ఢిల్లీ: రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులతో పాటు అదనపు సాయం అందించి రాష్ట్ర అభివృద్ధికి చేయూతనివ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరడం జరిగిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వివరించారు. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రితో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి భేటీ అయ్యారు. బుగ్గన వెంట ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం, ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉన్నారు. భేటీ ముగిసిన అనంతరం మంత్రి బుగ్గన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మీడియా మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు, వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సాయం, రాష్ట్రానికి పునర్ వ్యవస్థీకరణ చట్టం కింద రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, పీడీఎస్‌కు సంబంధించిన పెండింగ్ నిధులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి జీఎస్‌స్టీ సంబంధించిన పన్ను వంటి అంశాఫై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చించడం జరిగిందన్నారు. కరోనా విపత్తు వలన ఆర్థికంగా రాష్ట్రం మీద ఆర్థిక ఒత్తిడి చాలా ఉందన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి ఒక్క అంశంపై ఒక వివరణ ఇచ్చారని, ఆ వివరణ కేంద్ర ఆర్థిక మంత్రికి తెలియజేసి తద్వారా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధులతో పాటు అదనంగా ఆర్థిక సాయం ఇవ్వాల్సిందిగా కోరడం జరిగిందన్నారు.