తాడేపల్లి: వరద బాధితులను పరామర్శించేందుకు చంద్రబాబు వెళ్లలేదని, ఆయనది రాజకీయ పర్యటన అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మా నాయకుడిని విమర్శించేందుకు చంద్రబాబు పర్యటనలు చేస్తున్నారని, ప్రతిపక్ష నేత ఆరోపణలను ఖండిస్తున్నామని చెప్పారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బొత్ససత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ప్రెస్‌మీట్‌లో మంత్రి బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడారంటే..: ఆదుకున్నాం. అండగా నిల్చాం: రాష్ట్రంలో 6 జిల్లాలలో వరద ప్రభావం చూపింది. ఈ స్థాయిలో గతంలో ఏనాడూ వరదలు రాలేదు. నిన్న, మొన్న సీఎంగారు పర్యటించారు. బాధితులకు అందిన సహాయాన్ని అడిగి తెలుసుకున్నారు. వరద బాధితుల సహాయ కార్యక్రమాల్లో అందరూ పని చేయాలన్నదే ప్రభుత్వ అభిమతమని సీఎంగారు అన్నారు. ఆరు జిల్లాలో దాదాపు 3.46 లక్షల మంది వరద ప్రభావానికి లోనయ్యారు. వారిని పునరావాస శిబిరాలకు తరలించాం. సుమారు 219 సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో దాదాపు 1.80 లక్షల మందికి బస కల్పించి, ఆహారం, నీళ్లు అందించాం. దాదాపు 45 లక్షల నీళ్ల ప్యాకెట్లు సరఫరా చేశాం. గోదావరి వరదల్లో ఏడుగురు చనిపోయారు. ఆ కుటుంబాలకు పరిహారం ఇచ్చాం. వారే కాకుండా పునరావాస కేంద్రాల్లో ఉండి ఇంటికి వెళ్తున్న వారికి రూ.2 వేలు, 25 కేజీల బియ్యం, లీటర్ నూనె, కేజీ పప్పు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు కూడా ఇచ్చాం. అవే కాకుండా ప్యాకేజీ ప్రకారం వారికి అన్నీ అందజేస్తాం. ఏదైనా చిత్తశుద్ధితో..: ఇవి కాకుండా పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పక్కాగా ఇస్తామని సీఎంగారు చెప్పారు. పక్కా ఇళ్లు కట్టించిన తర్వాతే తరలిస్తామని వెల్లడించారు. మాది చిత్తశుద్ధితో పని చేసే ప్రభుత్వం. అంతే తప్ప చంద్రబాబు మాదిరిగా ప్రచారం చేసుకునే అలవాటు మాకు లేదు. అదే పనిగా ఉపన్యాసాలు: చంద్రబాబు తన పర్యటనల్లో వరద బాధితులను ఓదార్చడానికి బదులు రాజకీయ ఉపన్యాసాలు చేస్తున్నారు. రెండు నిమిషాలకు ఒకసారి జగన్‌గారిని విమర్శించడమే ఆయన పని. అసలు చంద్రబాబు హయాంలో వరద బాధితులకు బట్టల కోసం రూ.2 వేలు, ఇతర సామాగ్రి కోసం మరో రూ.2 వేలు ఇచ్చాడట. రూ.2.50 లక్షలతో ఇళ్లు కట్టించి ఇచ్చాడట. అసలు చంద్రబాబు హయాంలో వరదలు ఎప్పుడొచ్చాయి. కరువే తప్ప. పోలవరం ఆలస్యానికి కారణం ఎవరు?: సూటిగా అడుగుతున్నాం. పోలవరం ప్రాజెక్టు పనులు ఆలస్యం కావడానికి కారణం ఎవరు? ఆ ప్రాజెక్టును వైయస్సార్ గారు ప్రారంభించి, కాలువలు తవ్వించాడు. చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చినా, 2017 వరకు ఒక్క పిడికెడు మట్టి కూడా వేయలేదు. ఒక్క పని కూడా చేయలేదు. ఎంతసేపూ స్వార్థం, కమిషన్ల యావ తప్ప. పోలవరం ప్రాజెక్టు స్వయంగా కడతామని రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టాడు. చివరకు హోదాను కూడా తాకట్టు