ఎవరికి లాభం చేకూర్చేందుకు ఇదంతా

రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిలా నిమ్మగడ్డ ప్రెస్‌మీట్‌

వ్యక్తిగత స్వార్థాలు, అవసరాల కోసం అధికారాన్ని ఉపయోగించొద్దు

నోటిఫికేషన్‌ ఇవ్వకుండానే అధికారులను బదిలీలు చేసేస్తారా..?

చంద్రబాబు హయాంలో స్థానిక ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు

మీకు పదవి ఇచ్చారనా..? మీ సామాజిక వర్గానికి చెందినవాడనా..?

నిమ్మగడ్డ ప్రచారం చేసినా టీడీపీకి 10 శాతం సీట్లు కూడా రావు

వ్యాక్సినేషన్‌ సమయంలో ఎన్నికల నిర్వహణ సమంజసం కాదు

ప్రజారోగ్యం ప్రభుత్వానికి ప్రధాన బాధ్యత

మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

నెల్లూరు: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిలా మాట్లాడుతున్నారని, ఎస్‌ఈసీకి అధికారంలో పాటు బాధ్యతలు కూడా ఉంటాయని తెలియదా..? అని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. చంద్రబాబుతో నిమ్మగడ్డ రమేష్‌ లాలూచి పడ్డారని, రాజ్యాంగ వ్యవస్థలో నిమ్మగడ్డ లాంటి వ్యక్తులు ఉండటం దురదృష్టకరమన్నారు. వ్యక్తిగత అవసరాల కోసం నిమ్మగడ్డ పనిచేసతున్నారని, ప్రజల ప్రాణాలే ముఖ్యమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. రేపు ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిది? అని ప్రశ్నించారు. 

నెల్లూరులోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్‌ కుమార్‌ యాదవ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ఉన్నప్పుడు పంచాయతీ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు..? మీకు పదవి ఇచ్చారనా..? మీ సామాజిక వర్గానికి చెందినవాడనా..? అప్పుడు మీ బాధ్యత గుర్తుకు రాలేదా..? ఈ రోజు తొందరెందుకు.. ఎన్నికలు మూడు నెలలు ఆలస్యం అయినా నష్టం లేదు. ప్రజల ప్రాణాలు ప్రభుత్వానికి ముఖ్యం. 

ప్రపంచం అంతా కోవిడ్‌తో బాధపడుతుంది. ప్రధానమంత్రి కూడా ఎవరికీ హాని జరగకూడదని పదే పదే జాగ్రత్తలు చెబుతున్నారు. వ్యాక్సిన్‌ పంపిణీని ప్రారంభించి విడతల వారీగా చేపడుతున్నారు. ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైయస్‌ జగన్‌ నాయకత్వంలో కోటికి పైగా కరోనా పరీక్షలు నిర్వహించాం. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం అనేక జాగ్రత్తలు చేపడుతున్నాం.  

చాలా ఎన్నికలు చూశాం కానీ, నిమ్మగడ్డ ప్రెస్‌మీట్‌ చూస్తే ఆశ్చర్యమేస్తుంది. నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్‌గా కాకుండా రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిలా మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ, వ్యక్తిగత స్వార్థాల కోసం, అవసరాల కోసం పనిచేయకూడదు. అధికారాన్ని ఉపయోగించుకోకూడదు. 

రేపు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అంటున్నాడు. కోవిడ్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ఆయన ఎన్నికలు పెడతాడంట. ఎన్నికలు వద్దని ప్రభుత్వం కోరుతుంటే.. మాకు సంబంధం లేదు.. ఆ బాధ్యత మీదేనని ప్రభుత్వంపై నెట్టేస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదు..? 
 
మార్చిలో జరగాల్సిన ఎన్నికలు ఎవరి తాలూకా ప్రోద్బలంతో వాయిదా వేశారు..? ఆ రోజున రాష్ట్రంలో 50 పాజిటివ్‌ కేసులు కూడా లేవు. ఈ రోజు వందల కేసులు వస్తున్నాయి. ప్రస్తుతం వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుంది. రెండో విడత వస్తుందని హెచ్చరికలు వస్తున్న తరుణంలో ఎన్నికలు నిర్వహించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు. 

వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైయస్‌ఆర్‌ సీపీకి ప్రజలు 151 సీట్లు కట్టబెట్టారు. ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను రాజ్యాంగ సంస్థలు  గౌరవిస్తూ అధికారాలను ఉపయోగించుకోవాలి. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేయడం వ్యవస్థలను తప్పుదోవపట్టించడమే.. 

నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయకముందే అధికారుల బదిలీ అంటూ నిమ్మగడ్డ ఆదేశాలిస్తున్నారే.. ఎవరికి లాభం చేకూర్చేందుకు ఇదంతా చేస్తున్నారు. ఐఏఎస్‌లో ఇదేనా మీకు నేర్పించింది. సుప్రీం కోర్టు నుంచి తీర్పు వచ్చేవరకు ఆగకుండా ఎందుకింత ఆత్రుత, ఎవరి కోసం, ఏం సాధించడానికి, ఎవరిని మెప్పించడానికి ఈ గాబరా. పదవి ఇచ్చిన చంద్రబాబుకు పారితోషికం చెల్లించుకోవడానికా..? ఎన్నికలు జరిగితే చంద్రబాబుకు 10 శాతం సీట్లు అయినా వస్తాయా..? నిమ్మగడ్డ ప్రచారం చేసినా చంద్రబాబుకు 10 శాతం సీట్లు కూడా రావు’ అని బొత్స సత్యనారాయణ అన్నారు.  
 

తాజా వీడియోలు

Back to Top