అనంతపురం: కార్పొరేటర్లు, కౌన్సిలర్ల అభిప్రాయాల ప్రకారమే మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్లను ఎంపిక ఉంటుందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అందరి ఆమోదంతోనే ఎంపిక చేస్తామన్నారు. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కార్యాలయం నుంచే పేర్లు ప్రకటించడం జరుగుతుందన్నారు. అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలతో మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికపై చర్చించారు. అదే విధంగా అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డిప్యూటీ మేయర్ ఎంపికపై కార్పొరేటర్ల నుంచి అభిప్రాయాలు సేకరించారు. అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల్లో సీఎం వైయస్ జగన్‌పై ఉన్న అభిమానం చెక్కు చెదరలేదన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఏకైక సీఎం వైయస్ జగన్ అన్నారు. 11 కార్పొరేషన్లలోనూ ప్రభంజనంలా సీఎం వైయస్ జగన్ నాయకత్వానికి ప్రజలు పట్టం కట్టారన్నారు. ఈ విజయంతో బాధ్యత మరింత పెరిగిందని, రానున్న రోజుల్లో మరింత అంకితభావంతో పనిచేస్తామన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ప్రజల ఆదరణ ఎప్పుడూ ఉంటుందన్నారు. అందరి ఆమోదంతో మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎంపిక చేస్తామన్నారు. కొత్త ఆర్డినెన్స్‌తో ఇద్దరు డిప్యూటీ మేయర్లు ఉండబోతున్నారని వివరించారు.