలు.. 3 రాజధానులు.. సమ్మిళిత అభివృద్ధి 

ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి

పరిపాలన వికేంద్రీకరణ, 13 జిల్లాల సమ్మిళిత అభివృద్ధి కోసం ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా కొన్ని కీలక మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అసెంబ్లీలో పేర్కొన్నారు. కొన్ని జిల్లాలతో ప్రత్యేక జోన్లుగా జోనల్ డెవలప్మెంట్ బోర్డులను  ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆయా బోర్డులకు ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తుంది. అమరావతి మెట్రో పాలిటన్ రీజియన్ ద్వారా లెజిస్లేటివ్ కార్యక్రమాలన్నీ నిర్వహించేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరుగుతుంది. లెజిస్టేటివ్ కేపిటల్గా అమరావతి కొనసాగుతుంది. ఎగ్జిక్యూటివ్ కార్యక్రమాలన్నీ విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ ద్వారా నిర్వహించబడతాయని బిల్లుకు సంబంధించిన వివరాలను ఆయన సభ ముందు ఉంచారు. 
జ్యుడిషియరీ కార్యక్రమాలన్నీ కర్నూలు నుంచి కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ ద్వారా కొనసాగుతాయి. లెజిస్టేటివ్ కేపిటల్గా అమరావతి, రాజ్భవన్, సెక్రటేరియట్, ఇతర కార్యాలయాలు విశాఖలో కొనసాగుతాయి. న్యాయ శాఖకు సంబంధించిన అన్ని కార్యాలయాలు, కార్యక్రమాలు కర్నూలులో కొనసాగుతాయి. హైకోర్టు ఛీఫ్ జస్టిస్ కూడా కర్నూలు నుంచే పనిచేస్తారు. 
వికేంద్రీకరణ ప్రాచీన కాలం నుంచీ ఉన్నదే…
ప్రాచీన కాలం నుంచే పరిపాలనా వికేంద్రీకరణ విధానం కొనసాగుతూ వస్తోంది. ఎక్కడ వసూలైన పన్నులు ఆ ప్రాంతాల అభివృద్ధికే ఖర్చు చేయాలి. కొన్ని దశాబ్ధాలపాటు  మనం బ్రిటీష్ పాలనలో ఉన్నాం. ఆ రోజుల్లో ఇక్కడ వసూలైన పన్నులను వారి ఆడంబరాలకు ఖర్చు చేసుకున్నారు. లండన్కు తరలించుకుపోయారు. ప్రజలు కోరుకునేది అందించగలిగినప్పుడే అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది. 
శ్రీభాగ్ ఒప్పందం ప్రాతిపదికగా.. 
స్వాతంత్ర్యం రాక ముందు నుంచే రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో సమానత్వం కోసం నిరంతరం ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. 1910లో తొలిసారిగా మనమే మన ప్రాంతాన్ని పాలించుకోవాలన్న ఉద్యమం మొదలైంది. 1912లో ఆంధ్రమహాసభలు ఏర్పాటయ్యాయి. తెలుగు భాష ప్రాతిపదికన తెలుగు వాళ్లందరం ఒక్కటయ్యాం. తొలి భాషా ప్రయోక్త రాష్ట్రంగా ఆంధ్రరాష్ట్రం ఏర్పాటైంది. 1934లో రాయలసీమ మహాసభ ఏర్పాటైంది. అన్ని ప్రాంతాలను కలుపుకుపోవాలనే పెద్దమనుషుల సూచనతో 16 నవంబర్, 1937న ఆంధ్రపత్రిక సంపాదకుడు శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు అధ్యక్షతన చారిత్రాత్మక శ్రీభాగ్ ఒడంబడిక జరిగింది. రాయలసీమ ప్రాంత కరువును ప్రముఖంగా ప్రస్తావించారు. సాగునీటి ప్రాజెక్టులు ఆ ప్రాంతానికి మేలు జరిగేలా ఉండాలని తీర్మానం చేయడం జరిగింది. అధికార వికేంద్రీకరణ జరగాలని ఆనాడే పెద్దమనుషులు తీర్మానం చేశారు. ప్రాంతీయ విద్యేషాలు తలెత్తకుండా విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ఏ ప్రాంతానికి ఎలా న్యాయం చేయాలనేది జెంటిల్మెన్ ఒప్పందంలో స్పష్టంగా రాసుకున్నారు. కానీ అన్ని ప్రాంతాలను గడిచిన వందేళ్లుగా కలిపి ఉంచుతున్న గొప్ప బంధం తెలుగు భాష ఒక్కటే. 
శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పిందంటే…
ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి శివరామకృష్ణన్ కమిటీని ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. ఎలాంటి సమస్యలు రాకుండా రాజధాని ఏర్పాటు చేయడానికి ఏ ప్రాంతమైతే బాగుంటుందో సూచించమని కేంద్రం ఆనాడు శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేసింది. దాని ప్రకారమే 13 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేయాలని కమిటీ కేంద్రానికి సూచించింది. ఒక్క నగరాన్ని అభివృద్ధికి ప్రోత్సహించవద్దని కమిటీ సూచించింది. పంటలు పండే భూములను నాశనం చేయవద్దని, రియల్ వ్యాపారాలకు ఆస్కారం ఇవ్వకూడదని పేర్కొంది. అమరావతిలో భారీ కట్టడాలకు ఆస్కారం ఇవ్వకూడదని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వివరించింది. దీంతోపాటు మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ది చేయాలని సూచించింది. తెలంగాణ లాంటి ప్రాంతీయ అసమానతలు పునరావృతం కాకుండా ఉండాలంటే అదికార వికేంద్రీకరణ చేయాలని ప్రత్యేకంగా వివవరించింది. వ్యవసాయంలో గణనీయంగా ఆదాయం ఆర్జిస్తున్న ప్రాంతాన్ని రియల్ వ్యాపారులకు వనరులుగా మార్చకూడదని చెప్పారు.  
