అప్పులు, సప్పులుపై ప్రతిపక్ష నేతలు ఆరోపణలు హేయం

ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్  

 కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వ రాబడులు భారీగా తగ్గాయి

  కరోన కట్టడికి రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు రూ. 7,130.19 కోట్ల పైమాటే
 
  టీడీపీ హయాంలో విచ్చలవిడిగా అప్పులు, ఆ భారాన్ని మోస్తున్న ప్రభుత్వం

 కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థలు కుదేలు
 
 అన్ని రాష్ట్రాలు, దేశాలు అప్పులు చేస్తున్నాయి

  పరిమితికి లోబడే అప్పులు చేస్తున్నాం.. తప్ప పరిమితికి మించి కాదు

  విచక్షణతో అప్పులు చేసి కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకున్నాం

  చదువే పిల్లలకిచ్చే అతి పెద్ద ఆస్తి అంటూ రూ. 25,914.13 కోట్లు ఖర్చు చేశాం

  కరోనా కష్టకాలంలో కూడా అవ్వాతాతలకు ఇంటిఇంటికి రూ. 37,461.89 కోట్ల పెన్షన్లు పంపిణీచేశాం

 అక్క చెల్లెమ్మలకు వైయస్సార్‌ ఆసరా, వైయస్సార్‌ చేయూత, వైయస్సార్‌ సున్నావడ్డీల ద్వారా రూ. 17,608.43 కోట్ల లబ్ధి చేకూర్చాం

  తద్వారా మహిళల్లో స్వయం ఉపాధి మార్గాలకు బాటలు వేసి వారి కుటుంబాల సుస్థిర ఆర్థిక ప్రగతికి తోడ్పాటు నందించాం

  ఇలా అన్నిరకాలుగా సామాన్యులకు భరోసా కల్పించిన ప్రభుత్వమిది

 నేరుగా ప్రజల చేతిలో డబ్బు పెట్టడంవల్ల వస్తువులు, సేవల డిమాండ్‌ను దెబ్బతినకుండా కాపాడగలిగాం

  ప్రజలనే కాదు.. ఆర్థికవ్యవస్థ వలయంలో ఉన్న కంపెనీలను, వాటి ఆధారంగా లక్షలాదిమంది ఉపాధిమార్గాలను నిలబెట్టగలిగాం

  పధకం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని టీడీపీ కుట్రలు చేస్తోంది

 అవాస్తవాలు, అసంబద్ధ ప్రచారాలతో ఒక వ్యూహం ప్రకారం టీడీపీ విషప్రచారం చేస్తోంది
                          

తాడేప‌ల్లి: అప్పులు, సప్పులుపై ప్రతిపక్ష నేతలు ఆరోపణలు హేయమ‌ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిప‌డ్డారు.  కరోనా వల్ల మన రాష్ట్ర ప్రభుత్వ రాబడులు తగ్గలేదని ప్రతిపక్షం చేస్తున్న వాదనలు అవాస్తవమ‌న్నారు. గత ప్రభుత్వ సమయంలో అనగా 2014-15 నుండి 2018-19 వరకు GST, పెట్రోలియం ప్రోడక్ట్స్, మద్యం, వృత్తులపై ఉన్న పన్నుల మొత్తం 10.03% (CAGR)  మేర ప్రతి సంవత్సరం పెరుగుతూ వచ్చింద‌న్నారు.  కానీ 2019-20 మరియు 2020-21 లో పై పన్నుల  ఆదాయం కేవలం 1.30% (CAGR) మాత్రమే పెరిగింద‌న్నారు.  అనగా ఒక్క సంవత్సర కాల పరిమితిలో పై పన్నులలో సాధారణ పెరుగుదల (10.03%) లేకపోవడం వల్ల మన ప్రభుత్వం రూ. 7,947.07 కోట్లు ఆదాయం కోల్పోయింది. ఇంకా చెప్పాలంటే కరోనా లాక్ డౌన్ సమయమైన ఏప్రిల్ 2020 మరియు మే 2020 నెలలో పై పన్నుల నుండి రావాల్సిన ఆదాయము రూ.  4,709.24 కోట్లరు పడిపోయిందని చెప్సారు. శ‌నివారం మంత్రి బుగ్గ‌న ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

అలాగే రాష్ట్ర పన్ను ఆదాయం 2018-19లో  రూ. 58,107 కోట్లు ఉంటే, 2019-20లో ఎలాంటి పెరుగుదల లేకుండా రూ. 57,618.82 కోట్లు మాత్రమే ఉంది. 2020-21లో రూ. 57,378 కోట్లు మాత్రమే ఉంది. ఈ క్రమంలోనే 2021-22 సంవత్సరంలో కూడా కరోనా ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి పెద్ద మొత్తంలో గండిపడుతూ వస్తోంది.

