విభజన కంటే.. బాబు హయాంలోనే ఎక్కవ నష్టం

రాష్ట్రాన్ని శ్మశానం కంటే హీనంగా తయారు చేశాడు
చంద్రబాబు చేసిన నష్టాన్ని లెక్కలతో సహా నిరూపిస్తాం

ధర్నా చేసిన రైతులను కాల్చి చంపించిన ఘనత బాబుది

పచ్చ పత్రికలు ప్రభుత్వంపై పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నాయి

ప్రజా అభివృద్ధే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ధ్యేయం

మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

 విజయనగరం: అభివృద్ధి చేయాల్సిన రాష్ట్రాన్ని చంద్రబాబు శ్మశానం కంటే హీనంగా తయారు చేశాడు. రాష్ట్ర విభజనలో జరిగిన నష్టానికంటే.. గత ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి జరిగిన నష్టం వంద రెట్లు ఎక్కువ. రాష్ట్రాన్ని 20 సంవత్సరాల వెనక్కు తీసుకెళ్లాడని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనుభవంతో రాష్ట్రాన్ని బాగుచేస్తానని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు.. ప్రజలిచ్చిన ఐదేళ్ల అద్బుతమైన అవకాశాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతే ధ్యేయంగా 20 సంవత్సరాలు రాష్ట్రాన్ని వెనక్కునెట్టాడని, అన్నీ అంకెలతో సహా, లెక్కలతో సహా చెబుతామన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడని ఫైరయ్యారు. రూ. 55 వేల కోట్ల అప్పును రూ.2.4 లక్షల కోట్లకు తీసుకెళ్లాడని, అది కాకుండా రూ. 40 వేల కోట్లు పెండింగ్‌ బిల్లులు పెట్టి వెళ్లిపోయాడన్నారు. అప్పులు చేసినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన దాఖలాలు లేవన్నారు.

రాజధాని నిర్మాణానికి లక్షా 9వేల కోట్ల రూపాయల ప్రణాళిక తయారు చేసి ఐదేళ్లలో కేవలం రూ. 4900 కోట్లు మాత్రమే ఖర్చు చేశాడన్నారు. రూ.1.90 లక్షల కోట్లు అదనంగా అప్పు చేసి ఎందుకు రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేకపోయావని చంద్రబాబును ప్రశ్నించారు. ఏ పని చేసినా.. దాంట్లో ఏం వస్తుంది. ఏ రకంగా దోచుకుందామనే కార్యక్రమం తప్ప అభివృద్ధి చేయాలనే ఆలోచన చంద్రబాబుకు రాదన్నారు. అభివృద్ధి చేయాల్సిన రాష్ట్రాన్ని శ్మశానానికంటే హీనంగా తయారు చేశాడన్నారు. ఏం చూడటానికి అమరావతి వస్తావని మాట్లాడితే.. బాబు భజన చేసే పత్రిక తన మాటలను వక్రీకరిస్తూ రాసిందన్నారు. చంద్రబాబు అమరావతిని కాదు.. రాష్ట్రాన్ని శ్మశానంగా తయారు చేశాడన్నారు.

బషీర్‌బాగ్‌లో రైతులు ధర్నా చేస్తే కాల్పులు చేయించి చంపించిన చరిత్ర చంద్రబాబుదన్నారు. బాబు హయాంలో ఆకలి బాధలు తట్టుకోలేక రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. రాజధాని పవిత్ర దేవాలయం అని మాట్లాడే యనమలకు ఆ దేవాలయాన్ని నిర్మించాలనే ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. గతంలో ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల అవినీతి కార్యక్రమాల్లో భాగస్వామి కాదా..? అని ప్రశ్నించారు. రైతుల దగ్గర భూములు తీసుకొని వాటిని అభివృద్ధి చేసి ఎందుకు ఇవ్వలేకపోయారని నిలదీశారు. లక్షా 9 వేల కోట్ల బడ్జెట్‌ తయారు చేసి 4 శాతం ఖర్చు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో కేవలం నాలుగు బిల్డింగ్‌లు అసంపూర్తిగా కట్టారని, దాంట్లో 90 శాతం పూర్తయింది హైకోర్టు మాత్రమేనని, మిగిలిన మూడు బిల్డింగ్‌లు 60 శాతం కూడా పూర్తికాలేదన్నారు.
 
ఆరు నెలల కాలంలో ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ 80 శాతం పూర్తి చేశారన్నారు. మరో పక్క రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తుంటే చంద్రబాబుకు, పచ్చ పత్రికలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ల్యాండ్‌ పూలింగ్‌లో తీసుకున్న భూములు అభివృద్ధి చేసి ఇవ్వాలని, అది మన బాధ్యత అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చెప్పారన్నారు. ఆ ప్రకారం ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు. వక్రభాష్యం, వక్ర బుద్ధితో కొన్ని పత్రికలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. చంద్రబాబును భుజాన మోసే పత్రికలు ఏం రాసుకున్నా అభ్యంతరం లేదని, ఎన్నికలకు ముందు ఇంతకు వంద రెట్లు వైయస్‌ జగన్, వైయస్‌ఆర్‌ సీపీపై బురదజల్లేలా రాశారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతీ సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్నారని, ఇప్పటి వరకు 80 శాతం హామీలను అమలు చేశారని, మిగిలిన వాటిని కూడా పూర్తి చేస్తామన్నారు. ప్రజల తాలూకా అభివృద్ధి ప్రభుత్వానికి ముఖ్యమని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

Read Also: మార్కెట్‌ యార్డు కమిటీల్లో 50 శాతం మహిళలకే

 

Back to Top