పెట్టాడు. ఓర్వలేక. దిక్కు తోచక: ఇవన్నీ అందరికీ తెలుసు. కానీ అక్కడికి పోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఓర్వలేక కడుపు మంట. కార్యకర్తలను తీసుకువచ్చి, వారికి మూడు మైకులు ఇచ్చి మాట్లాడిస్తున్నాడు. ఎందుకంటే వరద బాధితులకు అన్నీ అందాయి. తమను ఆదుకున్నారని అందరూ చెబుతున్నారు. దాంతో చంద్రబాబుకు దిక్కు తోచడం లేదు. అధికారులు బాగా పని చేశారు. జిల్లా కలెక్టర్ మొదలు సచివాలయాల సిబ్బంది వరకు, మంత్రులు మొదలు సర్పంచ్‌ల వరకు అందరూ కలిసికట్టుగా పని చేశారు. అది ప్రభుత్వ బాధ్యత. వరద బాధితులకు పూర్తిగా పునరావాస చర్యలు తీసుకున్నాం. అంతేతప్ప నీకోసం కాదు. నీవు వస్తున్నావని కాదు. బాధ్యతగా ఆదుకున్నాం: సుమారు 1.80 లక్షల మందిని శిబిరాలకు తరలించాం. మొత్తం 546 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాం. అన్ని ఔషథాలు అందుబాటులో ఉంచి ఎక్కడా అంటువ్యాధులు ప్రబలకుండా చూస్తున్నాం. శిబిరాల్లో ఉన్న వారిని అన్ని విధాలుగా ఆదుకున్నాం. మేము ఎక్కడా సహాయ, పునరావాస పనుల్లో రాజీ పడలేదు. హెలికాప్టర్ల ద్వారా 30 టన్నుల ఆహారాన్ని సరఫరా చేశాం. పాల ప్యాకెట్లు, బిస్కట్ ప్యాకెట్లు, నీటి ప్యాకెట్లు, కూరగాయలు అందించాం. చాలాచోట్ల బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాం. ప్రతిదీ ఒక బాధ్యతగా భావించి పని చేశాం. అంతేతప్ప ప్రచారం కోసం కాదు. అందుకే అన్ని పనులు జరిగిన తర్వాత, స్వయంగా వెళ్లిన సీఎంగారు ప్రతి చోటా ప్రజలతో వివరాలు ఆరా తీశారు. అందుకే ప్రజలు ఆయనను ఆమోదించారు. జగన్‌గారు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ గురించి కూడా చెప్పారు. దానికి రూ.20 వేల కోట్లు కావాలని, అది కేంద్రం నుంచి రావాలని వెల్లడించారు. ప్రకటించిన ప్యాకేజీ ఇస్తామని స్పష్టంగా చెప్పారు. ప్రజలు కూడా ఆమోదించారు. బురద రాజకీయాలు. డ్రామాలు: సీఎంగారి పర్యటన చూశాక, చంద్రబాబుకు దిక్కు తోచడం లేదు. అందుకే వచ్చి బురద రాజకీయాలు చేస్తున్నాడు. డ్రామాలు ఆడుతున్నాడు. పసుపు చొక్కాలు, కండువాలు, పసుపు జెండాలు. చంద్రబాబుకు జైజైలు. వరద పీడిత ప్రాంతాల్లో ఆ విధంగా రాజకీయాలు చేయడం నీకు తప్పు అనిపించడం లేదా? చావు దగ్గర కూడా నీవు రాజకీయాలు చేస్తున్నావు. నీకు చివరకు చావుకు, పుట్టినరోజుకు, మరో సందర్భానికి తేడా తెలియడం లేదు. మొత్తం 365 రోజూలు రాజకీయాలేనా? అదే పనిగా ఊకదంపుడు రాజకీయాలేనా? నీ విమర్శలు ఖండిస్తున్నాం: జగన్‌గారు వరద పీడిత ప్రాంతాల్లో రెండు రోజులు పర్యటించారు. వరదల్లో అందరూ కలిసికట్టుగా పని చేసి, బాధితులను ఆదుకున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా అండగా ఉంటాం. ఆదుకుంటాం. అందుకే చంద్రబాబు చెప్పిన ప్రతి అబద్ధాన్ని ఖండిస్తున్నాం. ఇప్పటికైనా చంద్రబాబును చెప్పమనండి. ఏ వరదల్లో ఎవరిని ఆదుకున్నాడో? ఎక్కడ ఎన్ని ఇళ్లు కట్టించి ఇచ్చాడో? అవెలా చేయాలో మాకు తెలుసు: పోలవరం ప్రాజెక్టు పనులు ఎలా