కరోన కట్టడికి రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు రూ. 7,130.19 కోట్ల పైమాటే 

కరోనా సహాయ చర్యలకు, చికిత్సకు, మరియు వ్యాక్సిన్ కొనుగోలుకు మన రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా ఖర్చు చేయలేదంటూ అవాస్తవ ప్రచారాన్ని చేస్తున్నారు. ఇంతటి విపత్తు సమయంలో ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం శక్తివంచనలేకుండా పనిచేసిందనే విషయాన్ని గుర్తుచేస్తున్నాను.

 కరోనా మొదటి మరియు రెండవ ఉద్ధృతి సమయంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నయోజనకి కేంద్ర ప్రభుత్వ ఖర్చుకు అదనంగా మన రాష్ట్ర ప్రభుత్వం రూ. 3,092.05 కోట్లు ఖర్చు చేసి 15 నెలల పాటు 58.79 లక్షల బియ్యం కార్డులకు  106.64 కోట్ల కేజీల బియ్యాన్ని మరియు 4.69 కోట్ల కేజీల కందిపప్పుని పేద ప్రజలకు ఉచితంగా పంచి పెట్టింది. 

 అలాగే కరోనా కట్టడి మరియు చికిత్స కోసము అదనంగా మన రాష్ట్ర ప్రభుత్వం రూ.2,562.54 కోట్లు ఖర్చు చేసింది. 
 కరోనా కష్టకాలంలో ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకోవడం కోసం  రాష్ట్రప్రభుత్వమే రూ.1,000/- చొప్పున 1.35 కోట్ల కుటుంబాలకు రూ. 1,350 కోట్లు వారి బ్యాంకు ఖాతాలకు జమచేయడం జరిగింది. 
 కరోనా టీకా వెయ్యడంలో మన రాష్ట్రం దేశములో ముందుండి 37,60,360 టీకాలను రూ. 125.6 కోట్లతో కొనుగోలు చేయడమైనది.  

 మొత్తంగా మన ప్రభుత్వం కరోనా సమయంలో కేంద్ర సహాయం కాకుండా రూ. 7,130.19 కోట్లను ఖర్చు చేయడం జరిగింది. 
 అలాగే కరోనాతో దెబ్బతిన్న MSMEలను మరియు స్పిన్నింగ్ మిల్లులను కాపాడుకోవడం కోసం Restart ప్యాకేజితో పెండింగ్ లో ఉన్న రూ.2,086.89 కోట్ల ప్రోత్సాహకాలను ఇవ్వడం జరిగింది. 

టీడీపీ హయాంలో విచ్చలవిడిగా అప్పులు, ఆ భారం మోస్తున్న ప్రభుత్వం

రాష్ట్ర  ఆర్థిక పరిస్థితిలపై అవాస్తవాలు మరియు తప్పుడు లెక్కలు చెప్పి రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీయాలనుకోవడం ప్రతిపక్షానికి ఎంతమాత్రం తగదు.  అవాస్తవాన్ని పదేపదే చెప్పడం వల్ల అది ఎప్పటికీ నిజంకాదు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా మిగులు రాష్ట్రం.  మన ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో బకాయిలు ఎప్పుడు రూ. 10,000 కోట్లకు మించి లేవు. టీడీపీ మాత్రం, ఆపార్టీకన్నా ముందున్న ప్రభుత్వపు బకాయిలు రూ. 32,000 కోట్లని ఏ విధముగా చెపుతుందో వివరాలు తెలియ చేయాలని కోరుతున్నాము  . 