దోచుకోవడానికే నారాయణ కమిటీ… 
కేంద్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఫజల్ అలీ కమిటీ, రవీంద్రన్ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీల కన్నా గొప్పగా ఉండాలని మున్సిపల్ మంత్రి నారాయణ అధ్యక్షతన నారాయణ కమిటీని చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టును కనీసం చదవకుండా.. అందుకు విరుద్టంగా ఏదో నిగూడమైన స్వార్థంతో రాజధాని నిర్మాణానికి వెళ్లి ఉంటారని ఇన్సైడర్ ట్రేడింగ్ చూస్తే స్ఫష్టమవుతుంది. రెండు మూడు శతాబ్దాలు గడిచినా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేలా రాజధాని ఏర్పాటు చేసుకోవాలి. కానీ చంద్రబాబు మాత్రం శివరామకృష్ణన్ కమిటీని కనీసం పరిశీలనకు తీసుకోలేదు. తనకు అప్పగించిన రాజధాని నిర్మాన బాధ్యత కోసం క్యాన్సర్తో బాధపడుతూనే 11 జిల్లాల్లో పర్యటించిన శివరామకృష్నన్కు కనీస గౌరవం ఇవ్వకుండా చంద్రబాబు అవనమానించారు. ఆయన రిపోర్టును పరిశీలించకుండా సమాంతరంగా నారాయణ కమిటీని ఏర్పాటు చేసి తిప్పడం స్వార్థపూరితమేనని అర్థమవుతుంది. 
దక్షిణ భారత దేశంలో వెనకబడి ఉన్నాం…
ఆదాయం తక్కువ, ఎక్కువ అప్పులతో ఉన్నామని బోస్టన్ కన్సెల్టింగ్ గ్రూప్ లెక్కలతో సహా నివేదిక ఇచ్చింది. పర్ కేపిటా జీఎస్డీపీ చూస్తే కర్నాటక, కేరళ, తెలంగాణ రూ. 2 లక్షలు, తమిళనాడు రూ. 1.9లక్షల ఆదాయంతో ఉంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం కేవలం రూ. 1.6 లక్షల దగ్గరే ఉంది. జిల్లాల వారీగా పర్ కేపిటా చూస్తే శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం వెనకబడి ఉన్నాయి. వ్యవసాయంలో చూస్తే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కడప, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం ఉన్నాయి. చదువుల్లో విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు, అనంతపురం, ప్రకాశం జిల్లాలు వరుసగా వెనకబడి ఉన్నాయి. చంద్రబాబు చెబుతున్న గ్రాఫిక్స్ అమరావతి నగరం కట్టాలంటే ప్రతి పదివేల మందికి కనీసం 30 వేల కోట్లు అవసరమని రిపోర్టు చెబుతోంది. గడిచిన 50 ఏళ్లలో కట్టిన నగరాలు చూసుకుంటే జరిగిన అభివృద్ధి శూన్యం. అర మీటరు నీరొస్తే ఇప్పుడున్న అమరావతి రాజధానిలో 70 శాతం మునిగిపోయే ప్రమాదం ఉందని ఐఐటీ మద్రాస్ రిపోర్టులో పేర్కొంది. బీసీజీ రిపోర్టు ప్రకారం చూస్తే ఏడాదికి లక్ష మంది పెరుగుతారని అంచనా. సాయిల్ బేరింగ్ కెపాసిటీ చూస్తే హైదరాబాదు, చెన్నై, బెంగళూరు కన్నా అమరావతి చాలా తక్కువగా ఉంది. రాజధానికి ఎంతమంది ఏయే పనుల మీద వస్తున్నారో పరిశీలిస్తే 52శాతం మంది జిల్లాల్లో పనులు కావడం లేదని, 20 శాతం మంది రికమెండీషన్ల కోసం, 25 శాతం మంది రిలీఫ్ ఫండ్ల కోసం వస్తున్నారని తేలింది. ప్రజలకు అలాంటి సమస్యలు ఇకపై రాకుండా వారి సమస్యలు జిల్లా స్థాయిలోనే పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంట్ంది. దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంతో చూసకున్నా మనం వెనకబడి ఉన్నాము. గడిచిన ఐదేళ్లలో వ్యవసాయం మీద ఆధారపడి బతకడం పెరిగిందే తప్ప తగ్గలేదని లెక్కల్లో స్ఫష్టమవుతోంది. గడిచిన ఐదేళ్లలో రెవెన్యూ లోటు చూస్తే దాదాపు రూ. 66 వేల కోట్లు దాటింది. మొత్తం లోటు చూస్తే లక్షా 40 వేల కోట్లుకు చేరింది. అప్పు 3 లక్షల కోట్లకు చేరింది. విద్యుత్ పరంగా చూస్తే దాదాపు 20 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలో ముంచకుండా భావితరాల భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావించి ముందడుగు వేసింది.

Back to Top