ఇంటింటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు

మంత్రి బొత్స సత్యనారాయణ

తాడేపల్లి:  గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తన పాదయాత్రలో పేదల కష్టాలు కళ్లారా చూశారని, అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 95 శాతం అమలు చేశారని చెప్పారు. అవినీతికి తావులేకుండా రాష్ట్రంలో పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి వివరించారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో కరోనా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకున్నామన్నారు. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్‌మెంట్‌ ద్వారా కరోనా విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోగలిగామని, కరోనాను కూడా ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చి ఉచితంగా వైద్యసేవలందించామన్నారు. కోటి మందికి పైగా కరోనా పరీక్షలు చేసి భయాందోళనలు తొలగించామన్నారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకొని కరోనాను కట్టడి చేశామన్నారు.

గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం..
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నెరవేర్చారని చెప్పారు.గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలను ఇంటి వద్దకే చేర్చామన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేదల సొంతింటి కలను నెరవేర్చారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.3075 లక్షల మందిపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు.

విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి
ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పేదింటి పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదవాలనే సంకల్పంతో వారికి విద్యలో మంచి పునాది వేసేందుకు చర్యలు తీసుకున్నారన్నారు. పేదరికం చదువుకు అడ్డు కాకూడదని అమ్మ ఒడి వంటి పథకాన్ని ప్రవేశపెట్టి 82 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూరేలా దాదాపు 42 లక్షల మంది తల్లుల ఖాతాలో ప్రతి ఏటా రూ.15 వేలు జమ చేసి ప్రోత్సహిస్తున్నామన్నారు. పిల్లలు బడి మానుకోకుండా వారికి జగనన్న గోరుముద్ద పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన ద్వారా చదువులను ప్రోత్సహిస్తున్నామన్నారు.పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందిస్తున్నారని చెప్పారు. జగనన్న విద్యా కానుక అందించామని చెప్పారు. నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చుతున్నామని తెలిపారు.  

ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చామని మంత్రి వెల్లడించారు. వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చామని, ఆరోగ్య ఆసరా ద్వారా ఆపరేషన్‌ చేయించుకున్న వారు కోలుకునే వరకు డబ్బులు అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాడు–నేడు ద్వారా మార్పులు తీసుకొచ్చే కార్యక్రమాలు చేపట్టామన్నారు. వైద్య సిబ్బంది నియామకాలు, ఖాళీలు భర్తీచేస్తున్నామన్నారు.

కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు
రాష్ట్రంలో కులమతాలకు అతీతంగా, ప్రాంతాలు, పార్టీలు చూడకుండా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అర్హత ఉంటే చాలు ఎవరి సిపార్సులేకుండానే ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని చెప్పారు. రైతు భరోసా, వైయస్‌ఆర్‌ జలకళ,  వైయస్‌ఆర్‌ చేయూత, చేదోడు, వైయస్‌ఆర్‌ వాహన మిత్ర వంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలన సాగిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
 

Back to Top