విభజన సమయంలో మన రాష్ట్రానికి అప్పును జనాభా దామాషా పద్దతిలో కేటాయించి, ఆస్తులను స్థానికత ఆధారంగా పంపకం చేసి మనకు తీరని అన్యాయం చేశారు. దీనికి తోడు గత టీడీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులను చేసి మన ఆర్ధిక స్థితిని కోలుకోలేని విధంగా దిగజార్చింది.  
 2014లో రాష్ట్ర విభజనతో  మనకు అప్పగించిన అప్పుల మొత్తం రూ.1,18,544.34 కోట్లు. 
ఆ తర్వాత గత ప్రభుత్వం 2014-15 నుండి 2018-19 వరకు ఇష్టానుసారంగా అప్పులు చేసి ఆ మొత్తాన్ని రూ.2,57,509.85 కోట్లకు పెంచింది.
 ఇంతే కాకుండా విధ్యుత్ శాఖకు సంబంధించి 2014-15లో రూ. 31,647.64 కోట్ల అప్పు వుంటే దానిని 2018-19కి రూ. 62,463.00 కోట్లకు అమాంతంగా పెంచి విద్యుత్‌రంగాన్ని కోలుకోలేని రీతిలో దెబ్బకొట్టారు.
 అలాగే విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు) కరెంట్ ఉత్పత్తిదారులకు ఇవ్వవలసిన బకాయిలు 2014-15లో  రూ. 4,817.69 కోట్లు వుంటే దానిని 2018-19కి రూ.20,121.97 కోట్లకు చేర్చారు. 
 అంతే కాకుండా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ (APCSC) పై రూ. 20,000 కోట్లు, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APRDC) పై రూ.3,000 కోట్లు, వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APWRDC) పై రూ.4,000 కోట్లు, CRDA పై రూ.5,014 కోట్లు, APTIDCO పై రూ.4,601.59 కోట్లు,  రైతు సాధికార సంస్థ పై రూ.2,000 కోట్లు, APSRTCపై రూ. 1,356 కోట్లు, డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్ (APDWC)పై రూ. 980 కోట్లు, హోసింగ్ కార్పొరేషన్ (APSHC) పై రూ. 1,870 కోట్లు మరియు ఇంకా చిన్న చిన్న కార్పొరేషన్లను కలుపుకుంటే ఇంకో రూ. 10,000 కోట్లు అప్పులు చేశారు. 
     మొత్తంగా గత ప్రభుత్వం వివిధ కార్పొరేషనల ద్వారా రూ. 1,00,000 కోట్లకు పైగా అప్పులు  చేసింది. 
 ఇంకా గత ప్రభుత్వం చివర 2 సంవత్సరాలలో 2 నుంచి 3 సంవత్సరాల మారటోరియంతో భారీగా అప్పులు తీసుకోని మన ప్రభుత్వంపై వచ్చిరాగానే అప్పుల రీపేమెంట్ భారము మోపింది.
     అదే విధంగా గత ప్రభుత్వం SDLsకు అదనంగా పబ్లిక్ అకౌంట్స్ నుండి రూ.16,419.00 కోట్ల అప్పుచేయడంవల్ల ఈ కరోన సంవత్సరంలో (2021-22) FRBM Act ప్రకారం ఉన్న మన రాష్ట్ర అప్పు పరిమితిని కేంద్ర  ప్రభుత్వం కుదించింది. ఇలా గత ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చేసి రాష్త్ర ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. 

అప్పు చేసిన ప్రతీ పైసాకి లెక్కచెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం

