ఆ తర్వాతే రాజధానిపై నిర్ణయం

అన్ని జిల్లాల అభివృద్ధే ధ్యేయం 

విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా చేయడం చంద్రబాబుకు ఇష్టం లేదా

మంత్రి బొత్స సత్యనారాయణ

అమరావతి : హైపవర్ కమిటీ నివేదికను పరిశీలించిన తర్వాత రాజధానిపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. తమ ప్రభుత్వానికి తప్ప ప్రాంతీయ ద్వేషం ఉండదని మంత్రి బొత్స స్పష్టం చేశారు.  హైదరాబాద్‌ను తలదన్నే రాజధానిని ఏపీలో అభివృద్ది చేయాలంటే విశాఖపట్నంను మించి మరో ఆప్షన్ లేదని,ఇది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు.  బొత్స సత్యనారాయణ  మీడియాతో మాట్లాడుతూ..  భారతదేశంలో శరవేగంగా అభివృద్ది చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటి అన్నారు. హైదరాబాద్‌ను మించి అభివృద్ధి చెందుతున్న విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా చేయడం చంద్రబాబుకు ఇష్టం లేదా అని నిలదీశారు. వెనుకబడిన ప్రాంతాలు,కరువుతో అల్లాడిన ప్రాంతాలు అభివృద్ది చెందడం మీకు ఇష్టం లేదా అని ప్రశ్నించారు. కేవలం ఒక టౌన్‌షిప్‌ను తయారుచేయడం ద్వారా అభివృద్ది సాధ్యపడదని, ఐదు కోట్ల మంది ఆర్థిక స్థితి గతులు మెరుగుపడవన్నారు.

గత ప్రభుత్వం మొత్తం రూ.1లక్షా 90వేల కోట్లు అప్పులు తెచ్చిందని, అందులో కేవలం రూ. 5వేల కోట్లు మాత్రమే రాజధాని కోసం ఖర్చు పెట్టిందని అన్నారు. మిగతా డబ్బును ఏం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అవసరాలను,ఆర్థిక స్థితిగతులను పట్టించుకోకుండా రాజధానిపై ఇష్టారీతినా నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు.

రాజధానిపై సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. రాజధానిపై సుజనా చౌదరి చెప్పిందేమైనా వేదమా..? శాసనమా..? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఫెడరల్ వ్యవస్థలో నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందన్నారు. గత ప్రభుత్వంలో తప్పులు జరిగాయి కాబట్టే.. ఇప్పుడు రాజధానిని మార్చాల్సివస్తుందన్నారు. అశోక గజపతిరాజు కూడా రాజధాని నిర్ణయంపై విమర్శిస్తున్నారని, అసలు ఐదేళ్లు కేంద్రమంత్రిగా ఉన్న ఆయన ఉత్తరాంధ్రకు ఏం చేశారని ప్రశ్నించారు. ఎవరెన్ని విమర్శించినా, ఏం ఆరోపించినా జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో వైయస్‌ఆర్‌సీపీ  కార్యాచరణ కొనసాగుతుందన్నారు. హైపవర్ కమిటీ నివేదికను పరిశీలించిన తర్వాత రాజధానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. తమ ప్రభుత్వానికి అన్ని జిల్లాల అభివృద్ధే ధ్యేయం తప్ప ప్రాంతీయ ద్వేషం ఉండదని మంత్రి బొత్స స్పష్టం చేశారు. 
రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు, వనరులు, రాష్ట్ర అవసరాలను అన్నింటిని కలుపుకొని రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, రాష్ట్రంలో ఉన్న వనరులు ఏంటి? అన్నది చర్చిస్తాం. నీటి వనరులు ఎలా ఉన్నాయో అంచనా వేసి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. అక్షరాస్యతలో వెనుకబడ్డాం. రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు వెనుకబడ్డాయి. ఈ ప్రాంతాలను ఏవిధంగా అభివృద్ధి చేయాలి. పక్కనే గోదావరి ఉన్నా..తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా ఎలా రూపొందించాలి. రైతులను ఎలా అదుకోవాలి..అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌గా ఎలా తయారు చేయాలన్నది హైపవర్‌ కమిటీ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సమగ్రంగా పరిశీలన చేసుకోవాలి.  రాష్ట్ర బడ్జెట్‌ రూ.2.20 లక్షల కోట్లు ఉన్న నేపథ్యంలో మన అవసరాలు, సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చుపెడుతున్న వనరులను కూడికరించుకొని, ఇప్పటికే అరకొరగా ఉన్న పరిస్థితులను అధిగమించేందుకు ఏ రకంగా ముందుకు వెళ్లాలనే ఆలోచనతో ఓ రూట్‌ మ్యాప్‌ను తయారు చేసేందుకు ఈ రోజు హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేశాం. విభజన సమయంలో జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ ఓ నివేదిక ఇచ్చింది. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని ఆ నివేదికలో పొందుపరిచారు. కేంద్రం శివరామకృష్ణ కమిటీ నియమించింది. ఆ కమిటీ కూడా నివేదిక ఇచ్చింది. రాజధాని ఎక్కడ ఏర్పాటుచేసుకోవాలని నివేదిక ఇచ్చింది. పరిపాలన వికేంద్రీకరణ ఎలా ఉండాలో ఆ కమిటీ చెప్పింది. వైయస్‌ జగన్‌ సీఎం అయ్యాక మూడో కమిటీ ఏర్పాటు చేశారు. మెరుగైన పరిస్థితులను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు, తప్పులు సరిదిద్దేంకు కమిటీ ఏర్పాటు చేశారు. ఈ మూడో కమిటీ కూడా పై రెండు కమిటీలకు దగ్గర్లోనే నివేదికలు ఇచ్చింది. రెండు కమిటీల నిపుణులను, శాస్త్రియ విధానాన్ని, రాష్ట్రంలో అర్థిక పరిస్థితులను చంద్రబాబు గతంలో పరిశీలనలో తీసుకోకుండా, ఆ రోజు పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణతో ఓ కమిటీ వేశారు. రాజకీయ అవసరాల కోసమే ఆ కమిటీ ఏర్పాటు చేశారు. విజయవాడ పక్కనే రాజధానిని గుర్తించారు. రెండు దశల్లో రాజధాని నిర్మించాలని, మొదట రూ.49 వేల కోట్లతో నిర్మించాలని ఆ కమిటీ నిర్ణయించింది. చంద్రబాబుకు ప్రజలు అవకాశం ఇస్తే..రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపించాల్సింది పోయి అవకాశాన్ని చేజార్చుకున్నారు. స్వార్థపూరిత రాజకీయాలు చేశారు. ఆ రోజు ఆర్థిక పరిస్థితులు చూడకుండా అప్పులు చేసి రూ.5 వేల కోట్లు మాత్రమే రాజధానికి ఖర్చు చేశారు. అందులో కూడా రూ.1500 కోట్లు కేంద్రం ఇస్తే దాన్ని కూడా వినియోగించారు. వీటన్నింటిని పరిశీలనలో తీసుకొని రాజధానిపై నిర్ణయం తీసుకుంటామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. 

Back to Top