చేయాలో మాకు తెలుసు? నిధులు ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు. ఏ విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలో, నిధులు తెచ్చుకోవాలో మాకు తెలుసు. చంద్రబాబు మాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. పోలవరం ప్రాజెక్టును ఏటీఎం మాదిరిగా ఎవరు వాడుకున్నారనేది సోము వీర్రాజు గారు, ఒకసారి వెనక్కువెళ్లి చూసుకుంటే తెలుస్తుంది. సాక్షాత్తూ ప్రధానిగారే అన్నారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఒక ఏటీఎంలా వాడుకున్నారని. కాస్త ఆగితే అన్నీ తెలుస్తాయి: రెండు రోజుల పోతే, ఎవరు పెయిడ్ ఆర్టిస్టులు, ఎవరు పార్టీ కార్యకర్తలు. ఎవరు నిజమైన బాధితులని అందరికీ తెలుస్తుంది. పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకోవడం, ఆ విధంగా డ్రామాలు చేయడం, రాజకీయాలు చేయడం చంద్రబాబుకు అలవాటు. ఆయన రాజకీయ పుట్టుకే ఒక జిమ్మిక్కులతో వచ్చింది. కాదంటారా చెప్పండి? కేంద్రానికి పరిమితులు లేవా?: రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి, అప్పుల నియంత్రణకు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఎఫ్‌ఆర్‌బీఎం వంటివి ఉన్నాయి. మరి కేంద్రానికి అవెందుకు లేవు? అదేమన్నా వ్యక్తిగతమా? ఇన్నేళ్లలో ఈ విధమైన పరిపాలన ఏనాడూ చూడలేదు. ఇవాళ చూస్తున్నాం. ఆయనేమైనా నడిచి వెళ్లారా?: చంద్రబాబుది రాజకీయ పర్యటన. బాధితులను ఓదార్చే పర్యటన కాదు. ప్రతి నిమిషం మా నాయకుణ్ని విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు ఏనాడైనా ఎక్కడికైనా హెలికాప్టర్‌లో వెళ్లకుండా నడిచి పోయాడా? ఎప్పుడైనా హెలికాప్టర్‌లో వెళ్లి, అక్కడి నుంచి కారులో వెళ్తారు. జగన్‌గారు కూడా అదే చేశారు. చంద్రబాబునాయుడు కరకట్ట వద్ద ఉన్న తన ఇల్లు లింగమనేని ఎస్టేట్ నుంచి కారులో, హెలికాప్టర్‌లో కాకుండా నడిచి పోయాడా? వరదల సమయంలో సీఎంగారు వెళ్తే, ఏం జరుగుతుంది. అధికారులంతా ఆయన చుట్టూనే ఉంటారు. దాంతో సహాయ పనులు ఎలా జరుగుతాయి? చాలా జాగ్రత్త వ్యవహరించాం: 2010లో కృష్ణా నదికి వరదలు వచ్చాయి. అప్పుడు సీఎంగారు నన్నే పంపించారు. సీఎంగారు హైదరాబాద్‌లో ఉన్నారు. నేను స్పాట్‌లో అన్నీ చూసుకున్నాను. పరిస్థితి తీవ్రత తగ్గిన తర్వాత సీఎంగారు వచ్చారు. ఇంకా కావాల్సినవన్నీ చేస్తారు. వరదల గురించి ముందే సమాచారం వస్తే, చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాం. అందుకే ప్రాణనష్టం లేకుండా చూశాం. నిజానికి చంద్రబాబు ఉన్నప్పుడు అవేవీ చేయలేదు. ఇది వాస్తవం. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి, ఆహారం, నీళ్లు, మందులు అన్నీ అందుబాటులో ఉంచి ఆదుకున్నాం. ప్రభుత్వం అంటే ఇది. అంతేతప్ప విమర్శలు. టీవీల్లో ప్రచారం చేసుకోవడం కాదు. జగన్‌గారు కేవలం సహాయ, పునరావాస పనులపైనే దృష్టి పెడతారు తప్ప, ప్రచారంపై కాదు. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తాం. ఇంకా బాగా ఆదుకుంటాం.