గత ప్రభుత్వం చేసిన అప్పుల మొత్తాన్ని నీరు-చెట్టు పథకం లాంటి పేరుతో దోచుకుని విదేశీయాత్రలు, భాగస్వామ్య సదస్సులు, నవనిర్మాణదీక్షలు అంటూ దుబారా చేశారు. కాని మన ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1,27,105.81 కోట్ల అప్పు చేసి అందులో రూ.1,05,102.22 కోట్లు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతుల,  అక్క చెల్లెమ్మల, అవ్వతాతల, విద్యార్థుల బ్యాంకు ఖాతాలకు ఈ కరోనా కష్ట కాలంలో కూడా వివిధ పథకాల ద్వార జమ చేసి ఆదుకుంది. మా ప్రభుత్వం వెచ్చిం చిన ప్రతి రూపాయికి ఆధార్ నెంబర్ తో సహా లబ్ధిదారుల లెక్క ఉంది. వివక్షకు తావులేకుండా, పైసా అవినీతిలేకుండా, ప్రాంతాలకు, రాజకీయాలకు సంబంధం లేకుండా అర్హతే ప్రాతిపదికన అత్యంత పారదర్శకత విధానం ద్వారా ఈ డబ్బును నేరుగా వారిచేతిలో పెట్టాం. ఎవరికి ఎంత డబ్బు ముట్టిందో ఆధార్‌ నంబర్‌సైతం లబ్ధిదారుల వివరాలను మేం చెప్పగలం. మరి గత ప్రభుత్వ నాయుకులు వారు,చేసిన అప్పులకు లబ్ధిదారులు ఎవరో పారదర్శకంగా వివరాలు చెప్పగలరా? అని అడుగుతున్నాము.

అప్పులు ఎలా అంటే..?
 
(1)    FRBM Act ప్రకారం  రాష్త్ర స్థూల ఉత్పత్తి పెరిగే కొద్దీ అప్పు విలువ యొక్క పరిమితి పెరుగుతూ వస్తుంది. 
(2)    ఉదాహరణకు 2014-15లో రాష్త్ర స్థూల ఉత్పత్తి రూ.5,26,470 కోట్లు ఉంటే ఆ సంవత్సరానికి FRBM Act ప్రకారం అప్పు పరిమితి రూ. 15,794.1 కోట్లు (3% of GSDP) ఉంది. 
(3)    అదే 2018-19లో రాష్త్ర స్థూల ఉత్పత్తి రూ.9,33,402 కోట్లు ఉంటే రూ. 28,002.06 కోట్ల అప్పు పరిమితిగా ఉంది. 
(4)    కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర భారత్ ప్యాకేజి కింద కరోనా సమయంలో అధనంగా 2% GSDP (రూ 20,000 కోట్లు) అప్పును అనుమతించింది.
అనుమతించిన ఈ నిబంధనల మేరకే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తోంది.

సంక్షేమము మరియు స్థిరమైన అభివృద్ధి మన ప్రభుత్వానికి ప్రాధాన్యతలు: 

కరోనా కారణంగా ప్రభుత్వానికి రాబడి తగ్గి, కరోనా చికిత్సకు అదనంగా ఖర్చుపెడుతూ, గత ప్రభుత్వం విచ్చలవిడిగా చేసిన అప్పులకు కంతులు కడుతూ, ఈ కరోనా సమయంలోను ప్రతి ఒక్కరి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుంటే మన ప్రభుత్వం సంక్షేమానికి ఖర్చుచేయట్లేదని గత ప్రభుత్వ పెద్దల చెప్పడం ప్రజలకే విడ్డూరంగా ఉంది. 

రుణమాఫీ పేరుతో రైతుల నడ్డి విరిచిన చంద్రబాబు

మన ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం. గత  ప్రభుత్వం సంపూర్ణ వ్యవసాయ రుణమాఫీ అని చెప్పి రూ. 87,612 కోట్ల రైతు రుణాలుంటే వాటిని రూ. 20,000 కోట్లకు కుదించి అందులో కూడా తగ్గించి 5 విడతలలో కేవలం రూ. 15,279.42 కోట్లు (17.44%) మాత్రమే ఖర్చు చేసారు. కేవలం 2 సంవత్సరాలలోనే మన ప్రభుత్వం ప్రతి రైతుకు రూ. 44,500 అందచేసింది.  ఈ విధముగా గత ప్రభుత్వం 5 సంవత్సరాలలో రుణమాఫీ కలుపుకొని రైతులకు ఇచ్చిన డబ్బులు వారి రుణాల వడ్డీకి కుడా సరిపోక పూర్తిగా మోసపోయి అప్పుల ఊబిలో కూరుకు పోయేలా చేసి ఇవాళ గత ప్రభుత్వ నాయకులు రూ. 1 లక్ష ఇచ్చామని చెప్పుకోవడం సిగ్గుచేటు.

రైతులకు ఎంత చేసిన తక్కువేనని భావించే ప్రభుత్వం మనది  

మన ప్రభుత్వము చెప్పిన మాట మీద నిలబడి ప్రతి రైతన్నకు 5 సంవత్సరాలలో రూ.67,500/- ఇస్తూ ముందుకు వెళ్తుంది. ఇప్పటి వరకు రైతు భరోసా కింద 52.38లక్షల రైతన్నలకు గత రెండేళ్ల కరోనా కష్టకాలంలో కూడా PMKSYని కలుపుకొని మొత్తం రూ. 17,029 కోట్లతో ఆదుకుంది. 
అంతే కాకుండా గత రెండు సంవత్సరాలలో  మన ప్రభుత్వము రూ.1,105.89 కోట్లతో సున్నా వడ్డీ పంట రుణాలను, రూ.3,788.25 కోట్లతో ఉచిత పంట భీమాను, రూ.1,055.19 కోట్లతో ఇన్పుట్ సబ్సిడీని మరియు రూ.331.58 కోట్లతో మత్స కార భరోసాను అందించడమే కాకుండా రైతు భరోసా కేంద్రాలు, టెస్టింగ్ ల్యాబ్ లు, ప్రతి పంటకు కనీస మద్దతుధర మొదలగు వినూత్న పథకాలను అమలుచేస్తుంది. 
అలాగే మన రైతన్నలు పండించే ప్రతి పంటకు గిట్టుబాటు ధర రావాలని ధాన్యం మినహా ఇతర పంటలకొనుగోలు కోసం రూ.౫౯౬౪ కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. 
సున్నావడ్డీ రుణాలు, ఉచిత పంటల భీమా, పగటిపూట నాణ్యమైన విద్యుత్‌ అందించడానికి ఫీడర్ల పెంపు మొత్తంగా రెండేళ్లకాలంలో రైతులకోసంఈ ప్రభుత్వం ఖర్చుచేసింది అక్షరాల రూ.౮౩,౧౦౨.౧౮ కోట్లు. ఇందులో ధాన్యం కొనుగోళ్లకోసమే రూ.౩౦,౪౦౫.౬౨ కోట్లకుపైగా ఖర్చుచేశాం.

చదువు మన పిల్లలకిచ్చే అతి పెద్ద ఆస్తి – దీనికోసం రూ. 25,914.13 కోట్ల ఖర్చు

మన ప్రభుత్వం ఫీజు రీయింబర్సుమెంట్ కుదించిందని ప్రతిపక్ష నాయకులు చెప్పడ  ప్రజలకు హాస్యాస్పదంగా ఉంది. గత ప్రభుత్వం సగటున 16.73 లక్షల మందికి 2014-15 నుండి 2018-19 వరకు రూ.13,420.65 కోట్లు ఖర్చు చేసి అందులో కూడా రూ. 2,012.03 కోట్లు బకాయిలు పెట్టివెళ్లారు.  మన ప్రభుత్వం కేవలం రెండేళ్ల వ్యవధిలో అమ్మ ఒడి పథకం కింద 43.41 లక్షల ఇంటర్ వరకు చదివే విద్యార్థిని విద్యార్థులకి రూ. 13,022.93 కోట్లు, జగనన్న విద్య దీవెన, వసతి దీవెన కింద 10.90 లక్షల ఇంటర్ పైన చదివే విద్యార్థులకి రూ. 7,843.05 కోట్లు మొత్తం కలిపి రూ. 20,865.98 కోట్లు ఈ కరోనా కష్ట కాలంలో కూడా విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమ చేసింది. 
గత ప్రభుత్వంలో సుమారు 7.9 లక్షల ఇంటర్ విద్యార్థులు చాలీ చాలని ట్యూషన్ ఫీజు (ఒక సంవత్సరానికి రూ. 2,900), మెయింటెనెన్సు ఫీజులతో (ఒక నెలకు రూ.400 నుండి రూ.600) సతమవుతుంటే మన ప్రభుత్వం వారికి అమ్మ ఒడి వర్తింపచేసి రూ.15,000/- చొప్పున వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తుంది. అలాగే మన బడి నాడు నేడుతో మొదటి దశలో 15,715 స్కూళ్లలో రూ. 3,669 కోట్లతో పది మౌలిక సదుపాయాలను కల్పించాము. 
ప్రభుత్వ స్కూల్లో చదివే 47.32 లక్షల పేద విద్యార్థులకు ఆత్మ విశ్వాసాన్ని మరియు ఆత్మ గౌరవాన్ని పెంపొందించే విధముగా మన ప్రభుత్వం రూ.1,379.15 కోట్లతో విద్యా కానుకను అమలుచేస్తుంది. చదువుకు పేదరికం అడ్డుకాకూదని ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ సిలబస్, కొత్త విద్య పాలసీ అమలుతో విద్య వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తూవుంటే మేము ఫీజు రేయింబర్సుమెంట్ కుదించామనడం ప్రతిపక్ష నాయకుల దిగజారుడుతనానికి పరాకాష్ట. 

అక్క చెల్లెమ్మలకు ఆసరా, సున్నా వడ్డీ రుణాలు, చేయూత ద్వారా రూ. 17,608.43 కోట్ల లబ్ది
గత ప్రభుత్వం డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు బ్యాంకు రుణాల మాఫీ చేస్తామని మభ్యపెట్టి రుణాల కంతుల కూడా కట్టుకోనివ్వకుండా డిఫాల్టర్లను చేసి డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేసింది. 2014 లో మొత్తం రూ. 21,479 కోట్ల డ్వాక్రా రుణాలుంటే ఒక్క రూపాయ కూడా మాఫీ చేయకుండా డ్వాక్రా మహిళలను నిండా ముంచారు. మన ప్రభుత్వం కేవలం రెండు సంవత్సరాలలో  వైయ‌స్ఆర్‌ ఆసరాతో రూ. 6,310.68 కోట్లు, వైస్సార్ సున్నా వడ్డీ పథకంతో రూ. 2,354.22 కోట్లు, వైస్సార్ చేయూతతో రూ. 8,943.53 కోట్లు మొత్తం కలిపి రూ. 17,608.43 కోట్లు ఖర్చు చేసింది. 

 వైయ‌స్ఆర్‌ ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజలకు పూర్తి ఆరోగ్య భరోసాః

గత ప్రభుత్వం వైయ‌స్ఆర్‌  ఆరోగ్యశ్రీని పూర్తిగా నీరుగారిస్తే మన ప్రభుత్వం ఆరోగ్యశ్రీని సమగ్రంగా పటిష్ట పరిచి ప్రజలకు భరోసానిచ్చింది. గత ప్రభుత్వ హయాంలో 1,059 జబ్బులు ఆరోగ్యశ్రీ కింద ఉంటే మన ప్రభుత్వం వాటిని 2,346కి పెంచింది. మన ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలలోనే 12.48 లక్షల మంది రోగులు రూ. 4,342.05 కోట్లతో చికిత్స పొందారు. అలాగే ఆరోగ్యశ్రీ కింద సుమారు రూ. 668.77 కోట్ల వ్యయంతో 1.97 లక్షల కోవిడ్ రోగులు చికిత్స పొందారు. 
మన ప్రభుత్వం డాక్టర్ వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద సరిహద్దు జిల్లాల ప్రయోజనాల కోసం తెలంగాణ, కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాలలో 130 ఆసుపత్రులు ఎంపానెల్ చేసింది.  డా. వైయ‌స్ఆర్‌ ఆరోగ్య ఆసరా పథకం ద్వారా శస్త్రచికిత్స అనంతర రికవరీ వ్యవధిలో BPL రోగుల రోజువారీ వేతన నష్టాన్ని భర్తీ చేయడానికి రోజుకు రూ. 225 అందచేస్తుంది. 
గత ప్రభుత్వం 104, 108 అంబులెన్సు సర్వీసులను పూర్తిగా బలహీన పరిస్తే మన ప్రభుత్వముకు ప్రాణం విలువ తెలుసు కాబట్టి 104,108 అంబులెన్సు సర్వీసులను బలోపేతం చేసే దిశగా రూ. 206.44 కోట్లతో 1,066 కొత్త అంబులెన్సు వాహనాలు మరియు ఆధునిక వైద్య పరికరాలు కొనడము జరిగింది. ఇవాళ ప్రతి మండలానికి ఒక 104, 108 అంబులెన్సు సర్వీసులను ప్రజలకు అందుబాటులో ఉంచడమైనది. పైన తీసుకున్న చర్యలవల్ల 104, 108 అంబులెన్సు సర్వీసులలో మెరుగుదల వచ్చి ఈ కరోనా కష్టకాలంలో ప్రజల ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ విధముగా మన ప్రభుత్వం అన్ని రకాలుగా ఆరోగ్యశ్రీని పటిష్ఠపరిచి పేద ప్రజలను కాపాడుకొంటుంటే ప్రతి పక్ష నాయకుల మన సంక్షేమం గురించి ఎద్దేవా చేయడం దురదుష్టకరంగా భావిస్తున్నాము.  

అవ్వాతాతలకు కరోనా కష్టకాలంలో కూడా ఇంటిఇంటికి రూ. 37,461.89 కోట్ల  పెన్షన్లు
గత ప్రభుత్వం ఎన్నికలకు ౨ నెలల వరకూ కేవలం వేయి రూపాయలు మాత్రమే పెన్షన్‌ ఇచ్చింది. ఎన్నికలకు ౬నెలల ముందువరకూ కూడా క్షేత్రస్థాయిలో ఇచ్చిన పెన్షన్లు కేవలం ౩౯లక్షలు మాత్రమే. మన ప్రభుత్వం అవ్వాతాతల కష్టాలను అర్థం చేసుకొని ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ కరోనా కష్ట కాలంలో కూడా వాలంటీర్ల ద్వారా ఇంటి ఇంటికి వెళ్లి ప్రతి నెలలో మొదటి రోజునే పెన్షన్ అందిస్తూ వస్తుంది. గత ప్రభుత్వం 5 సంవత్సరాల లో పెన్షన్లకు రూ. 26,403.57 కోట్లు ఖర్చు చేస్తే మన ప్రభుత్వం కేవలం 2 సంవత్సరాల 3 నెలల్లో నే రూ. 37,461.89 కోట్లు ఖర్చు చేసింది. పెన్షన్‌ను రూ.౨౨౫౦కి పెంచింది.
అవ్వాతాతలకు జన్మభూమి కమిటీలని కులం, పార్టీ, ప్రాంతం పేరుతో పెన్షన్లు గత ప్రభుత్వం ఎగ్గొడితే అదే మన ప్రభుత్వంలో 2020-21లో 59.82 లక్షల పెన్షన్ల పంపిణి చేస్తూ సాచురేషన్ పద్ధతిలో కొత్తవి మంజూరు చేస్తున్నాము.

నేతన్నకు వెన్నుదన్నుగా ప్రభుత్వం 
నేతన్నలకు గత ప్రభుత్వం 5 సంవత్సరాలలో కేవలం రూ.259.04 కోట్లు ఖర్చు చేయగా మన ప్రభుత్వం గత 2 సంవత్సరాలలో రూ.575.87 కోట్లతో సగటున 80,000 వేల మందికి లబ్ది చేకూర్చింది. మన ప్రభుత్వు కేవలము 2 సంవత్సరాలలోనే   ప్రతి నేతన్నకు రూ.72,000/- లబ్ది చేకూర్చింది. 
మన ప్రభుత్వం ఈ కరోనా కష్ట కాలంలో పై విధముగా ప్రతి పేద వాడిని కాపాడుకోవాలని సంక్షేమము మరియు అభివృద్ధి చేస్తుంటే, ప్రతి పక్ష నాయకులు ఒక పథకం ప్రకారం లక్షల కోట్లు అప్పు అని విషప్రచారం చేసి రాజకీయ లబ్ది పొందాలని చూడడం హేయమైన చర్య. మీ భాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు మరియు తప్పుడు లెక్కలతో మన ఆర్థిక వ్యవస్థకు, మన ప్రజలకు తీరని నష్టం చేకూరుస్తున్నారని ఇప్పటికైనా తెలుసుకోవాలి. ఈ కఠినమైన సమయంలో ప్రభుత్వానికి సహకరించి ఒక నిర్మాణాత్మక ప్రతి పక్ష పార్టీగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Back to Top